
ఇదో ‘దారి’ దోపిడీ
పేదలకు చేరాల్సిన కిలో రూపాయి బియ్యంలో ప్రతి బస్తాపైనా అక్రమార్కులు పందికొక్కుల్లా ఎగబడుతున్నారు. కిలోలుకిలోలుగా బొక్కిన బియ్యం టన్నులకు చేరగా రీ సైక్లింగ్ చేసి,
సాక్షి, కాకినాడ :పేదలకు చేరాల్సిన కిలో రూపాయి బియ్యంలో ప్రతి బస్తాపైనా అక్రమార్కులు పందికొక్కుల్లా ఎగబడుతున్నారు. కిలోలుకిలోలుగా బొక్కిన బియ్యం టన్నులకు చేరగా రీ సైక్లింగ్ చేసి, బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చీకటిదందా వెనుక అధికార తెలుగుదేశం నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏడీబీ రోడ్లో తరుగుతో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం సరఫరా కాంట్రాక్టర్ టీడీపీ ప్రజాప్రతినిధి కావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.జిల్లాలో తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ, రచ్చబండ కార్డులు 15,28,598 ఉండగా, నెలనెలా 2,560 రేషన్‌షాపుల ద్వారా బియ్యం, పంచదార, పప్పు, కిరోసిన్ తదితర నిత్యావసరాలు పంపిణీ చేస్తుంటారు. కిలో రూపాయి బియ్యం కింద ప్రతి నెలా 18 వేల టన్నులు ఇస్తుంటారు.
ఈ బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్స్ నుంచి మండల స్థాయిల్లోని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సరఫరా చేస్తారు. గోడౌన్ల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు స్టేజ్-1 కాంట్రాక్టర్, ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు స్టేజ్-2 కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. గోడౌన్ల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు చేరేలోపు వంద, రెండువందల గ్రాముల తరుగు రావడం సహజం. కానీ జిల్లాలో రేషన్ డీలర్ల పరిస్థితి ఁసంచి లాభం చిల్లుకు చెల్లురూ. అన్నట్టు తయారైంది. వందకేజీల బస్తాకు రెండు నుంచి ఐదు కిలోల వరకు తరుగు వస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు. ఇలా ప్రతి బస్తాకు వచ్చే తరుగు లెక్కిస్తే జిల్లాలో వందల టన్నులవుతోంది.
ఈ బాగోతం ఎప్పటి నుంచో సాగుతున్నా అధికారులు 60 టన్నులకు 18 క్వింటాళ్ల తరుగుకాగా పలువురు డీలర్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పెద్దాపురం వద్ద ఏడీబీ రోడ్లో ఈనెల ఒకటిన సుమారు 60 టన్నుల బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలిస్తున్న ఏడులారీలపై జేసీ ఆదేశాల మేరకు పౌరసరఫరాల సిబ్బంది ఆకస్మిక దాడి చేశారు. స్టాక్ రికార్డులు, లోడును పోల్చితే రికార్డుల్లో ఉండాల్సిన బియ్యం కంటే 18 క్వింటాళ్లు తక్కువున్నట్టు గుర్తించి విస్తుపోయారు. బియ్యంతో సహా లారీలను సీజ్ చేసి, లారీ డ్రైవర్లతో పాటు స్టేజ్-1 కాంట్రాక్టర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. ఆ కాంట్రాక్టర్ మరెవరో కాదు టీడీపీకి చెందిన తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్.
ఆయన గత కొన్నేళ్లుగా జిల్లాలో ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా చేసే స్టేజ్-1 కాంట్రాక్టర్‌గా ఉన్నారు. స్టేజ్-1లోనే కాక స్టేజ్-2లోనూ తరుగుదగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. 60 టన్నుల లోడులోనే 18 క్వింటాళ్ల తరుగు వచ్చిందంటే ఇక ప్రతి నెలా రేషన్‌షాపులకు సరఫరా చేసే 18 వేల టన్నుల బియ్యంలో ఏ స్థాయిలో తరుగు వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ప్రతి నెలా వందల క్వింటాళ్ల బియ్యం పక్క దారి పడుతూనే ఉందని తాజాఘటన ద్వారా మరోసారి తేటతెల్లమైంది. ఎవరికీ అనుమానం రాకుండా మార్గమధ్యంలోనే హుక్‌లతో పొడిచి ఒక్కో బస్తా నుంచి రెండు నుంచి ఐదు కిలోలకు తక్కువ కాకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఇన్నాళ్లూ వినిపించిన ఆరోపణలకు ఈ తాజా ఘటన బలం చేకూర్చింది.
రీ సైక్లింగ్‌తో రూ.కోట్ల ఆర్జన
పక్కదారి పట్టించిన బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తూ దొడ్డిదారిన బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.15కు తక్కువ కాకుండా విక్రయిస్తూ కోట్లు కూడగట్టుకుంటున్నట్టు ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు క్రమం తప్పకుండా మామూళ్లు వెళ్తుండడం వలనే ఈ అక్రమార్కులపై అధికారులు ఇన్నాళ్లూ ఉదాసీనంగా వ్యవహరించే వారంటున్నారు. కొంతమంది డ్రైవర్లు తమకు తెలియకుండా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని, తమ ప్రమేయం లేదంటూ సదరు కాంట్రాక్టర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్నతస్థాయిలో వస్తున్న ఒత్తిళ్ల మేరకు ఆ కాంట్రాక్టర్ పేరును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెల్సింది. ఇకనైనా బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి కార్డుదారులకు చేరే వరకు సక్రమంగానే రవాణా అవుతున్నాయా లేక పక్కదారి పడుతున్నాయా అన్న దాని నిరంతరనిఘా వేయాల్సిన అవసరం ఉంది.