పెదవేగి: కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని ముడిచర్ల గ్రామానికి చెందిన పామర్తి వెంకటేశ్వరరావు(72) కుటుంబ సభ్యులు, బంధువులు సుమారు 30 మందితో కలిసి పెదవేగి మండలంలోని రాట్నాలమ్మ తల్లి దర్శనానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు.
గ్రామ శివారులోకి రాగానే వర్షం వస్తుండటంతో.. ట్రాక్టర్ తోట్టిలో ఉన్నవారు త్వరగా వెళ్లమని డ్రైవర్ పై ఒత్తిడి తేచ్చారు. దీంతో వేగం పెంచి ముందుకు పోనిస్తుండగా.. రోడ్డు తడిసి ఉండటంతో పాటు ప్రమాదకర మలుపు రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సత్యనారాయణ(31) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
ట్రాక్టర్ బోల్తా.. తండ్రీకొడుకుల మృతి
Published Wed, Jun 7 2017 11:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement