మిల్లర్ల చిల్లర వేషాలు | Rice Millers Fraud In SPSR Nellore District Over TDP Tenure | Sakshi
Sakshi News home page

మిల్లర్ల చిల్లర వేషాలు

Published Sun, Feb 16 2020 11:53 AM | Last Updated on Sun, Feb 16 2020 11:58 AM

Rice Millers Fraud In SPSR Nellore District Over TDP Tenure - Sakshi

జిల్లాలో రైస్‌ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్ల విషయంలో దొంగాట ఆడుతున్నారు. ఓ వైపు వరికోతలు ఊపందుకున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు అన్నదాతలకు నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నా.. కొందరు మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలు ఇవ్వడంలో జాప్యం చేస్తూ ప్రభుత్వానికి సహకరించడం లేదు. మరో వైపు దళారులను రంగంలోకి దింపి కల్లాల్లోనే ప్రభుత్వ మద్దతు ధరకంటే భారీగా తగ్గించి కొనుగోళ్లు చేయిస్తూ అన్నదాతల కష్టాన్ని దోచుకుంటున్నారు. కొంత మంది మిల్లర్లు అరకొర మొత్తానికే బ్యాంక్‌ గ్యారెంటీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బయట మాత్రం రూ.కోట్ల పెట్టుబడులు పెట్టి దళారులతో ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిల్లర్ల తీరుపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. 

సాక్షి, నెల్లూరు: ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకనేక చర్యలు చేపడుతోంది. పంట సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించి ఆదుకున్న ప్రభుత్వం.. పంటల దిగుబడులకు ముందే మద్దతు ధర ప్రకటించి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలోకి పంపించి రైతులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు చేపడుతోంది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ధాన్యం కేటాయించేందుకు మిల్లర్లు ప్రభుత్వానికి బ్యాంక్‌ గ్యారెంటీలు ఇవ్వకుండా, సహకరించకుండా చిల్లర వేషాలు వేస్తున్నారు. మరో వైపు దిగుబడులు వచ్చిన ధాన్యాన్ని రైతులు కల్లాల్లో నిల్వ చేయలేని పరిస్థితులను ఆసరాగా చేసుకుని దళారులను రంగంలోకి దించి దారుణంగా ధరలు తగ్గించి కొనుగోలు చేయిస్తున్నారు.

గత టీడీపీ హయాంలో సీఎంఆర్‌ బియ్యం సరఫరాలో భారీ అవినీతికి పాల్పడి ఆ పార్టీ పెద్దల సహకారంతో కేసులతో మమ అనిపించుకుని దర్జాగా ఉన్న మిల్లర్లు.. తాజాగా దొంగాట ఆడుతూ  అధికారులకు చుక్కలు చూపెడుతున్నారు. రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏటా సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. ప్రస్తుతం ఎకరాకు 3.5 నుంచి 4 పుట్ల ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో పాటు సాగునీరు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ఈ ఏడాది జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు గాను 90 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. 

దళారులతో దోపిడీ 
మిల్లర్లు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోళ్లు కేంద్రాలకు బ్యాంక్‌ గ్యారెంటీల విషయంలో కావాలనే జాప్యం చేస్తూ మరో వైపు దళారుల ద్వారా కల్లాల్లోనే కొనుగోళ్లు చేయిస్తున్నారు. ధాన్యం దిగుబడులు ప్రారంభం కావడంతో బ్యాంక్‌ గ్యారెంటీలు లేని కారణంగా కొనుగోలు కేంద్రాలకు పంటను విక్రయించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రాల నుంచి కూడా మిల్లులకు ధాన్యం కేటాయించలేపోతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకోలేక.. నిల్వ చేయలేక  ఇబ్బంది పడుతున్న రైతులు గత్యంతరం లేక దళారులకే విక్రయాలు చేసుకుంటున్నారు. పరిస్థితులను అనుకూలంగా చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమాంతంగా తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు.  ప్రభుత్వం వరి సాధారణ రకం క్వింటాకు రూ.1,815 వంతున పుట్టికి (850 కేజీలు) రూ.15427.50, ఏ గ్రేడ్‌ రకం పుట్టికి రూ.15597.50 మద్దతు ధర నిర్ణయించింది. కానీ దళారులు మాత్రం పుట్టి ధాన్యం రూ.11,500 నుంచి రూ.12,000 వంతున కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల వారం రోజుల వ్యవధిలో పుట్టి ధాన్యానికి రెండు వేల తగ్గించారు. మద్దతు ధరకంటే రూ.4 వేలు తక్కువతో కొనుగోలు చేసూ్తనే.. తేమ పేరుతో ప్రతి బస్తాకు నాలుగు కేజీల వంతున తరుగు తీసుకుంటూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు.  

రూ.24 కోట్లకే బ్యాంక్‌ గ్యారెంటీలు
గత నెల రోజులు నుంచి జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు, జాయింట్‌ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సారథ్యంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించి మిల్లర్లను బ్యాంక్‌ గ్యారెంటీలు ఇవ్వాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా వారు సక్రమంగా స్పందించడం లేదు. నెల రోజులు నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏఓ కుంటిసాకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 65 మంది మిల్లర్లు కేవలం రూ.24 కోట్ల మేరకే బ్యాంక్‌ గ్యారెంటీలు ఇవ్వడం గమనార్హం.

టీడీపీ హయాంలో దోపిడీ 
టీడీపీ హయాంలో మిల్లర్లు, అధికారులు, ఆ పార్టీ పెద్దలు కుమ్మక్కై సీఎంఆర్‌ బియ్యం సరఫరా విషయంలో భారీగా అవినీతి పాల్పడ్డారు. 2015–16 ఏడాదిలో కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం 3.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేశారు. మిల్లర్లకు సీఎంఆర్‌ రైస్‌ పద్ధతిలో ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అంటే 67 శాతం బియ్యం అంటే 2.16 లక్షల టన్నుల మెట్రిక్‌ బియ్యానికి గాను 1.97 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 18,905 మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయి ఉంది. దీని విలువ రూ.36 కోట్లు ఉంది. అప్పటి నుంచి మిల్లర్లు బియ్యం ఇవ్వకపోవడంతో వారికి జరిమానాలతో 2017 నాటికి బకాయిలు రూ.56 కోట్లకు చేరింది. మొత్తం దాదాపు 37 మంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు లెక్క తేలింది.

అప్పటి ప్రభుత్వ పెద్దలు మిల్లర్లకు అండగా నిలవడంతో నామమాత్రపు కేసులతో సరిపెట్టారు. ఆపై ఏకంగా పౌరసరఫరాల సంస్థ కార్యాలయానికి అగ్నిప్రమాదం జరిపించి రికార్డులు కాలిపోయేలా చేశారు. ఈ ప్రమాదం వెనుక మిల్లర్ల హస్తం ఉందన్న విషయం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కానీ మిల్లర్లపై ఎలాంటి చర్యలు లేకుండా ప్రభుత్వ పెద్దలు కాపాడారు. ఆపై స్వల్పంగా బకాయిలు రాబట్టారు.జిల్లాలో ఇప్పటి వరకు 90 ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 391.120 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశాంమని, మిల్లర్ల నుంచి బ్యాంక్‌ గ్యారెంటీలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ రోజ్‌మాండ్‌ తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement