మొక్కుతీరకనే.. మృత్యు ఒడికి..
తిరుపతి తుడా, క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం యూరేనిపల్లెకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి(38) అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి తిరుమలకు వస్తూ ఘోరరోడ్డు ప్రమాదంలో మరణించారు. కారులో బయలుదేరిన విష్ణువర్ధన్‌రెడ్డి(34), అతని తల్లి ప్రమీల(55), తండ్రి దయానందరెడ్డి (58), భార్య కవిత (30), 11 నెలల కూతురు ధన్యశ్రీ మరో గంటలో తిరుమలకు చేరుకోవాల్సి ఉండగా, వారిని విధి వంచిం చింది. మృత్యువు లారీ రూపంలో కబళించింది. మామండూరు అటవీ సమీపానికి చేరుకోగానే కోతుల గుంపు కారు నడుపుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి కంటపడింది.
ఇదిగో కోతులు అంటూ కుటుంబ సభ్యులకు చూపిం చాడు. అంతే రెప్పపాటులో ప్రమాదం జరిగిపోయింది. వేగంగా వస్తున్న విష్ణువర్థన్‌రెడ్డి కారును అదుపుచేయలేకపోయాడు. ఎదురుగా వస్తున్న టెన్‌టైర్ లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే అందరూ మృత్యువుపాల య్యూరు. కారు నుజ్జునుజ్జయింది. ఒడిలో ఉన్న చిన్నారిని బతికించుకుందామని తల్లి ఒడిసిపట్టుకుంది. అయినా ఆమె ప్రయత్నం విఫలమైంది. చిన్నారి కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మృతదేహాలను చూసిన స్థానికులు, వాహనదారులు చలించిపోయారు.
అల్లాడిన చిన్నారి
ప్రమాదానికి గురైన 11నెలల చిన్నారి 15 నిమిషాల పాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడింది. ద్విచక్ర వాహనంపై అటుగా వెళుతున్న వెంకటేష్, శశికాంత్ మానతాహృదయంతో స్పందించారు. ఒకరు 108కు సమాచారమిచ్చారు. మరొకరు ముందుగా తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని బయటకు తీశారు. అప్పడు ఆ చిన్నారి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వాహనం అదరడంతో పాపకు బలంగా సీటు వెనుకభాగం తగలడంతో ఊపిరి తీసుకోలేకపోయింది. చిన్నారి ప్రాణాలతో అల్లాడుతున్నా సహాయకులు ఏమీ చేయలేక కంటతడిపెట్టారు. అంతలోనే శ్వాస విడిచింది.
నెత్తురోడుతున్న రోడ్డు
మామండూరు ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. మామండూరు సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నారుు. శుక్రవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంతో వార్తల్లో నిలిచింది. ఇక్కడ ఏదో ఒకవిధంగా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతం కావడం, రోడ్డుపైకి జంతువులు రావడం, సడన్ బ్రేక్ వేయడం, వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్ చేయడం ప్రమాదాలకు కారణాలని ఆ ప్రాంతీయులు చెబుతున్నారు. శుక్రవారం కూడా కోతుల గుంపు రావడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
మరో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటే..
మామండూరు నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటే ఆ కుటుంబం ప్రమాదం నుంచి బయట పడేది. రేణిగుంట రోడ్డు నుంచి కరకంబాడి మార్గంలో వెళ్లివుంటే ప్రమాదం నుంచి తప్పించుకునేవారేమో. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని భారీ వృక్షాలు ఉన్నాయి. వాటికి తోడు కోతుల గుంపు రోడ్డుపైకి వచ్చి రావడం ప్రమాదానికి కారణమరుుంది.