ఫిబ్రవరి 4 నుంచి ఆర్మీ ర్యాలీ
ఆరు విభాగాల్లో ఎంపికలు 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
కొత్తగూడెం: దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీ అవకాశం కల్పిస్తోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నారు. మొత్తం ఆరు విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెం దిన అభ్యర్థులకు మాత్రమే ఈ ఆర్మీర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పించారు.
సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్స్‌మన్ కేటగిరీలలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జాయిన్‌ఇండియన్‌ఆర్మీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, వారికి అడ్మిట్‌కార్డు జారీ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జనవరి 19వ తేదీ తరువాత అడ్మిట్‌కార్డును ప్రింట్‌ఔట్ తీసుకోవాలని సూచించారు.
వీరు అర్హులు: సోల్జర్ జనరల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17 సంవత్సరాల 6 నెలలు నుంచి 21 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులు 17 సంవత్సరాలు 6 నెలల వయసు నుంచి 23 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. పెళ్లైన 21 ఏళ్లలోపు అభ్యర్థులు అనర్హులు. ఓపెన్‌స్కూల్ ద్వారా 10వ తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులే.