కోవిన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇక్కట్లు | Cowin server faces issues as COVID vaccine registration | Sakshi
Sakshi News home page

కోవిన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇక్కట్లు

Published Thu, Apr 29 2021 4:42 AM | Last Updated on Thu, Apr 29 2021 1:36 PM

Cowin server faces issues as COVID vaccine registration - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్రమణకు ముకుతాడు వేసేందుకు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్‌ మూడోదశకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్‌కు అనుమతించగా... రద్దీ కారణంగా నమోదు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌  కోసం ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో కోవిన్‌ పోర్టల్‌ క్రాష్‌ అయ్యింది.

ఆరోగ్య సేతు, ఉమంగ్‌ యాప్‌లోనూ ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కోవిన్‌ సైట్‌ నిమిషానికి దాదాపు 27 లక్షల హిట్లు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారీ ట్రాఫిక్‌ కారణంగా రిజిస్ట్రేషన్‌కు ప్రజలు ఇక్కట్లు పడ్డారు. రాష్ట్రాలు, ప్రైవేటు టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచిన స్లాట్ల ఆధారంగా టీకా సమయాన్ని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అయితే కొద్దిగంటల తర్వాత కోవిన్‌ పోర్టల్‌పై లోడ్‌ తగ్గిన అనంతరం ప్రజలు తమపేరు నమోదు చేసుకోగలిగారు. అయినప్పటికీ వారి ప్రాంతం ఆధారంగా స్లాట్‌ బుకింగ్‌కు మాత్రం అవకాశం ఇంకా ఇవ్వలేదు.  

టీకాల లభ్యత ఉంటేనే...
వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకొనే 18 ఏళ్లు నిండిన వారికి ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులో ఉంచే స్లాట్ల లభ్యత ఆధారంగా మాత్రమే అపాయింట్‌మెంట్‌లు లభిస్తాయి. అంటే వ్యాక్సిన్లు లభ్యంగా ఉండి... మే 1 నుంచి టీకాలు వేయడానికి సిద్ధం గా ఉన్న కేంద్రాల ఆధారంగా మాత్రమే ప్రజలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. ఆర్డర్లు పెట్టి నా సరే.. పలు రాష్ట్రాలు, ప్రైవే టు ఆసుపత్రులకు టీకాలు అందడానికి సమయం పడుతుందని ఫార్మారం గ నిపుణులు అంటున్నారు. మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీకాల లభ్యత లేనందున మే 1 నుంచి 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయడం సాధ్యం కాదనే చెబుతున్నాయి. అయితే రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రయత్నించి ఫెయిల్‌ అయిన అనేకమంది సోషల్‌మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు.

కోవిన్‌ పోర్టల్‌ స్పందించడం లేదని కొందరు, సైట్‌ క్రాష్‌ అయ్యిందని మరికొందరు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. అయితే కోవిన్‌ పోర్టల్‌ పనిచేస్తోందని, సాయంత్రం 4 గంటలకు సైట్‌లో వచ్చిన చిన్న లోపం పరిష్కారం అయ్యిందని ఆరోగ్య సేతు ట్విట్టర్‌ హ్యాండిల్‌  నుంచి సాయంత్రం 4.35 గంటలకు ఒక ట్వీట్‌ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు వ్యాక్సినేషన్‌ సెషన్లను షెడ్యూల్‌ చేసిన తర్వాత 18+ వారికి వ్యాక్సిన్‌ అపాయింట్‌మెంట్‌లు సాధ్యమవుతాయని సాయం త్రం 4.54 గంటలకు ఆరోగ్యసేతు యాప్‌ నుంచి ట్వీట్‌ వచ్చింది.  కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలే అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్ని క్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతించి విషయం తెలిసిందే. మరికొద్ది వారాల్లో స్పుత్నిక్‌ కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది.  

సాఫీగానే జరిగాయి: ఆరోగ్యశాఖ
ప్రజలు సోషల్‌మీడియాలో చేసిన ఫిర్యాదులు, మీడియా రిపోర్టులపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి వివరణ ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు సాఫీగానే జరిగాయని తెలిపింది. తొలిరోజు బుధవారం 4 నుంచి 7 గంటల మధ్యలో 80 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. ఆరంభంలో నిమిషానికి 27 లక్షల హిట్లు వచ్చాయని... తర్వాత ప్రతిసెకనుకు 55 వేల హిట్లు వస్తున్నాయని, కోవిన్‌ పోర్టల్‌ సాఫీగా, సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ల వివరాలను కోవిన్‌ పోర్టల్‌లో పెడతామని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement