సాక్షి, కొత్తగూడెం: డిసెంబర్ 7న జరుగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఇక ఎనిమిది రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని మరింతగా పెంచారు. ప్రతి నిమిషాన్ని పక్కాగా ఉపయోగించుకునేందుకు బూత్‌ల వారీగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే గత 80 రోజులుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో దాదాపు మూడు విడతలుగా ప్రచారం చేశారు. ప్రజా కూటమి అభ్యర్థుల జాబితా నామినేషన్ల దాఖలుకు చివరి రోజయిన ఈనెల 19 వరకు కూడా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఆయా అభ్యర్థుల ప్రచారానికి 13 రోజుల సమయం మాత్రమే ఉండడంతో వారు ప్రతి నిమిషం పకడ్బందీగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉన్న సమయంలోనే వారు మిగిలిన మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ, స్టార్ క్యాంపెయినర్లతో సభలు ఏర్పాటుచేస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ప్రచారం తుదిదశకు చేరుకోగా, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యకు మాత్రం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ములుగు మాజీ ఎమ్మెల్యే అయిన వీరయ్య.. మళ్లీ ఆ టికెట్ కోసమే ప్రయత్నించగా చివరి నిముషంలో పార్టీ అధిష్టానం భద్రాచలం స్థానాన్ని కేటాయించింది. అయితే ఆయనకు ఈ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడంతో ప్రచారం కత్తిమీద సాములా మారింది. ప్రతిరోజూ 20కి పైగా బూత్‌లు తిరగాల్సి వస్తోంది. కాంగ్రెస్ నుంచి ఒక పినపాక అభ్యర్థి రేగా కాంతారావు మాత్రమే తనకు టికెట్ ఖాయమనే నమ్మకంతో మొదటి నుంచి ప్రచారం చేసుకున్నారు. ఇల్లెందులో హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు తుదివరకు గట్టి పోటీని ఎదుర్కొని అనేక ప్రయత్నాలు చేసి టికెట్ సాధించారు. దీంతో వారిద్దరు కూడా ప్రచారంలో ఉరుకులు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అశ్వారావుపేట సీటు కోసం కాంగ్రెస్ నాయకులు గట్టి ప్రయత్నాలు చేయగా ఆ స్థానాన్ని చివరికి టీడీపీ దక్కించుకుంది. దీంతో ఇక్కడి టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం..
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం చేయించుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఇప్పటికే స్వామి పరిపూర్ణానంద భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరులో ప్రచారం చేశారు. భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి మిడియం బూబురావును గెలిపించాలంటూ ఆ పార్టీ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రచారం చేశారు. ఇక ఈనెల 30న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏర్పాటు చేసిన సభలకు హాజరు కానున్నారు. కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. అశ్వారావుపేటలో ఇంతకుముందే కేటీఆర్ ప్రచార సభ నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థులు తమ స్టార్ క్యాంపెయినర్ రేవంత్‌రెడ్డిని జిల్లాకు రప్పిస్తున్నారు. వచ్చేనెల 1న రేవంత్‌రెడ్డి ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఈ నెల 30న సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలు ఇల్లెందులో సభలు నిర్వహించనున్నాయి. ఆ రెండు పార్టీలకు సంబంధించి కేంద్ర కమిటీ నేతలు సభల్లో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ కూటమికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, గద్దర్, మందకృష్ణ మాదిగ ప్రచారం కోసం జిల్లాకు రానున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది.
Comments
Please login to add a commentAdd a comment