జలంధర్: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు నిరుద్యోగులు పోటెత్తుతుండడంతో ఇకపై ఈ నియామకాలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ర్యాలీలకు వచ్చే అభ్యర్థులు ముందుగా సైన్యానికి చెందిన రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ joinindianarmy.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైనిక నియామకాల డీజీ లెఫ్ట్టినెంట్ జనరల్ ఆర్‌ఎన్ నాయర్ బుధవారం కపుర్తలలో తెలిపారు. ఆర్మీ ర్యాలీలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లాఠీచార్జి చేయాల్సి వస్తోందని, ఇబ్బందులను నివారించేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులనే పరిమిత సంఖ్యలో ఆయా తేదీల్లో నియామకాలకు పిలుస్తామన్నారు.