జపాన్ తరహా నిరసనను అడ్డుకున్న పోలీసులు
విజయవాడ సెంట్రల్ :
జపాన్ తరహా నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా బుధవారం మహిళా, సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద చీపుర్లతో ఊడ్చి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రరత్న భవన్ వద్ద ప్రారంభమైన ర్యాలీని పోలీసులు చుట్టుముట్టారు. ఆందోళన చేస్తున్న నాయకుల్ని ఈడ్చిపారేశారు. మహిళా కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. పరిస్థితి విషమించడంతో ఆందోళన కారులను పోలీసులు జీపులో ఎక్కించి కంకిపాడు, గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్లకు తరలించారు. తొలుత పోలీసుల తీరును నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు ఉపక్రమించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ పోలీసుల వైఖరిని ఖండించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చెప్పిన పద్ధతిలోనే తాము ఆందోళన చేపట్టామన్నారు. అయినప్పటికీ అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నారు. ఏపీసీసీ నాయకులు మీసాల రాజేశ్వరరావు, పరసా రాజీవ్ రతన్, మీసాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.