రాజోలు : ఆటో-ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్‌తోపాటు నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. శుక్రవారం శివకోడు కోనవారి గ్రూపు సమీపంలో ఉన్న చర్చి వద్ద ఆటో-బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సఖినేటిపల్లి రత్నాలపేటకు చెందిన గొల్ల రత్నకుమారి (35) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో లో ఉన్న తెన్నేటి దీనమ్మ, పమ్మి ఏస్తేరు, కొల్లాబత్తుల దీవెన, కొల్లాబత్తుల శ్రీలక్ష్మి గాయపడ్డారు.
శ్రీలక్ష్మి తలకు బలమైన గాయం కావడంతో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలిం చారు. గాయపడ్డ ఆటో డ్రైవర్ కొండేటి ముత్యాలు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సై లక్ష్మణరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం డిపోకి చెందిన బస్సు అమలాపురం వెళ్తుంది. రాజోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన సఖినేటిపల్లి రత్నాలపేట వాసులు నేరుగా అదే ప్రాంతానికి చెందిన కొండేటి ముత్యాలు ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు. ఆ ఆటోలో రాజోలు నుంచి సఖినేటిపల్లి బయలుదేరారు.
శివకోడు కోనవారి గ్రూపు వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న భీమవరం - అమలాపురం బస్సును ఆటో ఢీ కొంది. ఆటోను వేగంగా నడుపుతున్న వికలాంగుడైన డ్రైవర్ ముత్యాలు దానిని అదుపు చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రత్నకుమారి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న తెన్నేటి దీనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
ఆటో-ఆర్టీసీ బస్సు ఢీ
Published Sat, Jun 13 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement