రెప్పపాటులో పెను విషాదం
- జాతీయ రహదారిపై మురారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురి మృతి, 37 మందికి గాయాలు
గండేపల్లి/కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి... బస్సులోని ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. డ్రైవర్‌కు నిద్ర మత్తు ఆపుకోలేక రెప్పవాల్చాడు.. ఆ రెప్పపాటు కాలంలోనే ఆపద ముంచుకొచ్చింది. పెను ప్రమాదం కబళించింది. పలు కుటుంబాలను వేదనకు, యాతనకు గురిచేసింది. అంతులేని విషాదాన్ని నింపింది.16వ నంబర్ జాతీయ రహదారిపై మురారి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి 36 మంది ప్రయాణికులతో భద్రాచలం బయలుదేరింది. మురారి గ్రంథాలయం సమీపానికి వచ్చేసరికి ఆర్టీసీ బస్ డ్రైవర్ కునికిపాటుకు లోనయ్యాడు. అతడి రెప్పవాలడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ పైనుంచి అవతల రోడ్లోకి దూసుకెళ్లింది. పంచదార లోడుతో విశాఖపట్నం వైపు వెళుతున్న లారీని అతి వేగంగా ఢీకొంది. లారీ ముందు భాగంలోకి బస్సు డ్రైవర్ క్యాబిన్ వరకు దూసుకు పోవడంతో రెండు వాహనాలు నుజ్జయ్యాయి.
ఏం జరిగిందో కూడా తెలియని బస్సు ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ముందు నుంచి బస్సు దిగే దారిలేకపోవడంతో అందరూ లోపలే చిక్కుకుపోయారు. గ్రామస్తులు, హైవే నిర్వహణ సిబ్బంది వెనుక అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగారు. లారీని నడుపుతున్న క్లీనర్ అట్టా రోణిరాజు (22) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మూడు 108 అంబులెన్సుల్లోను, ఒక రాజకీయ పార్టీ ప్రచార వాహనంలోనూ రాజానగరంజీఎస్‌ఎల్‌కు, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కసింకోటకు చెందిన పొనకంపల్లి రమ్యకృష్ణ (25) బుధవారం ఉదయం మృతి చెందింది. అనకాపల్లికి చెందిన రమ్య అత్తింటికి ఆర్టీసీ బస్సులో వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆమెకు రెండు కాళ్లు తెగిపోయాయి. ఆర్టీసీ బస్ డ్రైవర్ సులేమాన్ బేగ్‌ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుంటే దారిలో మృతి చెందాడు. పెద్దాపురం సీఐ నాగేశ్వరరావు, జగ్గంపేట ఎస్సై సురేష్‌బాబు, హైవే మెయింటెనెన్స్ సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు చేపట్టారు.