Army rally
-
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం..
శ్రీకాకుళం: నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆర్మీ విశాఖపట్నంలో ఓపెన్ ర్యాలీ నిర్వహించనుంది. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, ఏవియేషన్, నర్సింగ్ అసిస్టెంట్, వెటర్నరీ, క్లర్క్, ట్రేడ్స్‌మేన్ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అభ్యర్థులు మాత్రమే ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులు. వేదిక ఎక్కడంటే.. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకూ నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. joinindianarmy.nic.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు మూడో తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. అదే నెల 9వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాలీకి హాజరయ్యే సమయాన్ని అందులో నిర్దేశిస్తారు. ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధిస్తే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తరువాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి చివరిగా రాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిన్నింటిలో మెరిట్ సాధించిన వారిని ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తారు. గత రెండేళ్లుగా ఓపెన్ ర్యాలీ నిర్వహించలేదు. గత ఏడాది ర్యాలీని ప్రకటించినా కోవిడ్ ఉధృతితో రద్దు చేశారు. ఈ ఏడాది నిర్వహిస్తామన్నా సెకెండ్ వేవ్ ఉధృతితో ఓపెన్ ర్యాలీ జరుగుతుందా? లేదా? అన్న అనుమానం వెంటాడింది. కానీ అనుమానాలను తెరదించుతూ తేదీలు ప్రకటించడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. నాలుగు దశల్లో నియామక ప్రక్రియ నియామక ప్రక్రియను నాలుగు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ మెజర్మెంట్, మెడికల్, రాత పరీక్షలుంటాయి. అన్ని విభాగాల్లో లభించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. చక్కటి అవకాశం నిరుద్యోగ యువతకు ఇదో చక్కటి అవకాశం. ఇంకా 40 రోజుల సమయం ఉంది. పరుగుతో పాటు ఇతర ఈవెంట్స్‌కు నిత్యం సాధన చేయాలి. రాత పరీక్షకు సన్నద్ధం కావాలి. పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో తెచ్చుకుంటే చాలామంచిది. అవసరమైతే శిక్షణ తీసుకోవడం ఉత్తమం. ప్రణాళికాబద్ధంగా సాధన చేసి చదివితే కొలువు సొంతమవుతుంది. విద్యార్హతలివీ.. సోల్జర్ జనరల్ డ్యూటీ: పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. 45 శాతం మార్కులు పొందాలి. ప్రతీ సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొంది.. 17–21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 2000 అక్టోబర్ 1, 2004 ఏప్రిల్ 31 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎత్తు 166 సెంటీమీటర్లు ఉండాలి. సోల్జర్ టెక్నికల్, ఏవియేషన్: అభ్యర్థులు 10+2, ఇంటర్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, ఇంగ్లిష్తో కూడిన సైన్స్ గ్రూపులో చదివి.. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందడంతోపాటు ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు సాధించాలి. 165 సెంటీమీటర్ల ఎత్తు, 23 సంవత్సరాల్లోపు వయసుండాలి. 1998–2004 మధ్య జన్మించి ఉండాలి. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/వెటర్నరీ: అభ్యర్థులు 10+2, ఇంటర్ పాసై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కూడిన సైన్స్ గ్రూపు చదివి ఉండాలి. వెటర్నరీ పోస్టులకు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. 50 శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు.. ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొంది ఉండాలి. 165 సెంటీమీటర్లు ఎత్తు, 23 సంవత్సరాల్లోపు వయస్సుండాలి.1998–2004 మధ్య జన్మించినవారు అర్హులు. సోల్జర్ క్లర్క్: అభ్యర్థులు 10+2, ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రూపుల వారు అర్హులు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. 23 సంవత్సరాల్లోపు (1998–2004 మధ్య జన్మించి) వయస్సుండాలి. -
ఆఖరిరోజూ అవస్థలతో ‘పోరు’
ముగిసిన ఆర్మీ ర్యాలీ సోల్జర్ టెక్నికల్ పోస్టులకు పరీక్షలు మెడికల్ టెస్టులకు ఎంపికైన 162 మంది ముగిసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ బోట్‌క్లబ్ (కాకినాడ) : అవస్థలు, అననుకూలతలు, అస్వస్థతల మధ్యే.. దేశరక్షణ దళంలో కొలువుల కోసం నిర్వహించిన పరీక్షలు సాగాయి. స్థానిక జిల్లా క్రీడామైదానంలో ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారంతో ముగిసింది. ఆరుజిల్లాలు, యానాం నుంచి వేలాదిమంది ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ర్యాలీ జరిగిన ప్రాంతంలో కాక రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీరామ్‌నగర్ మున్సిపల్ స్కూల్లో అభ్యర్థులకు వసతి కల్పించడంతో వారు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడలేదు. క్రీడామైదానం సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌లపైనే రాత్రి పడుకున్నారు. కొందరు ఆర్మీ క్యూలైన్లోనే సేదదీరారు. ఆఖరురోజు పలువురు అభ్యర్థులు పరుగు పరీక్షలో సొమ్మసిల్లి పడిపోయారు. ఒక అభ్యర్థి పరుగు పెడుతూ కింద పడిపోవడంతో తలకు గాయమయ్యింది. ఆర్మీ అధికారులు వెంటనే ప్రథమ చికిత్స చేసారు. అర్ధరాత్రి నుంచి ఎంపికలు నిర్వహించడంతో నిద్రలేమితో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని పలువురు అభ్యర్థులు వాపోయారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు 4,097 మందికి అడ్మిట్‌కార్డులు జారీచేయగా 2,998 మంది హాజరయ్యారని, 323 మందిని ఎత్తు చాలక తొలగించారని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2,575 మందిమందిలో 192 మంది పరుగు పరీక్షలో పాస్‌కాగా, వీరిలో 162 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. శుక్రవారంతో ర్యాలీ ముగియగా మెడికల్ పరీక్షలు కొనసాగుతాయన్నారు. -
వేలాదిగా అభ్యర్థులు
8వ రోజు కొనసాగిన ఆర్మీ ర్యాలీ బోట్‌క్లబ్ (కాకినాడ) : స్థానిక జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆర్మీ ర్యాలీలో 10వ రోజు గురువారం అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సరైన వసతులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఎంపికలు నిర్వహించడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అ«భ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. వారికి కనీసం మంచినీరు కూడా సక్రమంగా అందడం లేదు. సోల్జర్ టెక్నికల్‌కు 4097 మందికి అడ్మిట్‌కార్డులు జారీచేయగా 3096 మంది హాజరయ్యారని, ఎత్తు చాలక 456 మందిని తొలగించామని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2640 మందిలో 267 మంది పరుగు పరీక్షలో పాస్‌కాగా, వీరిలో 225 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. శుక్రవారం సోల్జర్ క్లర్క్‌లకు పోటీలు నిర్వహిస్తామన్నారు. -
నాలుగో రోజు కొనసాగిన ఆర్మీ ర్యాలీ
2,400 మంది హాజరు పరుగు పోటీల్లో కుప్పకూలిన అభ్యర్థి బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా క్రీడామైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగింది. ఆరు జిల్లాల నుంచి 2,700 మంది హాజరు కాగా, వీరిలో 2,400 మంది పరుగు పోటీల్లో పాల్గొన్నారు. పరుగు పోటీల్లో 291 మంది నిలవగా, మెడికల్ టెస్ట్‌కు 273 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఉత్సాహంగా పాల్గొంటున్న అభ్యర్థులు.. పరుగు పోటీల్లో డీలా పడుతున్నారు. కాగా పరుగు పందెంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన రెడ్డి రాంబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడికి వైద్యు ల పర్యవేక్షణలో ఆక్సిజన్ అందించారు. దీంతో అతడు కోలుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం రాంబాబును ఆస్పత్రికి తరలించారు. అధ్వానస్థితిలోనే రన్నింగ్ ట్రాక్ రెండు రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా రన్నింగ్ ట్రాక్ అధ్వానంగా తయారైంది. ట్రాక్‌కు మరమతులు చేయకుండానే పరుగు పోటీలు నిర్వహించారు. ట్రాక్‌పై ఎత్తుపల్లాలు ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. షూ లేకుండా పరుగు పందెంలో పాల్గొన్న అభ్యర్థులు మరింతగా అవస్థలు పడ్డారు. -
ఫిబ్రవరి 4 నుంచి ఆర్మీ ర్యాలీ
ఆరు విభాగాల్లో ఎంపికలు 21 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కొత్తగూడెం: దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీ అవకాశం కల్పిస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నారు. మొత్తం ఆరు విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెం దిన అభ్యర్థులకు మాత్రమే ఈ ఆర్మీర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పించారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్స్‌మన్ కేటగిరీలలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జాయిన్ఇండియన్ఆర్మీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, వారికి అడ్మిట్‌కార్డు జారీ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనవరి 19వ తేదీ తరువాత అడ్మిట్‌కార్డును ప్రింట్ఔట్ తీసుకోవాలని సూచించారు. వీరు అర్హులు: సోల్జర్ జనరల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17 సంవత్సరాల 6 నెలలు నుంచి 21 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులు 17 సంవత్సరాలు 6 నెలల వయసు నుంచి 23 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. పెళ్లైన 21 ఏళ్లలోపు అభ్యర్థులు అనర్హులు. ఓపెన్‌స్కూల్ ద్వారా 10వ తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులే. -
రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు సంబంధించి సోమవారం నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు గుంటూరు రేంజ్ కల్నల్ దురవ్ చౌదరి తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ర్యాలీకి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 1,600 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీలో 30 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహ దారుఢ్యం, వైద్య పరీక్షలు నిర్ణయించిన తేదీల్లోనే జరుగుతాయన్నారు. వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్‌లో రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. -
ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యం
{పమాదాలు జరగుతున్నా ఆర్మీ ర్యాలీలో కనిపించని స్పందన కనీస సౌకర్యాలు కల్పించని నిర్వాహకులు తొలి రోజు నుంచీ అభ్యర్ధులకు ఇబ్బందులే చికిత్సకు కేజీహెచ్‌కు వెళ్లినా నిరాశే విశాఖపట్నం: వేలాది మంది యువకులు హాజరవుతున్న ఆర్మీ ర్యాలీలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. పరుగులో ప్రాణాలు కోల్పోతే తమకు సంబంధం లేదని ముందుగానే చెప్పామనే సాకుతో నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన పొన్నూరు నీలబాబు పరుగులో గెలిచి ప్రాణాలు కోల్పోయాడు. అయినా నిర్వాహకులు కళ్లు తెరవలేదు. మర్నాడే విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన పిల్లి వెంకట ఇప్పిలిరెడ్డి ర్యాలీలో పరుగుపెడుతూ అర్ధాంతరంగా కుప్పకూలాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్నత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంత జరుగుతున్నా కనీస అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లు చేయకపోవడం దారుణం. మరోవైపు అస్వస్థతకు గురైన అభ్యర్థులను చేర్చుకోవడానికి కేజీహెచ్‌లో సౌకర్యాలు తక్కువున్నాయంటూ వైద్యులు నిరాకరిస్తున్నారు. ఈనెల 3 నుంచి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతున్న సంగతి తెలిసిందే.13వ తేదీ వరకూ జరిగే ఈ ఎంపికల్లో రోజూ సగటున 5వేల మంది హాజరవుతున్నారు. ఈ స్థాయిలో అభ్యర్ధులు వస్తారనే అంచనా ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయలేదనే విషయం తొలి రోజే తేలిపోయింది. వేలాదిగా తరలి వచ్చిన అభ్యర్ధులపై లాఠీచార్జ్ చేసి కొందరు సైన్యంలో చేరే అవకాశాన్ని కోల్పోయేలా చేశారు. తర్వాత పోర్టు స్టేడియంలో టోకెన్ల జారీ ప్రక్రియను, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 4గంటలకే పరీక్షలు ప్రారంభించి 7గంటల కల్లా పూర్తి చేయాలి. కానీ అభ్యర్ధులు ఆలస్యంగా వస్తున్నారంటూ మధ్యాహ్నం 11 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో అభ్యర్ధులు పరుగుదీయడం ప్రమాదమని తెలిసినా నిర్వాహకులు ర్యాలీని కొనసాగిస్తున్నారు. సమయపాలన కూడా పాటించడం లేదు. వైద్య సిబ్బందిని నామ మాత్రంగా నియమించారు. అత్యవసరమైనా కేజీహెచ్ వరకూ రావాల్సిందే. అక్కడ కూడా తమ వద్ద పరికరాలు సరిగ్గా పనిచేయవని, నిపుణులైన డాక్టర్లకు ఖాళీ లేదనే అర్ధంలేని కారణాలతో అభ్యర్ధులను చేర్చుకోవడం లేదు. నీలబాబు విసయంలోనూ కేజీహెచ్ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపించాయి. ముందుగా చేర్చుకుని కేర్ ఆస్పత్రికి పంపించేశారు. గురువారం విజయనగరం జిల్లాకు చెందిన ఇప్పిలిరెడ్డిని కూడా చేర్చుకునేది లేదని ర్యాలీ నిర్వాహకులతో కేజీహెచ్ వైద్యులు వాదం వేసుకున్నారు. దానికే చాలా సమయం వృధా అయ్యింది. దీంతో అతనిని కూడా కేర్ అస్పత్రికి తరలించారు. ఇలా కాలయాపన చేయడం, ర్యాలీ ప్రదేశంలో కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడం, ఎండల్లోనే పరీక్షలు నిర్వహించడం వంటి కారణాలు అభ్యర్ధులకు ప్రాణసంకటమవుతున్నాయి. -
రెండో రోజూ విరిగిన లాఠీ
విశాఖపట్నం: అధికారుల సమాచారలోపం వారికి నరకాన్ని చూపిస్తోంది. రెండో రోజు అదే తీరు. కొలువు కోసం వెళ్లిన నిరుద్యోగిపై లాఠీ విరిగింది. విశాఖలో నిర్వహిస్తున్న ఆర్మీ ర్యాలీకి రెండోరోజు వేలాది మంది అభ్యర్ధులు హాజరయ్యారు. నిజానికి ఇంత మంది అభ్యర్ధులు వస్తారనే అంచనా ముందుగానే అధికారులకు ఉన్నప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. కనీసం తాగునీరు కూడా అందించలేదు. ముందురోజు రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్న అభ్యర్ధులను విడతల వారీగా టోకెన్లు తీసుకునేందుకు అనుమతించారు. లాఠీచార్జ్ టోకెన్ల కోసం ముందుకు దూసుకువస్తున్న అభ్యర్ధులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్‌లో అనేక మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాధమిక చికిత్స చేశారు. -
విరిగిన లాఠీ
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం వేలాదిగా తరలి వచ్చిన యువత తొక్కిసలాటలో చిరిగిపోయిన సర్టిఫికెట్లు విరుచుకుపడిన పోలీసులు.. లాఠీచార్జి పలువురికి గాయాలు సమాచారంలో విఫలమైన అధికారులు పోలీస్ అవతారమెత్తిన డిఆర్డిఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ దేశభక్తితో కొందరు.. పొట్ట పోషించుకునేందుకు మరికొందరు.. యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆర్మీలో చేరి ఉపాధి పొందాలని తాపత్ర యపడ్డారు. వీరిలో చాలా మంది శుక్రవారం పోలీసుల లాఠీచార్జ్లొనూ తరవాత తొక్కిసలాటలోనూ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలో తొలిరోజే ఆర్మీ ర్యాలీ గందరగోళమైంది. విశాఖపట్నం: కొలువు కోసం వెళ్లిన నిరుద్యోగిపై లాఠీ విరిగింది..అధికారుల సమాచారలోపం వారికి నరకాన్ని చూపించింది. నియంత్రణ పేరుతో పోలీసులు చితకబాదడంతో కదల్లేని పరిస్థితి ఎదురైంది. బతుకు జీవుడా అంటూ తీవ్ర గాయాలతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. శుక్రవారం ఆర్మీర్యాలీకి వెళ్లిన నిరుద్యోగులకు ఎదురైన చేదు అనుభవమిది. ఆర్మీలో పలు ఉద్యోగాల కోసం ఈ నెల 13వ తేదీ వరకూ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం నుంచి నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు వెలంపేటలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో విశాఖ, అనకాపల్లి డివిజన్ల అభ్యర్ధులకు టోకెన్లు జారీ చేశారు. దీనికి దాదాపు ఏడు వేల మందికి పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. దరఖాస్తుల్లో సూచించిన తేదీలకు తర్వాత ప్రకటించిన తేదీలకు ఒక రోజు వ్యత్యాసం ఉండటంతో ఇతర డివిజన్ల నుంచి కూడా అభ్యర్ధులు వచ్చేశారు. నిజానికి ఇంత మంది అభ్యర్ధులు వస్తారనే అంచనా ముందుగానే అధికారులకు ఉన్నప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. తాగునీరు కూడా అభ్యర్ధులకు అందించలేదు. ముందురోజు రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్న అభ్యర్ధులను విడతల వారీగా టోకెన్లు తీసుకునేందుకు అనుమతించారు. దీని కోసం బారికేడ్లు నిర్మించారు. అక్కడక్కా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందు వచ్చిన వారికి ముందు టోకెన్లు ఇస్తామని అధికారులు చేసిన ప్రకటన అభ్యర్ధులకు చిక్కులు తెచ్చిపెట్టింది. టోకెన్ తీసుకోవాలనే ఆరాటంలో బారికేడ్లుపై నుంచి దూకడం, కింది నుంచి దూరి వెళ్లడం వంటివి చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. టెంట్లు, బారికేడ్లు కూలిపోయాయి. దీంతో తర్వాత నుంచి ఎండల్లోనే కూర్చున్నారు. పక్కనే పళ్ల మార్కెట్, స్టేడియంను ఆనుకుని డ్రైయిన్ ఉండటంతో ఆ డ్రైయిన్‌లోని ఈగలు అభ్యర్ధులపై దాడిచేశాయి. అవి తేనెటీగలేమోనని బెదిరిపోయిన అభ్యర్ధులు పరుగులు తీయడంతో మరోసారి తొక్కిసలాట జరిగింది. పలుమార్లు లాఠీచార్జ్: టోకెన్ల కోసం ముందుకు దూసుకువస్తున్న అభ్యర్ధులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. డిఆర్డిఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ సైతం పోలీసులు ఉపయోగించే లాఠీ పట్టుకుని యువకులను చావబాదారు. పలుమార్లు జరిగిన లాఠీ చార్జ్‌లో అనేక మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి తలలు పగిలాయి. కొందరికి కాళ్లు విరిగాయి. ఈ గందరగోళంలో అభ్యర్ధుల పర్సులు, సెల్ఫోన్లు, బ్యాగులు పోయాయి. వెంట తెచ్చుకున్న సర్టిఫికెట్లు చిరిగిపోయాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాధమిక చికిత్స చేశారు. ఖర్చులకు డబ్బుల్లేవ్ రెండో తారీకునే టోకెన్లు ఇచ్చేస్తామని ముందు చెప్పారు. తర్వాత తేదీలు మార్చారంట. ఆ విషయం మాకెలా తెలుస్తుంది.క్లర్క్ పోస్టు పరీక్షకు రెండు రోజుల క్రితమే వైజాగ్ వచ్చేశాం. ఇక్కడ ఉండటానికి ఏమీ లేదు.ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నాం. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. -ఎ.రాజు, శ్రీకాకుళం నిబంధనలు మార్చేశారు ఈ సారి ఆర్మీ సెలక్షన్లలో పాత నిబంధనలు మార్చేశారు. గతంలో ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఒకదాంట్లో ఫెయిల్ అయితే మరోదానికి ప్రయత్నించేవాళ్లం. ఇప్పుడు ఒకరు ఒక పోస్టుకే పరీక్షకు హాజరవ్వాలని, ఒక టోకెన్ మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు రావు. -కె.ఆదిత్య, పరవాడ అంతా గందరగోళం టోకెన్ల జారీ, పరీక్షల తేదీల్లో స్పష్టత లేదు. దీంతో తేదీలు ఖచ్చితంగా తెలుసుకోవాలని వచ్చాం. ఇక్కడ సమాచారం చెప్పేవాళ్లు కూడా లేరు. వచ్చిన తోటి అభ్యర్ధులను అడిగి వివరాలు తెలుసుకున్నాం.మళ్లీ వెనక్కు వెళ్లి రాలేం. ఇక్కడే ఎక్కడో కాలం గడపాలి. -జె.సుధీర్, శ్రీకాకుళం ఎప్పుడో వచ్చాం టోకెన్లు ఇస్తామంటే 2వ తేదీన వచ్చాం. కానీ ఇవ్వలేదు. మళ్లీ ఈ రోజు వచ్చాం. ట్రేడ్‌మెన్ ఉద్యోగం కోసం పరీక్షకు హాజరవుతున్నాం. ఉదయం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. మాలో చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. -ఎం.అప్పలరామశ్రీను, విశాఖ -
ఆర్మీ ర్యాలీలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జలంధర్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలకు నిరుద్యోగులు పోటెత్తుతుండడంతో ఇకపై ఈ నియామకాలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ర్యాలీలకు వచ్చే అభ్యర్థులు ముందుగా సైన్యానికి చెందిన రిక్రూట్మెంట్ వెబ్సైట్ joinindianarmy.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైనిక నియామకాల డీజీ లెఫ్ట్టినెంట్ జనరల్ ఆర్ఎన్ నాయర్ బుధవారం కపుర్తలలో తెలిపారు. ఆర్మీ ర్యాలీలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లాఠీచార్జి చేయాల్సి వస్తోందని, ఇబ్బందులను నివారించేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులనే పరిమిత సంఖ్యలో ఆయా తేదీల్లో నియామకాలకు పిలుస్తామన్నారు. -
ఆర్మీ ర్యాలీలో రెండో రోజు గందరగోళం
విజయనగరం : ప్రణాళికా లోపం..నిధుల కొరతతో అరకొర ఏర్పాట్లు..జిల్లా యంత్రాంగం, ఆర్మీ అధికారుల మధ్య సమన్వయ లోపం..ఉద్యోగాల కోసం వేలాదిగా తరలివస్తున్న నిరుద్యోగ యువత.. వెరసి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగం కోసం గంపెడాశతో వస్తున్న అభ్యర్థులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం లోని పోలీస్ బ్యారెక్స్‌లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రెండవ రోజు ఆదివా రం ఉదయం ఎంపికలు జరిగే మైదానంలోకి వెళ్లాలనే ఆత్రుతతో అభ్యర్థుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురి కి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా..మరో 12 మందికి స్వల్పగాయాలయ్యాయి. ర్యాలీలో రెండవ రోజు తొక్కిసలాట గతంలో జిల్లాలో రెండు సార్లు ఆర్మీరిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించారు. అయితే ప్రస్తు త ఎంపికలు జరుగుతున్నా పోలీస్ బ్యారెక్స్‌లో కాకుండా పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న విజ్జిస్టేడియంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిపేవారు. అక్కడ మైదానం లోపలతో పాటు బయట భాగంలోనూ ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న తోపులాట లు మినహా ర్యాలీ ప్రశాంతంగానే సాగేది. ప్రధానంగా అభ్యర్థులు ఒక్కక్కొరుగా మైదానంలోకి వెళ్లేందుకు బయట భాగంలో 500 మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేసేవారు. దీంతో పోలీసులు వారిని నిలువరించేందుకు అవకాశం ఉండేది. అదేవిధంగా మైదానం లోపల భాగంలో ధ్రువీకరణ పత్రాల పరిశీల న, శరీర దారుఢ్య పరీక్షల నిర్వహణలో పక్కా ప్రణాళికతో నిర్వహించి విజయవంతంగా ముగించారు. అయితే ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున నిర్వహిస్తున్న ర్యాలీలో ఈ తరహా ఏర్పాట్లు లేకపోవడంతో అభ్యర్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ర్యాలీలో పాల్గొనేందుకు ముందురోజు రాత్రికే జిల్లాకు చేరుకుంటున్న అభ్యర్థులు మైదానం బయట ఉన్న రోడ్డుపై ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు అధికారులు 400 మందికి ఒక బారికేడ్ చొప్పు న ఏర్పాటు చేశారు. వారిని క్యూలో లోపలికి అనుమతించాలని అధికారులు భావించారు. ర్యాలీ ప్రారంభం రోజునే అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించేముందు తొక్కిసలాట జరిగిం ది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అయితే రెండవ రోజు సుమారు 6,500 మంది అభ్యర్థులు తరలిరావడంతో మళ్లీ తొక్కిసలాట జరిగింది. అభ్యర్ధులు ముందుగా మైదానంలో కి వెళ్లాలనే ఆత్రుతతో బారికేడ్లను విరగొట్టి ముందున్న అభ్యర్థులను తొక్కుకుంటూ మైదానంలోకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పలువురు అభ్యర్థులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ర్యాలీ ప్రారంభం రోజే జరిగిన స్వల్ప ఘటనను అటు పోలీసు, ఇటు ఆర్మీ అధికారులు గుణపాఠంగా తీసుకోకపోవడంతో రెండవ రోజు పరిస్థితి తీవ్రరూపం దాల్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముగ్గురి పరిస్థితి విషమం: ఆర్మీ ర్యాలీకి హాజరైన శ్రీకాకుళం జిల్లా పోలాకి కి చెందిన టి.అప్పలనాయుడు వెన్నుపూస కాస్త దెబ్బతినడంతో పరిస్థితి కాస్త విషమించదని భావించిన తిరుమల ఆస్పత్రి వైద్యులు మధ్యాహ్న సమయంలో అభ్యర్థికి మెరుగైన వైద్యం అందించేందుకు విశాఖ తరలించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వంగరకు చెందిన కె.మురళీమనోహర్, పలాసకు చెందిన కె.శంకర్లకు మాత్రం తిరుమల ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలకు ఎటువంటి ముప్పులేదని సెట్విజ్ సీఈఓ పి.దుర్గారావు తెలిపారు. స్వల్ప గాయాలపాలైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డుంకూరు గ్రామానికి చెందిన యు.రమేష్, ఉర్లాంకు చెందిన డోలా మధు. సోంపేటకు చెందిన బి.శ్రీనివాసరావు, పలాస మండలం చిన్న గురుదాసుపురానికి చెందిన ఎస్. భాస్కరరావు, సంతబొమ్మాళి మండలం మర్రిపాడుకు చెందిన ఎన్.ధన్రాజు, నందిగాం మండలం ఖజోలాకు చెందిన పి. యాకరవి, ఇచ్ఛాపురానికి చెందిన పి.మధు, విజయనగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన పి. కుమార్, కె.అప్పలరాజు, మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన రవికుమార్‌ల తో పాటు విశాఖ జిల్లా తగరపువలసకు చెంది న జి.కేశవ, గాజువాక జీఏ కాలనీకి చెందిన ఎన్.నాగేంద్రబాబులను చికిత్స నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. -
యువసంద్రం..
సాక్షి, కొత్తగూడెం: ఆర్మీ రిక్రూట్మెంట్కు తరలివచ్చిన యువతతో మంగళవారం ప్రకాశం స్టేడియం కిక్కిరిసింది. సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇప్పటివరకు జరిగిన నాలుగురోజుల ఎంపికల్లో అత్యధికం గా మంగళవారం 5,804 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ అభ్యర్థులతో మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రకాశం స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున రెండు గంటల నుంచే అభ్యర్థులు టోకెన్ల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్యూలో నిల్చునేందుకు బారికేడ్ల లో బస చేశారు. పోస్టాఫీస్ సెంటర్, బస్టాండ్, కోర్టు ఏరియా, కొత్తగూడెం క్లబ్ ప్రాంతాలన్నీ యువత బసకేంద్రాలుగా మారాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఆర్మీ ర్యాలీకి హాజరుకావడం గమనార్హం. అనూహ ్య రీతిలో అభ్యర్థులు తరలిరావడంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచే టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఉదయం 8.30 గంటల వరకు కొనసాగినప్పటికీ ఇంకా చాలామంది అభ్యర్థులకు టోకెన్లు అందకపోవడంతో నిరాశకు గురై వెనుతిరిగారు. భారీగా అభ్యర్థులు హాజరుకావడంతో ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగి సాయంత్రం ముగిసింది. ఉదయం 10 గంటల తర్వాత నిర్వహించిన పరుగుపందెంలో చాలామంది అభ్యర్థులు నీరసించి అర్హత సాధించలేకపోయారు. 5,804 మంది హాజరుకాగా వీరిలో 2,053 మంది ఎత్తుకొలతలో తిరస్కరణకు గురయ్యారు. కాగా 3,751 మంది పరుగుపందేనికి ఎంపికైతే ఇందులో 930 మంది అర్హత సాధించారు. ఎండతీవ్రత, నాలుగు రౌండ్లు పరుగుపందెంతో అభ్యర్థులు నీరసించిపోయారు. దీంతో పరుగుపందెంలోనే 2,821 మంది అనర్హులయ్యారు. ఏర్పాట్లను పరిశీలించిన బ్రిగేడియర్ సజ్జన్.. సోల్జర్ జనరల్ డ్యూటీ ఎంపిక తీరును ఆర్మీ బ్రిగేడియర్ సజ్జన్ స్వయంగా పరిశీలించారు. ప్రకాశం మైదానంలో ఎత్తు, బరువు, పుల్అప్స్, ఎంపికైన అభ్యర్థుల వివరాలను కంప్యూటర్లో చేర్చే శిబిరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్పృహతప్పి పడిపోతున్న అభ్యర్థులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ర్యాలీ విజయవంతం కావడంలో సింగరేణి, జిల్లా అధికారుల కృషి ప్రశంసనీయమని అభినందించారు. అలాగే స్థానిక సూర్యోదయ పాఠశాల విద్యార్థులు ఆర్మీ ర్యాలీని తిలకించేందుకు రాగా వారితో బ్రిగేడియర్ సజ్జన్ మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకునేందుకు వచ్చిన విద్యార్థులను అభినందించారు. బుధవారం సోల్జర్ జనరల్‌డ్యూటీ పోస్టులకు నిజామాబాద్, కరీంనగ ర్, మహబూబ్‌నగర్ జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు జరగనున్నాయి. ఈ ర్యాలీని ఆర్మీ రిక్రూట్మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరే ణి జీఎం (పర్సనల్) కె.బాబు సత్యసాగర్, వన్‌టౌన్ సీఐ ఎ.నరేష్ కుమార్‌లు పర్యవేక్షించారు. -
లక్ష్యం కోసం...
సాక్షి, కొత్తగూడెం: దేశ రక్షణకు మేము సైతం అంటూ... సుదూర ప్రాంతాల నుంచి ఆర్మీర్యాలీకి తరలి వచ్చిన యువకులు తొలిరోజు ఎంపికలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తగూడెంలో జరుగుతున్న తెలంగాణ జిల్లాల స్థాయి ఆర్మీరిక్రూట్మెంట్ ర్యాలీలో ఎంపికల పర్వం శనివారం ప్రారంభం కాగా, తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రకాశం స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ యువసంద్రంగా మారాయి. టోకెన్లు తీసుకునేందుకు అభ్యర్థులు చలిలో బారులుతీరి నిల్చున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలిరోజు సోల్జర్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి అంతా ప్రశాంతంగా జరుగగా మెడికల్ టెస్ట్‌కు 561 మంది అర్హత సాధించారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు పదిజిల్లాల నుంచి యువత వెల్లువలా తరలివచ్చారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా నిర్వహించిన ఎత్తు కొలతకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు భారీగా క్యూ కట్టారు. 2 గంటలకు క్యూలో నిల్చుంటే అభ్యర్థులకు తెల్లవారుజామున 3 గంటలకు టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఎత్తు కొలతలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో అర్హత సాధించి న వారిని పరుగుపందెం కోసం ప్రకాశం స్టేడియానికి తరలించారు. ఇలా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ప్రకాశం స్టేడియంలో బరువు, ఛాతి, పరుగుపందెం, పుల్ అప్స్, లాంగ్‌జంప్, బ్యాలెన్సింగ్ బీమ్ పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిపి అభ్యర్థుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. పరుగుపందెంలో అర్హత సాధించిన వారికి స్టేడియంలోనే అల్పాహారం అందచేశారు. అయితే 17నుంచి ఎంపిక లు ప్రారంభమవుతాయని తొలుత ప్రచారం చేయడంతో వేలాదిమంది గురువారం రాత్రే తరలివచ్చారు. షెడ్యూల్లో భాగంగా సోల్జర్ టెక్నికల్ పోస్టులకు శనివారం ఎంపిక ప్రక్రియ కొనసాగడంతో అభ్యర్థులు వసతులు లేక ఇబ్బంది పడ్డారు. 8.30గంటలకే మూతపడిన టోకెన్ కౌంటర్.. చాలామంది అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నా... చివరకు టోకెన్లు అందలేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత కౌంటర్లు మూసివేశారు. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు అందక నిరాశతో వెనుతిరిగారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చామని, టోకెన్లు ఇవ్వాలని అభ్యర్థులు ప్రాధేయపడినా ఆర్మీ అధికారులు మాత్రం కనికరించలేదు. మిగిలిన పోస్టులకోసం ఎక్కువ మంది వస్తే టోకెన్లు ఇచ్చే సమయం పెంచాలని ఆర్మీ, పోలీస్ అధికారులు చర్చించుకున్నారు. టోకెన్లు ఇచ్చిన తరువాత కూడా ఎత్తు కొలతలకు గంటన్నరపాటు విరామం ఇవ్వడంతో అభ్యర్థులు క్యూలైన్లలోనే కునికిపాట్లు పడ్డారు. టోకెన్లు ఇచ్చిన వెంటనే అన్ని అంశాలు నిర్వహిస్తే నెగ్గుకొచ్చేవారమని, ఆలస్యం వల్ల నీరసించి అర్హత సాధించలేకపోయామని కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం మైదానానికి యువకళ.. పరుగుపందేనికి వచ్చినవారు, పరుగుపందెంలో వివిధ గడువుల్లో వచ్చిన అభ్యర్థులు, పుల్ అప్స్, లాంగ్‌జంప్, బరువు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్తో ప్రకాశం మైదానం అంతా ఆర్మీ ఎంపికలకు వచ్చిన యువకులతో కళకళలాడింది. ఆర్మీ అధికారులు, సిబ్బంది ఈ ఎంపికలను దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ పోస్టులకు కూడా అప్పుడే వేలాది మంది యువత శనివారం రాత్రి ప్రకాశం మైదానం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగస్వాములు కావాలి: ఐటీడీఏ పీవో వీరపాండియన్ దేశ రక్షణలో యువత భాగస్వాములు కావాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీరపాండియన్ పిలుపునిచ్చారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల పరుగు పందెంను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఆయన అభ్యర్థులనుద్దేశించి మాట్లాడారు. ఊరిని, తల్లిదండ్రులను వదిలి ఎక్కడికో వెళ్తున్నాం అనుకోకుండా దేశ రక్షణ కోసం సేవ చేయడం అభినందనీయమన్నారు. గతంలో భద్రాచలం, ఖమ్మంలలో సీఆర్పీఎఫ్, పారా మిలటరీ రిక్రూట్మెంట్ జరిగిందని, ఇందులో 238 పోస్టులు భర్తీ చేయగా వీరిలో 115 మంది గిరిజనులు ఉన్నారన్నారు. అలాగే ఎస్పీ ఎ.వి.రంగనాధ్ ఎంపికల తీరు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణలో ఆర్మీ రిక్రూట్మెంట్ సెల్ డెరైక్టర్ కల్నల్ యోగేష్ ముదిలియార్, ఆర్డీవో డి.అమయ్ కుమార్, తహశీల్దార్ కె.పి.నర్సింహులు, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరేణి జీఎం (పర్సనల్) కె.బాబు సత్యసాగర్ పాల్గొన్నారు. సోల్జర్ టెక్నిక్ పోస్టులకు ఇలా అర్హత సాధించారు... టోకెన్లు తీసుకున్నది - 3,461 మంది ఎత్తులో తిరస్కారం - 1,176 పరుగుపందేనికి ఎంపిక - 2,285 మెడికల్ టెస్ట్‌కు ఎంపిక - 561 నేటి ఎంపికలకు అర్హతలు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ - ఇంటర్ బైపీసీ (మొత్తం 50శాతం, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు), ఎత్తు 165 సెం.మీ., చెస్ట్ 77 సెం.మీ (ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీలు పెరగాలి), వయసు 17.1/2 నుంచి 23 సం.లు. సోల్జర్ క్లర్క్- ఇంటర్ అన్ని గ్రూపులు (ఒకేషనల్ మినహా), మొత్తం మార్కులు 50 శాతం, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు, ఎత్తు 162 సెం.మీ., చెస్ట్ 77 సెం.మీ (ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీలు పెరగాలి), వయసు 17.1/2 నుంచి 23 సం.లు.