సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వంలోని దుర్గగుడి పాలకమండలి అవినీతి అక్రమాలతో భక్తులు విసుగెత్తిపోయారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం దుర్గగుడి నూతన పాలకమండలి, చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రానికి హాజరయ్యారు. దుర్గగుడి ఈఓ సురేష్‌బాబు 16 మంది సభ్యుల చేత ప్రమాణం చేయించారు. దుర్గగుడి పాలక మండిలి చైర్మన్‌గా పైలా సోమినాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న పాలక మండలి అభివృద్ధిని వదిలేసిందన్నారు. అమ్మవారికి వచ్చే ఆదాయాన్ని సైతం కాజేశారని ఆయన మండిపడ్డారు. చివరికి అమ్మవారికి సమర్పించే చీరలను సైతం వదల్లేదన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఓటమిపాలయ్యాడని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.
దేవస్థానం అభివృద్ధిలో సభ్యులు కీలక పాత్ర పోషించాలని వెల్లంపల్లి పాలక మండలికి సూచించారు. సభ్యులు చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. చీరలు దోచేసిన చరిత్ర గత పాలకమండలిదని.. అమ్మవారి ఆదాయాన్ని దోచుకోవడానికే గత ప్రభుత్వం, పాలకమండలి పాకులేడేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీని పాలకమండలి చైర్మన్‌గా చేశారని వెల్లంపల్లి కొనియాడారు. జగన్ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పాలకమండలిలో సగం మంది మహిళలకు అవకాశం కల్పించారన తెలిపారు. నూతన కమిటీ భక్తుల మన్ననలు పొందే విధంగా దుర్గగుడిని అభివృద్ధి చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సజావుగా దర్శనం చేసుకునే విధంగా చొరవ చూసుకోవాలని మండలి సభ్యులకు వెల్లంపల్లి సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గన్న ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. బలహీన వర్గానికి చెందిన సోమినాయుడుని దుర్గ గుడి చైర్మన్‌గా నియమించడం ఆనందించ దగ్గ విషయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పాలకమండలి ఏర్పాటు అయ్యిందని ఆయన తెలిపారు. గత పాలకమండలి అక్రమాలు చేయటానికి మాత్రమే ఉండేదన్నారు. తమ పాలకమండలి సభ్యులు భక్తుల సౌకర్యాలుకి పెద్ద పీట వేస్తారని తెలిపారు. 50 శాతం మహిళలకు పాలకమండలి సభ్యులుగా సీఎం జగన్ అవకాశం కల్పించారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment