సాక్షి, అమరావతి: సహకార సంఘాల్లో బోగస్ సభ్యత్వాలను నియంత్రించి, నిజమైన రైతులకే ఓటు హక్కు కల్పించే దిశగా సహకార శాఖ చర్యలు ప్రారంభించింది. సహకార ఎన్నికలకు ముందు కార్యకర్తలు, నాయకులకు సహకార సంఘాల్లో గంపగుత్తగా సభ్యత్వం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతోంది. నిజమైన రైతులు, కౌలుదారులకే ఓటు హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నిజమైన రైతులకే దక్కనుంది.
ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేస్తోంది. ఓటు హక్కు వినియోగం, సభ్యత్వ అర్హతలపై రూపొందించిన నిబంధనలను సహకార సంఘాలకు వివరిస్తూ మూడు రోజుల క్రితం సర్క్యులర్ జారీ చేసింది. కేవలం ఎన్నికల కోసమే సభ్యత్వం తీసుకున్న రైతులు, భూమిలేని వ్యక్తులు, ధ్రువీకరణ పత్రాలు లేని కౌలుదారులు, సంఘాల సేవలు వినియోగించుకోని రైతులను గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. ఈ వడపోత కార్యక్రమం ద్వారా ఓటర్ల సంఖ్య సగానికి తగ్గే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
గంపగుత్త ఓట్లకిక చెల్లు
అధిక టర్నోవర్ ఉన్న సంఘాలకు పాలకవర్గ సభ్యులుగా పోటీ చేయడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న రైతులు వారి స్నేహితులు, బంధువులు, కౌలుదారులకు గంపగుత్తగా ఓటు హక్కు కల్పిస్తున్నారు. వారి పేరు మీద సభ్యత్వ రుసుము వీరే చెల్లించి, ఎన్నికల్లో వారి ఓటును పొందుతున్నారు. ఈ విధానంలో ఎన్నికైన పాలకవర్గం రైతులకు ఆశించిన స్ధాయిలో సేవలు అందించనందున ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది. కాగా, కొత్త నిబంధనలను గ్రామాల్లోని రైతులకు వివరించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్ జి.వాణీమోహన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కొత్త నిబంధనలు ఇవీ..
- ఆంధ్రప్రదేశ్ కో– ఆపరేటివ్ సహకార చట్టం–1964ను సవరిస్తూ 2006లో తీసుకువచ్చిన మార్పుల అమలు.
- సభ్యత్వం కోరే వ్యక్తి ఆ సంఘం భౌగోళిక పరిధిలో యజమాని లేదా కౌలుదారునిగా ఉండాలి. కౌలుదారుడైతే గ్రామ రెవిన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. యజమానిగా ఉండే రైతు తనకున్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, విక్రయ దస్తావేజు, గ్రామ రెవిన్యూ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. భూ విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబరు తదితర వివరాలను జత చేయాలి.
- కనీసం రూ.300 షేరు ధనం కలిగి ఉండాలి. సంఘం నుంచి ఏడాది కాలంలో కనీసం రూ.1,000 రుణం తీసుకుని ఉండాలి. లేదా ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసి ఉండాలి. ఈ రెండూ లేకపోతే రూ.1,000 కనీసం డిపాజిట్ చేసి ఉండాలి. అప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లభిస్తుంది.
- సంఘంలో చేరిన నాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మధ్య కనీసం 30 రోజులు నిరాటంకంగా సభ్యునిగా కొనసాగి ఉండాలి.
- సంఘంలో తీసుకున్న రుణాన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెల్లించిన రికార్డు ఉండాలి.
- సంఘంలోని సభ్యునికి సాధారణ ప్రాంతంలో రూ.5 వేలు, షెడ్యూల్ ప్రాంతంలో రూ.2,500కు తక్కువ కాకుండా సంఘంలో డిపాజిట్ ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కనీసం రెండేళ్లు వరుసగా ఈ డిపాజిట్ కలిగిన వారికే పోటీచేసే అవకాశం.
- స్వయం సహాయక సంఘాలు అయితే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఆరు నెలల ముందు కనీసం రూ.10 వేల రుణం తీసుకుని ఉండాలి. భూమితో సంబంధం లేకుండా గ్రూపంతటికీ కలిపి ఒక ఓటు ఉంటుంది. పోటీ చేయడానికి అర్హత ఉండదు.
ఈ సంఘాలు రైతులు, కౌలుదారులకు రుణాల మంజూరు, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను విక్రయిస్తున్నాయి. గ్రామాల్లో అందుబాటులో ఉండి, బహిరంగ మార్కెట్‌లో కంటే ధరలు తక్కువగా ఉండటంతో రైతులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment