బది‘లీలలు’! | Revenue officials are waiting for the opportunity | Sakshi
Sakshi News home page

బది‘లీలలు’!

Published Tue, Jun 21 2016 1:53 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Revenue officials are waiting for the opportunity

కలెక్టరేట్‌లో పాతుకుపోయిన 15 మంది అధికారులు
వీరిని పక్కమండలాలకూ పంపలేని వైనం
ముడుపులే బదిలీలను  ఆపిస్తున్నాయా?
అవకాశం కోసం  ఎదురుచూస్తున్న  రెవెన్యూ అధికారులు

 

కలెక్టరేట్‌లో ఓ పరిపాలనా అధికారి సుమారు పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. పైసా ముట్టందే  ఫైలు కూడా తాకరు. అడిగినంత ఇవ్వకుంటే ఇచ్చినంత పుచ్చుకుని ఫైలు దాచేస్తాడు. కాంట్రాక్టు ఉద్యోగులనూ వేధించే ఈ అధికారి ఉన్నతాధికారులకు ముడుపులందిస్తూ... కలెక్టరేట్‌లో తన దందా కొనసాగిస్తున్నాడు. ఈ బదిలీల్లో అయినా కలెక్టరేట్‌కు ఈయన నుంచి విముక్తి లభిస్తుందని రెవెన్యూ సిబ్బంది భావించారు. అయితే ఫలితం లేకుండా పోయింది.

 

ఒక డెప్యూటీ తహశీల్దార్ 2001లో కలె క్టరేట్‌లో విధుల్లో చేరారు. ఒక్క ఆర్‌ఐ పీరియడ్‌లో తప్ప తన సర్వీస్ మొత్తం కలెక్టరేట్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు ముడుపులు చెల్లిస్తుండటంతోనే  బదిలీ చేయడంలేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికీ బదిలీ తప్పదని కలెక్టర్ చెప్పడంతో.. ఆ అధికారి కచ్చితంగా ట్రాన్స్‌ఫర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ పైరవీ ఫలించింది. ఆ అధికారి మళ్లీ ఇక్కడే నిలిచారు.

 

చిత్తూరు: రెవెన్యూ ఉద్యోగుల బది‘లీలల’పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్‌లో పీఠాధిపతులుగా పాతుకుపోయిన ఆ 15 మందిని ఈ సాధారణ బదిలీల్లో కూడా కదపకపోవడంపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అని తెలిసిన ప్రతిసారీ వీరు డిప్యూటేషన్‌పై ల్యాండ్‌అక్విజేషన్, ఆర్డీవో, డీఎస్‌వో ఆఫీసులకు వెళ్లడం.. అక్కడ కొన్నేళ్లు పనిచేసి మళ్లీ కలెక్టరేట్‌కే రావడం రివాజుగా మారుతోంది. వీరిని కనీసం చిత్తూరు చుట్టుపక్కల మండలాలకు కూడా బదిలీచేయకపోవడం గమనార్హం.

 
పారదర్శకత ఏదీ?

మూడేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రతి ఉద్యోగినీ బదిలీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఐదేళ్లకు మించి ఉంటే ఉద్యోగి ఇష్టంతో సంబంధం లేకుండా జిల్లాలో ఏ మూలకైనా బదిలీ చేయొచ్చు. మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిబంధనలను అధికారులు కచ్చితంగా వర్తింపజేస్తున్నారు. అయితే కలెక్టరేట్‌కు వచ్చేసరికి మంచి పనితీరు అనే నెపంతో నిబంధనలు పక్కన పెడుతున్నారు.  మండలాల్లో పనిచేసే ఉద్యోగులు బలైపోవాల్సి వస్తోంది.

 
ముడుపులే కారణమా?

బదిలీ నిలుపుదల చేసుకునేందుకు కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఆ 15 మంది ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో  ముడుపులు అందజేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా పనితీరు బాగుందని కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తూ వారిని ఇక్కడే ఉంచుతున్నారు. సంవత్సరాల తరబడి వీరు ఒకే చోట పనిచేస్తుండడంతో ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు.

 
ఆశ..నిరాశే
చిత్తూరు నుంచి 20 కి.మీ పరిధిలోని పూతలపట్టు, జీడీనెల్లూరు, గుడిపాల, యాదమర్రి, తవనంపల్లి, ఐరాల, పెనుమూరు మండలాల రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్‌లో పనిచేయాలని తమ కోరికను పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి విన్నపాన్ని బుట్టదాఖలుచేస్తున్నారు. దీంతో వారిలో తీవ్ర అసంతృప్తి రేకెత్తుతోంది. అవకాశం ఇస్తే ఇప్పుడున్నవారికంటే బాగా పనిచేస్తామని చెబుతున్నారు.

 
సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లోనూ..

సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లోనూ పీఠాధిపతుల జాబితా పెద్దదే. తిరుపతి, మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లో కొందరు ఏళ్లతరబడి పాతుకుపోయారు. వీరు సీనియర్ అనే నెపంతో జూనియర్ ఉద్యోగులను వేధిస్తున్నారు. రాచరిక తీరును ప్రదర్శిస్తూ కిందిస్థాయి ఉద్యోగులను అవమానాలకు గురిచేస్తున్నారు.

 మోక్షం కలిగేనా?

 జిల్లాలో నలుగురు తహశీల్దార్లను బలవంతపు సెలవులో పంపారు. నాలుగు నెలల నుంచి వారు సెలవులో ఉన్నారు. వీరు గత శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్ కూగా హాజరయ్యారు. అయితే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్‌చార్జ్ ఎమ్మార్వోలు ఉన్న మండలాల్లో చాలా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీరు పాలనపై సరిగా దృష్టిపెట్టకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరుకు ఏం అరుణ్‌కుమార్ ఇంచార్జ్ ఎమ్మార్వోగా పనిచేస్తున్నారు. ఈయ న ఎక్కువ సమయం ఆర్డీవో కార్యాలయంలో గడుపుతుండటంతో తహశీల్దార్ ఆఫీసులో పాలన పడకేసింది.

 
నామమాత్రంగా బదిలీ

కలెక్టరేట్‌లో దాదాపు 55 మంది రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న డెప్యూటీ తహశీల్దారు స్థాయి సిబ్బందిలో ఐదుగురిని మాత్రమే బదిలీ చేశారు. మిగిలిన వారు అక్కడే పాతుకుపోయారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement