మునిసిపల్ కార్మికుల సమ్మె విరమణ
అనంతపురం న్యూసిటీ : సమస్యలు పరిష్కరించి, వేతనం పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మునిసిపల్ కార్మికులు 16 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు వైఎస్సార్ సీపీ, వామపక్ష, కాంగ్రెస్ నాయకులు నిమ్మరసం అందించి విరమింపజేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కార్మికులకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు.
వైఎస్సార్ సీపీ జిల్లా నేత చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న పార్టీ మాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిసిపల్ ఉద్యోగులు, కార్మికుల కార్యచరణ జేఏసీ నేతలు నరసింహులు, గోపాల్ మాట్లాడుతూ అందరి సహకారం వల్లే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. వామపక్ష నేతలు జాఫర్, నాగేంద్ర, నరసింహులు, గోపాల్, పెద్దన్న, ఉపేంద్ర, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.
జగన్ భరోసానిచ్చారు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మునిసిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు. కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇవాళ ఫలితమిచ్చింది. భవిష్యత్తులోనూ అండగా ఉండాలి. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలి.
- రాజారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
రుణపడి ఉంటాం
నాయకుడిగా వై.ఎస్.జగన్ స్పందించారు. ఆయన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం జీతాలు పెంచుతామని చెప్పడం కాసింత ఉపశమనాన్ని ఇస్తుంది. వై.ఎస్.జగన్‌కు కార్మికులం రుణపడి ఉంటాం.
- వేణుగోపాల్, కార్మికుడు