రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసినందున స్థానికేతరులు, జీహెచ్‌ఎంసీలో ఓటు లేనివారు, నగరం విడిచి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రచారానికి వచ్చినవారిని పార్టీలు, అభ్యర్థులు స్వచ్ఛందంగా నగరం బయటికి పంపించి సహక రించాలని కోరింది. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గడువు దాటాక కూడా ప్రచారం నిర్వహించే వారిపై కేసులు పెడతామని, రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా పడుతుందన్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందన్నారు. డిసెంబర్ ఒకటిన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు.
కోవిడ్ జాగ్రత్తలతో..
కోవిడ్–19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేసి ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలని పార్థసారధి కోరారు. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు 19 మందిని నోడల్ ఆఫీసర్లుగా నియమించి, వారి పర్యవేక్షణలో జాగ్రత్తలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటర్లు మాస్క్ ధరించాలని, క్యూలలో సామాజిక దూరం పాటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment