సాక్షి, అమరావతి: కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతోందనే దుష్ప్రచారం వెనుక అసలు కథ వెలుగు చూసింది. చంద్రబాబు హయాంలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన రాయిటర్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో వింతేమీ లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏమిటా ఒప్పందం..?
థామ్సన్ రాయిటర్స్ సంస్థకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ డెవలప్‌మెంట్’ కార్యక్రమం కింద రాయిటర్స్‌తో నాడు రాష్ట్ర ఐటీ శాఖ రెండు ఒప్పందాలు చేసుకుంది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విశాఖలోని గీతం వర్సిటీ అందుకు సంధానకర్తగా వ్యవహరించింది. లోకేశ్ అప్పట్లో ఐటీ మంత్రిగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ఐటీ శాఖ, గీతం వర్సిటీ, రాయిటర్స్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన ‘ఇన్నోవేషన్ యాప్ స్టూడియో’ను 2017 అక్టోబరు 9న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అకడమిక్, స్టార్టప్, పరిశోధనలకు ప్రోత్సాహం పేరుతో ఈ స్టూడియోను నెలకొల్పారు. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధే ఉంటే విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనో, నగర శివార్లలో ఉన్న ఐటీ సెజ్‌లోనో ఇన్నోవేషన్ యాప్ స్టూడియోను ప్రభుత్వం నెలకొల్పేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇ– ప్రగతి నిధులూ రాయిటర్స్‌కు ...
‘ఇ–ప్రగతి’ కార్యక్రమం కింద కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయిటర్స్ వార్తా సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మరో ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ కంటెంట్ ఎక్ఛేంజ్’ పేరిట ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం రాయిటర్స్ సంస్థకు చెందిన ఇ–బుక్ సాఫ్ట్‌వేర్, లీగల్ రిసెర్చ్ సొల్యూషన్స్, వెస్ట్‌లా తదితర మెటీరియల్‌ను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు వినియోగించుకుంటాయి. అందుకు రాయిటర్స్‌కు ప్రభుత్వం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సాఫ్ట్‌వేర్ వినియోగానికి టెండర్లు పిలిస్తే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. (చదవండి: కియాపై మాయాజాలం)
Comments
Please login to add a commentAdd a comment