
సాక్షి, అమరావతి: గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ విజయవంతమైంది. అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 3.92 శాతం తక్కువ ధరకే రూ.318.81 కోట్లకు సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. టీడీపీ అధికారంలో ఉండగా ఇవే పనులను ఐబీఎం కంటే 4.44 శాతం అధిక ధరకు అప్పటి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సన్నిహితుడికి చెందిన ఎమ్మెస్సార్ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అస్మదీయులకు అధిక ధరలకు అప్పగించే ఎత్తుగడలపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడంతో సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్) ఈ టెండర్‌ను ఆమోదించలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ టెండర్‌ను రద్దు చేసిన అధికారులు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో గతంతో పోల్చితే మొత్తంమ్మీద 8.36 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ ముందుకు రావడంతో ఖజానాకు రూ.27.76 కోట్లు ఆదా అయ్యాయి.
- గుంటూరు చానల్ 47 కి.మీ. మేర ఆధునికీకరణ పనులకు రూ.331.81 కోట్ల అంచనా వ్యయంతో 2018 జనవరి 19న టీడీపీ సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
- ఫిబ్రవరి 4న సాంకేతిక బిడ్ తెరవగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్, జీవీవీ కన్‌స్ట్రక్షన్స్, సూర్య కన్‌స్ట్రక్షన్స్, ఎమ్మెస్సార్ కన్‌స్ట్రక్షన్స్, శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ షెడ్యూళ్లు దాఖలు చేశాయి.
- ఎమ్మెస్సార్ కన్‌స్ట్రక్షన్స్‌కే పనులు అప్పగించాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
- అనర్హత వేటుకు గురైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్, సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ప్రైస్ బిడ్‌ను ఫిబ్రవరి 8న తెరిచారు. ఎమ్మెస్సార్ ఇన్‌ఫ్రా 4.44% అధిక ధరలకు (రూ. 346.57 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచింది.
- టెండర్ నిబంధనల్లో అక్రమాలకు పాల్పడటం, ఎమ్మెస్సార్ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు చేసిన అనుభవం లేకపోవడం, తప్పుడు ధ్రువీకరణపత్రాలు సమర్పించడం, ముడుపులు చేతులు మారడంపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడంతో ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, వై.రాజీవ్‌రెడ్డి, సీఈ ఏజీ మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ వి.శ్రీనివాస్ నేతృత్వంలోని సీవోటీ ఈ టెండర్లను ఆమోదించలేదు.
- తాజాగా ఈ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించగా సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి. ప్రైస్ బిడ్‌లో 0.92 శాతం తక్కువకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఈ ధరనే అంచనా విలువగా నిర్ణయించి ఈ–ఆక్షన్ నిర్వహించగా 3.92 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన సుధాకర్ ఇన్‌ఫ్రాటెక్ పనులను దక్కించుకుంది. ఈ టెండర్లను ఆమోదించాలని గుంటూరు జిల్లా ఎస్‌ఈ శుక్రవారం సీవోటీకి ప్రతిపాదనలు పంపారు.
’రివర్స్’తో ఇప్పటిదాకా రూ.1,838.67 కోట్లు ఆదా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక విధానం రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటిదాకా రాష్ట్ర ఖజానాకు రూ.1,838.67 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటిదాకా ఈ విధానం వల్ల వివిధ అంశాల్లో ఆదా అయిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment