‘రెవెన్యూ’లో తిరుగుబాటు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖలో ముసలం ప్రారంభమైంది. ఉన్నతాధికారి, కిందిస్థారుు సిబ్బంది మధ్య కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారస్థారుుకి చేరింది. రెవెన్యూ శాఖ కార్యకలాపాలకు సంబంధించి జారుుంట్ కలెక్టర్ తీసుకువస్తున్న ఒత్తిళ్లతో ఆ శాఖలో తిరుగుబాటు చోటు చేసుకుంది. అవసరమైన సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించకుండానే నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేయాలని ఆదేశించడం.. సకాలంలో చేయలేనివారిపై చర్యలు తీసుకోవడం, మరికొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడటం, హెచ్చరికలు జారీ చేయడంతో సిబ్బంది మనస్తాపానికి గురవుతున్నారు.
రెవెన్యూ ఉద్యోగుల పైనే కాకుండా రేషన్ డీలర్లు, గ్రామ రెవెన్యూ ఆదికారులు సైతం జేసీ జి.వీరపాండ్యన్ వైఖరితో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. రెవెన్యూ సంబంధమైన అన్ని వర్గాల నుంచీ ఆయన తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా శుక్రవారం జేసీ నిర్వహించిన ఒక సమావేశాన్ని మొత్తం తహశీల్దార్లందరూ బహిష్కరించడంతో ఈ అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరింది.
జేసీ తీరుకు వ్యతిరేకంగా తొలుత ఈ నెల మొదటి వారంలో రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు కచ్చితంగా రేషన్ షాప్‌లో నిర్వహించాలని, స్టాక్ రిజిస్టర్ నిరంతరం ఒకటే ఉండేలా కొత్త విధానం తీసుకురావడంతోపా టు అన్ని డీపోల్లోనూ 95 శాతానికి తక్కువ లేకుండా ఆధార్ అనుసంధానం చేయాలని ఆదే శించారు. సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో డీలర్లు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని జేసీకి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసి జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారికి ఆధార్ అనుసంధానానికి గడువు పెంచారు.
ఇటీవల రాజాం మండలంలో జమాబందీ కార్యక్రమంలో భాగంగా ఆడంగల్ పూర్తి చేయలేదంటూ 17 మంది గ్రామ రెవెన్యూ ఆధికారులకు జేసీ చార్జిమెమోలు ఇచ్చారు. తమకు కొంత సమయం ఇవ్వమని వారు కోరినా పట్టించుకోలేదు. దీంతో వీఆర్‌ఏల సంఘ సభ్యులు శ్రీకాకుళంలో అత్యవసర సమావేశం నిర్వహించి జేసీ తీరుపై నిరసన తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కంప్యూటర్లు, ఆపరేటర్లు, నెట్ సదుపాయం, నిరంతర విద్యుత్ తదితర సమస్యలు ఉన్నాయని అడంగల్ ఆధునీకరణకు సమయం కావాలని కోరారు. సౌకర్యాలు కల్పించకుండా తమ పీక మీద కత్తి పెట్టడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా శుక్రవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ఒక సమీక్ష సమవేశాన్ని తహశీల్దార్లు బహిష్కరించారు. తమకు వసతులు కల్పించి పని ఒత్తిడి తీసుకురావాలని జేసీని కోరారు. తహశీల్దార్లకు సుమారు 50 రకాల విధులు ఉన్నాయని, వీటిలో ఏ ఒక్క విషయంలో వెనుకబడినా చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించడంతో తహశీల్దార్లు అందోళనకు దిగారు. దీంతో సమావేశం జరలేదు. దీనిపై జేసీ, డీఆర్‌వో తహశీల్దార్లతో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు.
ప్రభుత్వ నిర్ణయాలనే అమలు చేస్తున్నా:జేసీ
ఈ అంశాలను జేసీ వీరపాండ్యన్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వం ఆదే శాల మేరకే ఒత్తిడి తేవాల్సి వస్తోందన్నారు. ఆధార్ సీడింగ్ తప్పని సరిగా చేయాలన్న ఒత్తిడి తనపైనా ఉందన్నారు. రెవెన్యూలో పనిచేస్తున్న ఉద్యోగులు తన ఉద్యోగులని, వారి బాగోగులు చూడటం తన బాధ్యత అన్నారు. అంతే తప్ప వారిపై ఎటువంటి కోపం లేదని స్పష్టం చేశారు. వసతుల కల్పనకు ప్రయత్నిస్తామన్నారు. తహశీల్దార్ల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తానన్నారు.