సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో పోలైన ఓట్లను శుక్రవారం లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి కొంత ఎక్కువ సమయం పట్టనుంది.
తక్కువ ఓట్లు పోలైన మెహిదీపట్నం డివిజన్‌లో (ఒక్క రౌండ్‌లోనే) మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెల్లడి కానుంది. అధిక ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఫలితాలు చివరగా వచ్చే అవకాశాలున్నాయి. ఓట్ల ఆధిక్యతల రూపంలో మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాల సరళిపై స్పష్టత రానుంది. సాయంత్రం 4 గంటల వరకు అన్ని డివిజన్ల ఫలితాలు వెలువడతాయని ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 1న జరిగిన జీహెచ్‌ఎంíసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 74,67,256 ఓటర్లకు గాను 34,50 331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపు ఇలా..
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో కౌంటింగ్ హాల్.. ప్రతి హాల్‌లో 14 టేబుల్స్ ఉంటాయి. కౌటింగ్ హాళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్ల కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌లో 14 వేల చొప్పున ఓట్లు లెక్కిస్తారు. పోలైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య పెరగనుంది. బ్యాలెట్ బాక్స్‌లు తీసుకెళ్లే సిబ్బంది, బ్యాలెట్ పేపర్లను మిక్స్ చేసే వ్యక్తులకు పీపీఈ కిట్స్ అందించాలని ఎస్‌ఈసీ సూచించింది.
కౌంటింగ్ ఎలా?
► మొదటి విడతలో లెక్కింపు పోలింగ్ స్టేషన్ వారీగా జరుగుతుంది. ఇందులో బ్యాలెట్ పేపర్ల మడతలు విప్పకుండానే 25 ఓట్ల చొప్పున కట్టలుగా చేసి రబ్బర్ బ్యాండు వేసి, బ్యాలెట్ పేపర్ అకౌంట్‌తో సరిచూసి కట్టలను రిటర్నింగ్ అధికారి వద్ద గల డ్రమ్ములో వేస్తారు.
► రెండో విడతలో బ్యాలెట్ బండిళ్లు ఉన్న డ్రమ్ములోని బండిళ్లను జాగ్రత్తగా కలిపి ఆ హాలులో ఉన్న అన్ని కౌంటింగ్ టేబుళ్ల వద్దకు డ్రమ్ములో నుంచి 40 బండిళ్లను (వెయ్యి బ్యాలెట్ పేపర్లను) లెక్కింపు కోసం ఇస్తారు.
ఎన్నికల విధుల్లో మైనర్‌ను నియమించలేదు..
పదిహేడేళ్ల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు పోలింగ్ కేంద్రంలో నియమించినట్లు తెలిపింది. వెబ్ క్యాస్టింగ్ కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమించామని, వీరికి వయసుతో సంబంధం లేదని పేర్కొంది. మధ్యాహ్నం భోజనం చేయడానికి మాత్రమే ఆ కుర్రాడు ఇతర పోలింగ్ సిబ్బందితో ఉన్నాడని, అతడికి ఎన్నికల విధులు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
ఆ రెండు డివిజన్లలోనూ..
ఘాన్సీబజార్ డివిజన్(49), పురానాపూల్ డివిజన్ (52)లలో యథావిధిగా ఓట్ల లెక్కింపు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు డివిజన్లలో అవసరం ఉంటే కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. బీజేపీ చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఆయా పోలింగ్‌బూత్‌లలో రీపోలింగ్‌పై వెంటనే ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్, రిటర్నింగ్, పోలింగ్ అధికారుల నుంచి నివేదిక ఎస్‌ఈసీ తెప్పించుకుంది. ఈ డివిజన్లలో పెద్దగా గొడవలు జరగలేదని, బీజేపీ నేతల ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో రీపోలింగ్‌కు ఆదేశించే పరిస్థితులు లేవనే అభిప్రాయంతో ఎస్‌ఈసీ వర్గాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment