అనుకున్నంతా.. అవుతోంది!!
భయపడినట్లే జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలన్నీ నిజమేనని క్రమంగా బయటపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చే వాహనాలన్నీ రవాణా పన్ను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం, రాజధాని నగరాన్ని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెప్పడం లాంటివి చూస్తుంటే సీమాంధ్ర ప్రాంత వాసులు వ్యక్తం చేసిన భయాలు ఒక్కొక్కటీ నిజం అవుతున్నాయనిపిస్తుంది. వాస్తవానికి 2015 వరకు రవాణాపన్ను విధించకూడదని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా.. ఈలోపే ఈ పన్ను విధించాలని తలపెట్టడం, నిర్ణయించడం రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది. ఏపీకి కేటాయించిన పాత అసెంబ్లీ హాల్ ఓ చారిత్రక భవనమని, అందువల్ల దానికి మరమ్మతులు చేయడం సరికాదని రామలింగారెడ్డి అన్నారు. మరమ్మతులు చేయడాన్ని సీమాంధ్రుల ఆగడంగా అభివర్ణించిన ఆయన.. రాజధానిని తక్షణమే తరలించుకోవాలంటూ హుకుం జారీచేశారు.
ఎంసెట్కు సంబంధించి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇప్పుడే కౌన్సెలింగ్ నిర్వహించకూడదని, తాము తలపెట్టిన 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకం మార్గదర్శకాలు రూపొందించడానికి సరిపడగా అధికారులు లేరని, అందువల్ల ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ను అక్టోబర్ వరకు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఇలా చేయడం వల్ల విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని, చివరకు వారి పీజీ ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలపై కూడా దీని ప్రభావం పడుతుందన్నది విద్యావేత్తల అభిప్రాయం. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.
ఇప్పటికే విద్యుత్తు, కృష్ణా జలాల లాంటి విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలను ఆపాలనడం, రవాణా పన్ను విధిస్తామని చెప్పడం, సీమాంధ్రులను రాజధాని వెంటనే తరలించుకుని వెళ్లిపోవాలని చీదరించుకోవడం లాంటివి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని సీనియర్ రాజకీయ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.