లక్ష్యం కోసం... | For the goal ... | Sakshi
Sakshi News home page

లక్ష్యం కోసం...

Published Sun, Jan 19 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

For the goal ...

సాక్షి, కొత్తగూడెం: దేశ రక్షణకు మేము సైతం అంటూ...     సుదూర ప్రాంతాల నుంచి ఆర్మీర్యాలీకి తరలి వచ్చిన యువకులు తొలిరోజు ఎంపికలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్తగూడెంలో జరుగుతున్న తెలంగాణ జిల్లాల స్థాయి ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఎంపికల పర్వం  శనివారం ప్రారంభం కాగా,   తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రకాశం స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ యువసంద్రంగా మారాయి. టోకెన్లు తీసుకునేందుకు అభ్యర్థులు చలిలో బారులుతీరి నిల్చున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలిరోజు సోల్జర్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి అంతా ప్రశాంతంగా జరుగగా మెడికల్ టెస్ట్‌కు 561 మంది అర్హత సాధించారు.
 
 సోల్జర్ టెక్నికల్ పోస్టులకు పదిజిల్లాల నుంచి యువత వెల్లువలా తరలివచ్చారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా నిర్వహించిన ఎత్తు కొలతకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆర్‌టీఏ కార్యాలయం వరకు భారీగా క్యూ కట్టారు. 2 గంటలకు క్యూలో నిల్చుంటే అభ్యర్థులకు తెల్లవారుజామున 3 గంటలకు టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఎత్తు కొలతలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో అర్హత సాధించి న వారిని పరుగుపందెం కోసం ప్రకాశం స్టేడియానికి తరలించారు.
 
 ఇలా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ప్రకాశం స్టేడియంలో బరువు, ఛాతి, పరుగుపందెం, పుల్ అప్స్, లాంగ్‌జంప్, బ్యాలెన్సింగ్ బీమ్ పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిపి అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. పరుగుపందెంలో అర్హత సాధించిన వారికి  స్టేడియంలోనే అల్పాహారం అందచేశారు. అయితే 17నుంచి ఎంపిక లు ప్రారంభమవుతాయని తొలుత ప్రచారం చేయడంతో వేలాదిమంది గురువారం రాత్రే తరలివచ్చారు. షెడ్యూల్‌లో భాగంగా సోల్జర్ టెక్నికల్ పోస్టులకు శనివారం ఎంపిక ప్రక్రియ కొనసాగడంతో అభ్యర్థులు వసతులు లేక ఇబ్బంది పడ్డారు.
 
 8.30గంటలకే మూతపడిన
 టోకెన్ కౌంటర్..
 చాలామంది అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నా... చివరకు టోకెన్లు అందలేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత కౌంటర్లు మూసివేశారు. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు అందక నిరాశతో వెనుతిరిగారు.
 
 సుదూర ప్రాంతం నుంచి వచ్చామని, టోకెన్లు ఇవ్వాలని అభ్యర్థులు ప్రాధేయపడినా ఆర్మీ అధికారులు మాత్రం కనికరించలేదు. మిగిలిన పోస్టులకోసం ఎక్కువ మంది వస్తే టోకెన్లు ఇచ్చే సమయం పెంచాలని ఆర్మీ, పోలీస్ అధికారులు చర్చించుకున్నారు. టోకెన్లు ఇచ్చిన తరువాత కూడా ఎత్తు కొలతలకు గంటన్నరపాటు విరామం ఇవ్వడంతో అభ్యర్థులు క్యూలైన్లలోనే కునికిపాట్లు పడ్డారు. టోకెన్లు ఇచ్చిన వెంటనే అన్ని అంశాలు నిర్వహిస్తే నెగ్గుకొచ్చేవారమని, ఆలస్యం వల్ల నీరసించి అర్హత సాధించలేకపోయామని కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ప్రకాశం మైదానానికి యువకళ..
 పరుగుపందేనికి వచ్చినవారు, పరుగుపందెంలో వివిధ గడువుల్లో వచ్చిన అభ్యర్థులు, పుల్ అప్స్, లాంగ్‌జంప్, బరువు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్స్‌తో ప్రకాశం మైదానం అంతా ఆర్మీ ఎంపికలకు వచ్చిన యువకులతో కళకళలాడింది. ఆర్మీ అధికారులు, సిబ్బంది ఈ ఎంపికలను దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ పోస్టులకు కూడా అప్పుడే వేలాది మంది యువత శనివారం రాత్రి ప్రకాశం మైదానం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు.
 
 దేశరక్షణలో భాగస్వాములు కావాలి:
 ఐటీడీఏ పీవో వీరపాండియన్
 దేశ రక్షణలో యువత  భాగస్వాములు కావాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీరపాండియన్ పిలుపునిచ్చారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల పరుగు పందెంను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఆయన అభ్యర్థులనుద్దేశించి మాట్లాడారు.  ఊరిని, తల్లిదండ్రులను వదిలి ఎక్కడికో వెళ్తున్నాం అనుకోకుండా దేశ రక్షణ కోసం సేవ చేయడం అభినందనీయమన్నారు.
 
 గతంలో భద్రాచలం, ఖమ్మంలలో సీఆర్‌పీఎఫ్, పారా మిలటరీ రిక్రూట్‌మెంట్ జరిగిందని, ఇందులో 238 పోస్టులు భర్తీ చేయగా వీరిలో 115 మంది గిరిజనులు ఉన్నారన్నారు. అలాగే ఎస్పీ ఎ.వి.రంగనాధ్ ఎంపికల తీరు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెల్ డెరైక్టర్ కల్నల్ యోగేష్ ముదిలియార్, ఆర్డీవో డి.అమయ్ కుమార్, తహశీల్దార్ కె.పి.నర్సింహులు, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరేణి జీఎం (పర్సనల్) కె.బాబు సత్యసాగర్ పాల్గొన్నారు.
 
 సోల్జర్ టెక్నిక్ పోస్టులకు ఇలా అర్హత సాధించారు...
 టోకెన్లు తీసుకున్నది        - 3,461 మంది
 ఎత్తులో తిరస్కారం        - 1,176
 పరుగుపందేనికి ఎంపిక        - 2,285
 మెడికల్ టెస్ట్‌కు ఎంపిక        - 561
 
 నేటి ఎంపికలకు అర్హతలు
 సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ - ఇంటర్ బైపీసీ (మొత్తం 50శాతం, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు), ఎత్తు 165 సెం.మీ., చెస్ట్ 77 సెం.మీ (ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీలు పెరగాలి), వయసు 17.1/2 నుంచి 23 సం.లు.
 సోల్జర్ క్లర్క్- ఇంటర్ అన్ని గ్రూపులు (ఒకేషనల్ మినహా), మొత్తం మార్కులు 50 శాతం, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు, ఎత్తు 162 సెం.మీ., చెస్ట్ 77 సెం.మీ (ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీలు పెరగాలి), వయసు 17.1/2 నుంచి 23 సం.లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement