కదం తొక్కిన కార్మికులు
సంగారెడ్డి మున్సిపాలిటీ : మున్సిపల్ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద శాంతి యుతంగా ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక, ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ నాయకులు యాదవరెడ్డి, మహబూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో...
సిద్దిపేట రూరల్: సిద్దిపేటలో గురువారం మున్సిపల్ కార్మికులు సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద, పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రేవంత్‌కుమార్, హేమలత మాట్లాడుతూ కార్మికులు శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జహీరాబాద్‌లో...
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లోని కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులు గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా వెళ్లి బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా నాయకుడు రాంచందర్ మాట్లాడుతూ ప్రభుత్వ సమ్మెను భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబొన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కామయ్య, రాజు, సంగన్న, విఠల్, పుణ్యమ్మ, యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వాటర్ సప్లయ్ కాంట్రాక్టు కార్మికులు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. వీరికి ఏఐటీయూసీ డివిజన్ నాయకులు జాలోద్దీన్, నర్సింలు సంఘీభావం తెలిపారు.
నర్సాపూర్‌లో...
నర్సాపూర్‌రూరల్: పారిశుద్ధ్య కార్మికుల అరెస్టులకు నిరసనగా గురువారం నర్సాపూర్ బస్టాండ్ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి లక్ష్మీబాయి, సీపీఎం నాయకుడు టీఎం ఖాలెక్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో...
సంగారెడ్డి మున్సిపాలిటీ: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు పిలువునిచ్చారు. ఈసందర్బంగా స్థానిక ఐబీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం నాయకులు మల్లేశం, మంద పవన్ పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్, ఏఐటీయూసీ మద్దతు
శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు ఏఐఎస్‌ఎఫ్, ఏఐటీయూసీ జిల్లా కమిటీలు మద్దతు పలికాయి.
రామచంద్రాపురంలో...
రామచంద్రాపురం: కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాంతి యుతంగా దీక్షలు చేస్తుంటే నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన కార్మికులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు మల్లేష్, లక్ష్మణ్, శంకరయ్య, బాబు, అంతయ్య తదితరులు ఉన్నారు.
జోగిపేటలో...
జోగిపేట: మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఏ.మాణిక్యం అన్నారు. గురువారం జోగిపేటలో కార్మికుల పట్ల ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఎ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో ప్రసంగించారు.
కందిలో..
సంగారెడ్డి రూరల్: హైదరాబాద్ నిరాహర దీక్ష చేస్తున్న వామపక్షాల నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం కందిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మహమ్మద్ ఖాజా కార్మికులు సుధాకర్, శ్రీనివాస్, రత్నం, వెంకటేష్, ప్రభాకర్, నాగరాజు పాల్గొన్నారు.
సదాశివపేటలో..
సదాశివపేట: అరెస్టులు, నిర్బంధాలు కార్మికుల ఉద్యమాలను అపలేవని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజ్ పేర్కొన్నారు. గురువారం సదాశివపేట పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా మున్సిపల్ కార్మికులు బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించగా, మహిళ కార్మికులు రోడ్డుపై బతుకమ్మ ఆడారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రవీన్‌కుమార్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు,మల్లేశ్వరి, సీపీఐ నాయకులు షఫీ, తాజోద్దిన్, సుశీల, సీఐటీయూ నాయకులు చంద్రయ్య, మన్నేశ్, అమృతరావు, అంజయ్య, సంతోష, లక్ష్మి, సంగమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం
దుబ్బాక: కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్పష్టం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని గురువారం దుబ్బాకలో ఎమ్మెల్యేకు నగర పంచాయతీ కార్మికులు విన్నవించారు.