ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యం
{పమాదాలు జరగుతున్నా ఆర్మీ ర్యాలీలో కనిపించని స్పందన
కనీస సౌకర్యాలు కల్పించని నిర్వాహకులు
తొలి రోజు నుంచీ అభ్యర్ధులకు ఇబ్బందులే
చికిత్సకు కేజీహెచ్‌కు వెళ్లినా నిరాశే
విశాఖపట్నం: వేలాది మంది యువకులు హాజరవుతున్న ఆర్మీ ర్యాలీలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. పరుగులో ప్రాణాలు కోల్పోతే తమకు సంబంధం లేదని ముందుగానే చెప్పామనే సాకుతో నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన పొన్నూరు నీలబాబు పరుగులో గెలిచి ప్రాణాలు కోల్పోయాడు. అయినా నిర్వాహకులు కళ్లు తెరవలేదు. మర్నాడే విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన పిల్లి వెంకట ఇప్పిలిరెడ్డి ర్యాలీలో పరుగుపెడుతూ అర్ధాంతరంగా కుప్పకూలాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్నత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంత జరుగుతున్నా కనీస అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లు చేయకపోవడం దారుణం. మరోవైపు అస్వస్థతకు గురైన అభ్యర్థులను చేర్చుకోవడానికి కేజీహెచ్‌లో సౌకర్యాలు తక్కువున్నాయంటూ వైద్యులు నిరాకరిస్తున్నారు.
ఈనెల 3 నుంచి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతున్న సంగతి తెలిసిందే.13వ తేదీ వరకూ జరిగే ఈ ఎంపికల్లో రోజూ సగటున 5వేల మంది హాజరవుతున్నారు. ఈ స్థాయిలో అభ్యర్ధులు వస్తారనే అంచనా ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయలేదనే విషయం తొలి రోజే తేలిపోయింది. వేలాదిగా తరలి వచ్చిన అభ్యర్ధులపై లాఠీచార్జ్ చేసి కొందరు సైన్యంలో చేరే అవకాశాన్ని కోల్పోయేలా చేశారు. తర్వాత పోర్టు స్టేడియంలో టోకెన్ల జారీ ప్రక్రియను, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 4గంటలకే పరీక్షలు ప్రారంభించి 7గంటల కల్లా పూర్తి చేయాలి. కానీ అభ్యర్ధులు ఆలస్యంగా వస్తున్నారంటూ మధ్యాహ్నం 11 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో అభ్యర్ధులు పరుగుదీయడం ప్రమాదమని తెలిసినా నిర్వాహకులు ర్యాలీని కొనసాగిస్తున్నారు. సమయపాలన కూడా పాటించడం లేదు. వైద్య సిబ్బందిని నామ మాత్రంగా నియమించారు. అత్యవసరమైనా కేజీహెచ్ వరకూ రావాల్సిందే.
అక్కడ కూడా తమ వద్ద పరికరాలు సరిగ్గా పనిచేయవని, నిపుణులైన డాక్టర్లకు ఖాళీ లేదనే అర్ధంలేని కారణాలతో అభ్యర్ధులను చేర్చుకోవడం లేదు. నీలబాబు విసయంలోనూ కేజీహెచ్ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపించాయి. ముందుగా చేర్చుకుని కేర్ ఆస్పత్రికి పంపించేశారు. గురువారం విజయనగరం జిల్లాకు చెందిన ఇప్పిలిరెడ్డిని కూడా చేర్చుకునేది లేదని ర్యాలీ నిర్వాహకులతో కేజీహెచ్ వైద్యులు వాదం వేసుకున్నారు. దానికే చాలా సమయం వృధా అయ్యింది. దీంతో అతనిని కూడా కేర్ అస్పత్రికి తరలించారు. ఇలా కాలయాపన చేయడం, ర్యాలీ ప్రదేశంలో కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడం, ఎండల్లోనే పరీక్షలు నిర్వహించడం వంటి కారణాలు అభ్యర్ధులకు ప్రాణసంకటమవుతున్నాయి.