ఆఖరిరోజూ అవస్థలతో ‘పోరు’
-
ముగిసిన ఆర్మీ ర్యాలీ
-
సోల్జర్ టెక్నికల్ పోస్టులకు పరీక్షలు
-
మెడికల్ టెస్టులకు ఎంపికైన 162 మంది
-
ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
బోట్‌క్లబ్ (కాకినాడ) :
అవస్థలు, అననుకూలతలు, అస్వస్థతల మధ్యే.. దేశరక్షణ దళంలో కొలువుల కోసం నిర్వహించిన పరీక్షలు సాగాయి. స్థానిక జిల్లా క్రీడామైదానంలో ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శుక్రవారంతో ముగిసింది. ఆరుజిల్లాలు, యానాం నుంచి వేలాదిమంది ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ర్యాలీ జరిగిన ప్రాంతంలో కాక రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీరామ్‌నగర్ మున్సిపల్ స్కూల్లో అభ్యర్థులకు వసతి కల్పించడంతో వారు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడలేదు. క్రీడామైదానం సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌లపైనే రాత్రి పడుకున్నారు. కొందరు ఆర్మీ క్యూలైన్‌లోనే సేదదీరారు. ఆఖరురోజు పలువురు అభ్యర్థులు పరుగు పరీక్షలో సొమ్మసిల్లి పడిపోయారు. ఒక అభ్యర్థి పరుగు పెడుతూ కింద పడిపోవడంతో తలకు గాయమయ్యింది. ఆర్మీ అధికారులు వెంటనే ప్రథమ చికిత్స చేసారు. అర్ధరాత్రి నుంచి ఎంపికలు నిర్వహించడంతో నిద్రలేమితో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని పలువురు అభ్యర్థులు వాపోయారు.
సోల్జర్ టెక్నికల్ పోస్టులకు 4,097 మందికి అడ్మిట్‌కార్డులు జారీచేయగా 2,998 మంది హాజరయ్యారని, 323 మందిని ఎత్తు చాలక తొలగించారని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2,575 మందిమందిలో 192 మంది పరుగు పరీక్షలో పాస్‌కాగా, వీరిలో 162 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. శుక్రవారంతో ర్యాలీ ముగియగా మెడికల్ పరీక్షలు కొనసాగుతాయన్నారు.