ఉలవపాడు : గత నెల 11వ తేదీన 65 బస్తాలు.. ఈ నెల 14వ తేదీన 16 బస్తాలు.. అంటే ఒకే నెలలో రెండు సార్లు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఒకే వాహనాన్ని ప్రజలు పట్టుకుని అధికారులకు అప్పగించారు. ఉలవపాడులో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇందుకు అధికార పార్టీ నేతల అండ అక్రమార్కులకు పుష్కలంగా ఉండగా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
బియ్యం తరచూ ఒకే వాహనంలో తరలిపోతున్నా పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది. పలువురు వ్యాపారులు ఉలవపాడు కేంద్రంగా రేషన్ బియ్యాన్ని పక్క జిల్లాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో బియ్యం కొనుగోలు చేసి కావలి, నెల్లూరుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యం కేజీకి 11 రూపాయలకు కొనగోలు చేసి కావలి, నెల్లూరుకు తరలించి పాలిష్ చేసి అక్కడ 18 రూపాయలుకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
అప్పుడు.. ఇప్పుడు వాహనం ఒకటే
గత నెల 11వ తేదీ, ఈ నెల 14వ తేదీ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ రెండు సమయాల్లో అక్రమార్కులు ఒకే ఒక వాహనం వాడటం గమనార్హం. కొన్ని వాహనాలు అక్రమ రవాణాకే వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. డ్రైవర్లు కూడా ప్రత్యేకంగా ఉన్నారు. ఏపీ 27 టీడబ్ల్యూ 6006 నంబరు గల వాహనంలో మొదట 65 బస్తాలు, ఇప్పుడు 16 బస్తాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు ఏం చేస్తున్నట్లు?
బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అధికార పక్షం అండ, అధికారుల మామూళ్ల మత్తు వెరసి బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. గతంలో వాహన డ్రైవర్లు బియ్యాన్ని కరేడు షాపుల నుంచి తెస్తున్నామని అధికారుల విచారణలో చెప్పినా ఆ దిశగా దర్యాప్తు కొనసాగిన దాఖలాలు లేవు. ప్రజలు వాహనాలను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇస్తుండటంతో మాత్రమే వ్యాపారుల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై వారానికి 5 వాహనాలు రేషన్ బియ్యంతో వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా
Published Mon, Dec 15 2014 1:00 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement