ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: రిమ్స్ వైద్యశాల, కళాశాల సెమీ అటానమస్ హోదా త్వరలో రద్దు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసినట్లు సమాచారం. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 30వ తేదీ అనంతరం ఎటువంటి కాంట్రాక్టు ఉద్యోగుల నియామక ప్రక్రియ చేపట్టకూడదు. ప్రస్తుతం ఉన్న వారికి కూడా పొడిగింపు ఉత్తర్వులు ఉండవు. జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. 37 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల, వైద్యశాల నిర్మించారు. నాలుగో సంవత్సరం తరగతులకు ఎంసీఐ అనుమతుల కోసం ఇంకా నిర్మాణాలు సాగుతున్నాయి.
రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా తీర్చిదిద్దాలని 2008లో ప్రభుత్వం జీఓ విడుదల చేసి సెమీ అటానమస్ హోదా కల్పించారు. ప్రస్తుతం రిమ్స్‌లో 106 మంది కాంట్రాక్టు వైద్యులుండగా 19 మంది మాత్రమే రెగ్యులర్ వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరుకాక 350 మంది వరకూ నర్సింగ్ సిబ్బంది, మరో 200 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
సెమీ అటానమస్ హోదా రద్దయితే ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలే రిమ్స్‌ను పర్యవేక్షిస్తారు. అయితే తమ పరిస్థితి ఏంటని కాంట్రాక్టు, ఓట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రిమ్స్ వైద్యకళాశాలల్లో సెమీ అటానమస్ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వ రంగంలోని వారినే ఉద్యోగులుగా నియమించాలనే ఆలోచన ఉండటంతో ఈ విధానం కింద పని చేస్తున్న వారంతా తమ వ్యక్తిగత ఉద్యోగ భద్రత కోసం తలో దారి చూసుకుంటున్నట్లు సమాచారం.
రిమ్స్‌లో పనిచేసేందుకు ఎవరూ మిగలరు..
రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్య
సెమీ అటానమస్ రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కానీ ఇప్పటి కిప్పుడు అందరినీ తీసివేస్తే, రిమ్స్‌లో పని చేయడానికి ఎవరూ మిగలరు. కొంత మంది సీనియర్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం మరో ఏడాది పాటూ పొడిగింపు ఉత్తర్వులను మంజూరు చేసింది.
రిమ్స్ సెమీ అటానమస్ రద్దు !
Published Tue, Jan 21 2014 6:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement