ఒంగోలు : బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ వి.పార్థసారధి డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం సమ్మె చేశారు. దానిలో భాగంగా యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక కోర్టు సెంటర్‌లోని ఆంధ్రాబ్యాంకు వద్ద నుంచి నెల్లూరు బస్టాండులోని ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచ్ వరకు మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అక్కడ నిర్వహించిన మహాసభలో పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పీఆర్‌సీ అమలుచేసేందుకు రెండేళ్లుగా బ్యాంకుల యాజమాన్యాలు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. వేతన సవరణ ఒప్పందాన్ని కూడా అమలుచేయకపోగా, ఉద్యోగులపై పనిభారం పెంచి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు యాజమాన్యాలతో పీఆర్‌సీ, వేతన సవరణ ఒప్పందాలు అమలుచేయించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అందుకు నిరసనగా చేపట్టిన సమ్మె కారణంగా జిల్లాలో మంగళవారం వెయ్యి కోట్ల రూపాయల క్లియరెన్స్‌లు, రూ.5 వేల కోట్ల నగదు లావాదేవీలు నిలిచిపోయినట్లు తెలిపారు.
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సర్దార్ మాట్లాడుతూ గత నెల 12వ తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెచేసినప్పటికీ యాజమాన్యాలుగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ స్పందించకపోవడాన్ని ప్రతిఒక్కరూ గర్హించాలన్నారు. ఏపీఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ పేరుతో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్లు ఖర్చుచేశారన్నారు. దానిలో సగం వెచ్చించినా బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘ నాయకుడు శరత్, ఐఏబీఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, జానకిరామయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు పారా శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, ఎన్‌సీబీఏ జోనల్ కార్యదర్శి విజయ్‌మోహన్, ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఎం.బాలసుబ్రహ్మణ్యం, ఐఏబీఓసీ జిల్లా అధ్యక్షుడు టి.మల్లికార్జునరావు, బెఫీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శోభన్‌బాబు, ఎ.వేణుగోపాల్, యు.వేణుగోపాల్, ఎం.నరేంద్రబాబు, కె.కృష్ణమోహన్, వెంకటరెడ్డి, నరేంద్ర, పి.బ్రహ్మయ్య, పి.నరసింహం, రాజేశ్వరరావు, సి.సాంబశివరావు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలపై స్పందించండి
Published Wed, Dec 3 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement