
భగ్న ప్రేమికుడి కుట్ర భగ్నం
అతనో భగ్న ప్రేమికుడు. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ కుదరలేదు. ఆమె భర్తను చంపేద్దామని ప్రయత్నిస్తూ.. అనుకోకుండా జరిగిన మిస్ఫైర్ సంఘటనలో పోలీసులకు దొరికిపోయాడు. అతనే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆంజనేయస్వామి ఆలయ పూజారి రవి దత్తు. పోలీసులు విచారించినప్పుడు మొత్తం విషయమంతా అతడు బయటపెట్టాడు. తొలుత బంధువుల అమ్మాయిని ఇష్టపడిన రవి, తన అన్నకు పెళ్లి కాకపోవడంతో తాను పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇంతలోనే ఆమెకు 2008 సంవత్సరంలో పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా అతడికి ఆశ చావలేదు. ఆమె భర్తను చంపేస్తే.. తర్వాత పెళ్లి చేసుకోవచ్చని భావించాడు.
అప్పటినుంచి ఆమె భర్తను హతమార్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. తరచు ఏదో పని ఉన్నట్లుగా ఒంగోలు వెళ్లడం, అక్కడ ఆమె భర్తతో మాట్లాడి రావడం చేసేవాడు. టీవీ ఛానళ్లలో వచ్చే క్రైం సీరియళ్లు చూసే రవిదత్తు, తాను ప్రేమించిన మహిళ భర్తను ఒకసారి పీకకు తాడు బిగించి చంపుదామనుకున్నాడు, మరికొన్ని సార్లు కాలవలో తోసేసి, లారీకింద తోసేసి చంపుదామనుకున్నాడు. ఈ అన్ని ప్రయత్నాలకూ తన వెంట రమేష్, అనిల్ అనే ఇద్దరు ఆటోడ్రైవర్లను కూడా తీసుకెళ్లేవాడు. కానీ అతడి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి.. అక్కడ ఓ రివాల్వర్ కొన్నాడు. సోమవారం ఒంగోలు వెళ్లి, అక్కడినుంచి తిరిగి తెల్లవారు జామున 2-3 గంటల సమయంలో విజయవాడ వచ్చాడు.
సంప్రదాయం ప్రకారమే లుంగీ కట్టుకునే రవిదత్తు, తన బొడ్డులో రివాల్వర్ దోపుకొనేవాడు. మంగళవారం తెల్లవారుజామున విజయవాడ బస్టాండుకు వచ్చినప్పుడు కూడా రివాల్వర్ అలాగే ఉంది. అయితే, బాత్రూంకు వెళ్లినప్పుడు లోపల అనుకోకుండా రివాల్వర్ పేలింది. దాంతో బాత్రూం తలుపు గుండా బయటకు వచ్చిన బుల్లెట్.. బయట ఉన్న వ్యాపారి వెంకటరమణ కాలికి తగిలింది. పెద్ద శబ్దం రావడంతో తాను ఏంటో అనుకున్నానని, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా ప్యాంటు నుంచి రక్తం వస్తోందని చెప్పడంతో చూసుకున్నానని వెంకటరమణ ఆస్పత్రిలో విలేకరులకు చెప్పాడు. వాస్తవానికి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా వెంకటరమణనే అనుమానించారు. రవిదత్తు బయటకు వచ్చి ఏమీ తెలియనట్లుగా ఏం జరిగిందని అడిగాడు. అయితే బస్టాండులో ఉన్న పోలీసులు వెంటనే గేట్లు మూసేసి తనిఖీ చేయడంతో పూజారి బొడ్డులో ఉన్న రివాల్వర్ బయటపడింది. మొత్తం విషయం బయటకొచ్చింది.