‘ఓటింగ్ పట్ల ఓటరు నిరాసక్తత, విముఖత ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం’ అన్నది అక్షరసత్యం. ఆదర్శవంతమైన ఆలోచనల పరంగానే కాకుండా శాస్త్రీయంగానూ ఇది రుజువైన అంశం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటింగ్ శాతం దయనీయంగా, సగం కన్నా తక్కువ నమోద వడం పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. నిపుణులు, మేధా వులు పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరైతే ఆవేదనను మించిన ఆవేశంతో స్పందిస్తున్నారు. ఓటేయని వారి హక్కును రద్దు చేయా లనో, ఆధార్‌కార్డు వెనక్కి తీసుకోవాలనో, ప్రభుత్వ సంక్షేమ ప్రయోజ నాలు వారికిక నిలిపివేయాలనో... తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓటరు నిర్లిప్తత, గైర్హాజరీని మరికొందరు సమర్థిస్తున్నారు.
రాజకీయ వ్యవ స్థను సరిదిద్దుకోండి తప్ప ఓటరును ఏమీ అనొద్దని వారి తరపున వకాల్తా పుచ్చుకు మాట్లాడుతున్నారు. ఇక, సామాజిక మాధ్యమ వేది కలపై ఈ ఇరుపక్షాల వాదనలకు, ఖండనమండనలకు, తిట్లపురాణా నికి అంతే లేదు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూసినా పట్టణ, నగర ప్రాంతాల్లో ఎందుకు ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది? అన్నది కాస్త లోతుగా పరిశీలించాల్సిన అంశం. ఈసారి హైదరా బాద్‌లో 47 శాతం మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏ ప్రమాణాలతో చూసినా ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. గడచిన ఇరవయ్యేళ్లలో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్ని పరిశీలిస్తే, కొంచెం కుడి ఎడమగా ఎప్పుడైనా ఇదే పరిస్థితి!
ఎందుకిలా జరుగుతోంది? కారణాలేంటి? ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడానికి దారితీస్తున్న కారణాల్ని గుర్తించి, తగు రీతిలో విశ్లేషించి, విరుగుడు మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటర్లందరూ క్రియాశీలంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొని, తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడవలసిన బాధ్యత ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, పౌరసమాజంపైన ఉన్నాయి. ఇందుకోసం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. కార్యాచరణ ఉండాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. లేకుంటే, ప్రజాస్వామ్యం మరింత అపహాస్యం పాల వుతుంది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, భాగస్వామ్య ప్రజా స్వామ్యం అన్న మాటలు అర్థం లేకుండా పోతాయి. నిర్ణయాధి కారంలో ప్రజల పాత్ర–ప్రమేయం దారుణంగా పడిపోతుంది. భంగ పోయేది ప్రజలే!
మలి విడత సంస్కరణలు రావాల్సిందే!
పట్టణ, నగర ఓటరు నిర్లిప్తత కొత్తది కాదు. స్వాతంత్య్రానంతర కాలంలో ఈ దురవస్థ ముదురుతూ వస్తోంది. ఎవరూ సరిగా పట్టిం చుకోవడం లేదు. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనే వరు సగా 2002 (41.22 శాతం), 2009 (42.95 శాతం), 2016 (45.27 శాతం), 2020 (46.55 శాతం) యాభైకన్నా తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే, ఎక్కువ చదువుకున్న వాళ్లు, ఐటీ తదితర రంగాల ఉద్యోగులు, ఆర్థిక స్థితిమంతులున్న ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం తగ్గిపోతోంది. ఈసారి కూడా పేదలు, పెద్దగా విద్యార్హతలు లేని వాళ్లు నివసించే బస్తీల్లో ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది. ఇది అఖిల భారత స్థాయి కొన్ని అధ్యయనాల్లో తేలినదానికి భిన్నం. పేదలు, అణచివేతకు గురైన వారే తక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటారని ‘ఎస్బీఐ–ఎకోరాప్’ దేశవ్యాప్త అధ్యయనం చెబుతోంది.
పేదలు ఎక్కువగా ఉన్న బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ వంటి ఉత్తరాధి రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదును ఈ నివేదిక ఉటంకించింది. అణచివేత తక్కువగా ఉండే హరియాణా, పంజాబ్‌లతోపాటు పౌర చైతన్యం గల దక్షిణాది కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఎక్కువ ఉండటాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. కానీ, నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో, అదీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రతిసారీ ఓటింగ్ శాతం తక్కువ నమోదవడం ఇందుకు భిన్నమైన పరిస్థితి. మెరుగైన ఆర్థిక స్థితిగతులకు, విద్యార్హతలకు ఓటింగ్ పట్ల అనురక్తి–బాధ్యతకు సంబంధమే లేదని, వారిలోనే అత్యధికులు గైర్హా జరవుతున్నారని ఇక్కడి గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వాలు, పాలక సంస్థ వైఫల్యాలను అంగీకరిస్తూనే, ఒకరకంగా ఇది వారి బాధ్యతారాహిత్యమని సామాజికవేత్తలంటున్నారు. తొలివిడత ఎన్ని కల సంస్కరణల్ని సమర్థంగా అమలుపరచిన టీ.ఎన్.శేషన్ వంటి అధికారులే ఇవి సరిపోవని, ఇంకో విడత సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. ఓటరును చైతన్యపరచి, ఓటింగ్ ప్రక్రియలో విధిగా పాల్గొనేట్టు వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అత్యధికులు ఓట్లు వేయలేదని నిందించడం కాకుండా, వారిని ఓటింగ్‌కు రప్పించలేని మన వ్యవస్థల దురవస్థను మార్చుకోవాలనేది సూచన.
ఏం విశ్వాసం కల్గిస్తున్నారని?
పోలింగ్‌కు 53 శాతానికి పైగా గైర్హాజరయ్యారని ఓటరును తప్పు బట్టేటప్పుడు ఏయే అంశాలు అందుకు కారణమై ఉంటాయో ఆలో చించాలి. హైదరాబాద్ ఓటరు ఓటింగ్ పట్ల నిర్లిప్తంగా ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఓటరు నమోదు, పేర్ల సవరణ, జాబితా ఖరారు... వంటి ప్రక్రియ సజావుగా జరగట్లేదు. అంతా అయి పోయాక, ‘అవును పొరపాట్లు జరిగాయి, నిజమే!.. ఇక ముందు జర క్కుండా సరిదిద్దుకుంటాం’ అని ఎన్నికల సంఘం ప్రకటిస్తే సరి పోతుందా? ఇటీవల ఒక టీవీ చర్చలో పొల్గొన్న పాలసీనిపుణుడు దొంతి నర్సింహారెడ్డి లేవనెత్తిన మూడంశాలు నాటి చర్చ సరళినే మార్చాయి. 1. సెలబ్రిటీలతో సహా, తమ ఓట్లు గల్లంతయ్యాయని ముందుగా చెప్పినా సవరించే వ్యవస్థ లేని ఎన్నికల ప్రక్రియపైనే ఓటర్లు విశ్వాసం కోల్పోతున్నారు.
2. ఒకవంక కరోనా మహమ్మారి భయపెడుతుంటే మరోవంక వరద బీభత్సం నుంచి నగరవాసులింకా కోలుకోని ఈ సమయంలో తగిన వ్యవధి ఇవ్వ కుండా ఎన్నికల నిర్వహణ సరైంది కాదు. 3. నగర సమస్యలు, అభివృద్ధి వంటి అంశాల్ని పక్కకునెట్టి ఇతరేతర విషయాల్ని ప్రచారంలోకి తెచ్చిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భవిష్యత్ పాలనపై ఏమాత్రం భరోసా ఇవ్వలేకపోవడం. ఫలితంగా, మొత్తం ఎన్నికల ప్రక్రియను ఒక తంతులా నిర్వహించారనే భావన నగర వాసుల్లో బలపడింది. గతంలో కనీసం ఓ ముసుగైనా ఉండేది, ఈ సారి ముసుగుకూడా లేకుండా, పచ్చిగా మతాన్ని ప్రచారాస్త్రం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. ఇవే ఓటరు నిరాసక్తతకు ప్రధాన కారణాలనే అభి ప్రాయం సర్వత్రా ఉంది. ఓటరు జాబితాల్లో పలు అవాంఛనీయ మార్పులు జరిగాయి. ఒకచోట భర్త ఓటుండి భార్యది గల్లంతు, మరో చోట భార్యది ఉండి భర్త ఓటు గాయబ్! ఒకోచోట గంపగుత్తగా ఓట్లు లేకపోవడం... ఇదీ జరిగింది. పోల్ చిట్టీల పంపిణీ సవ్యంగా జరుగ లేదు. ఓటర్ని చైతన్యపరిచే ప్రచారం కూడా అంతంతే! పోలింగ్ శాతం తగ్గడానికి ఇవన్నీ కారణమయ్యాయి.
మాదేనా....! ఎవరి నగరమిది?
‘ఉద్యోగ, ఉపాధి, వ్యాపార తదితర కారణాలవల్ల ఇక్కడ ఉంటున్నాం తప్ప ఈ నగరం మనది కాదు, మనమీ నగరానికి చెందిన వారం కాదు’ అన్న భావనే అధికుల్లో ఉంటోంది. ఎంతసేపూ సొంతూరిపైనే ధ్యాస! ముఖ్యంగా రాజకీయ పరమైన ఎన్నికలు వంటి ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనకపోవడానికి ఇదొక ముఖ్య కారణమని నిపుణుల విశ్లేషణ. అందుకే, లక్షలాది మందికి ఇక్కడే కాకుండా వారి స్వస్థలాలలోనూ ఓటుంటుంది. అక్కడ ఓటేస్తే చాలను కుంటారు. రెండు చోట్ల ఉండటం చట్టరీత్యా తప్పన్నపుడు, కొందరు నగరంలో తమ ఓటును రద్దు చేసుకున్నారు. ఇక్కడ ఓటున్నా వేయడానికి ఆసక్తి చూపరు. ‘ఈ నగరం మాది’ అని అందరిలో సొంతం చేసుకునే భావన తెచ్చే ఏ సాంస్కృతిక, సామాజిక కార్య క్రమాలూ ఇక్కడ జరుగవు.
ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ పనిగట్టుకొని ప్రత్యేకంగా అటువంటి ఏ పండుగా నిర్వహించవు. బోనాలు, సదర్, రంజాన్, క్రిస్టమస్ వంటి సంప్రదాయ పండుగ ల్లోనూ అంతో ఇంతో మూల హైదరబాదీలైన వారే ఉత్సాహంగా పాల్గొంటారు తప్ప, బయటి నుంచి వచ్చి స్థిరపడిన వారు, శివారు కాలనీల భాగస్వామ్యం అంతంతే! ఈసీ–మూసీ నదుల సంగమం, రిజర్వాయర్లకు వందే ళ్లయింది, గొప్ప ‘హైదరబాదీ’ పండుగ జరు పొచ్చు! ఎవరికీ పట్టలే! గోల్కొండ ఉత్సవాల ఊసేలేదు. అందర్నీ ఒక్కటి చేసే నగరాత్మ లేకుండా చేశారు. పైపెచ్చు, మతాల ప్రాతిపదికన విభజించే యత్నాలు ముమ్మరమయ్యాయి.
నగరానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ముఖ్యమంత్రో, మున్సిపల్ మంత్రో... అలా పైవాళ్లే తప్ప నగర పాలక సంస్థ, మేయర్, గవర్నింగ్ కౌన్సిల్‌ను నామమాత్రం చేయడాన్ని నగర పౌరులు బాగా గుర్తించారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఐక్యరాజ్య సమితి (యూఎన్) సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్జీడీ–16)ల్లో పేర్కొన్నట్టు సంస్థలు బలోపేతం కావాలి. అప్పుడే ప్రజలకు విశ్వాసం, వాటిపట్ల మమకారం పెరుగుతాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ ఓటింగ్ శాతాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిన అంశాలే!
ఇరువైపులా తప్పున్నట్టే!
ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధుల్ని, తద్వారా ప్రభుత్వాల్ని ఎన్నుకునే ఓటు హక్కు పౌరులకు జీవనరేఖ! ఎన్ని ఇబ్బందులున్నా, ప్రతికూల పరిస్థితులున్నా ఓటు వేయాలి. పల్లెటూర్లో ఒక నిర క్షరాస్యుడికి ఉన్న స్పృహ చదువరుల్లో కొరవడుతోంది. ఆ హక్కును వినియోగించుకొని పాలనా నిర్ణయాధికారంలో పౌరులు భాగస్వా ములు కావాలి. తాము కోరుకునే విధానాలు, వ్యవస్థల్ని అలా తెచ్చుకోవాలి. లేకుంటే అంతిమంగా నష్టపోయేది వారే! సౌకర్యాలు– అసౌకర్యాలనే దృష్టి కోణంలో ఆలోచించి ఓటు వేయకపోవడం సమర్థనీయం కాదు. రాజకీయ వ్యవస్థలు బాగో లేవనో, ప్రచా రాంశాలు దుర్మార్గంగా ఉన్నాయనో, అర్హులైన అభ్యర్థులు లేరనో.... భావించే ఓటర్ల గైర్హాజరీని, వారి నిరసనగా గౌరవించాలనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. అది తప్పు.
ఓటింగ్ శాతం తగ్గితే, నిర్ణయాధికారంలో ప్రజాభాగస్వామ్యం తగ్గినట్టే లెక్క! ఎందుకంటే, ఎంత తక్కువ శాతం పోలింగ్ జరిగినా ఎన్నిక రద్దయ్యే వ్యవస్థ లేనపుడు, తమ గైర్హాజరీ ప్రభావం శూన్యం. తాము పాల్గొనకుండా, జరిగే తక్కువ శాతం ఓటింగ్ వల్ల తమ అభీష్టానికి వ్యతిరేక ప్రతినిధులు వచ్చే, ప్రభుత్వాలు ఏర్పడే, నిర్ణయాలు జరి గిపోయే పరిస్థితిని పౌరులు నిలువరించలేరు. అది వారికి జరిగే నికర నష్టం, ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగే ఉమ్మడి నష్టం. ఓటరు ఉత్సా హంగా పాల్గొనే వ్యవస్థను కల్పించలేని ప్రభుత్వాల వైఫల్యం ఎంత తప్పో, నిర్లక్ష్యమో, ఉదాసీనతో, బద్దకమో, మరే నిర్హేతుక కారణ మైనా... పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అంతే తప్పు!
-దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment