తోటి పిల్లలతో ఆడుకుంటున్నాని చెప్పిన ఆ బాలిక అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆడుతూ... అనంత లోకాలకు!
Published Mon, Dec 16 2013 3:56 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
భర్తవానిపాలెం(వేపాడ), న్యూస్‌లైన్ : తోటి పిల్లలతో ఆడుకుంటున్నాని చెప్పిన ఆ బాలిక అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం భర్తవానిపాలెంలో ఓ స్కూల్ బస్సు ఢీకొని పోతల కృష్ణ కుమారి (9) అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం కొత్తవలస మండలం నరపాం సూర్యోదయ మోడల్ స్కూల్ సెలవు కావడంతో పెదగుడిపాలలో బస్సు పెట్టాడు. సాయంత్రం బస్సు డ్రైవర్ తన తమ్ముడుకు డ్రైవింగ్ నేర్పడం కోసం పెదగుడిపాల నుంచి భర్తవానిపాలెం వరకూ తీసుకొచ్చాడు. తిరిగి పెదగుడిపాలకు వెళుతుండగా కన్నంనాయుడు చెరువు మలుపు వద్ద బాలికను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
పమాదంలో మృతి చెందిన ఆ బాలిక వల్లంపూడి వెంకటేశ్వర విద్యానికేతన్‌లో రెండో తరగతి విద్యార్థిని. ప్రమాదం జరిగిన విషయాన్ని పొలం పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. కృష్ణకుమారికి తల్లి నాగమణి, తండ్రి సత్యనారాయణ, సోదరుడు ఉన్నారు. ఆటకు వెళ్లి వస్తానని చెప్పిన తన కుమార్తె ఇలా శవమైందని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాలిక మృతితో ఆ గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలిక తండ్రి పోతల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement