దేవుడా..!
చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆరుగురు కర్ణాటకవాసుల మృతి
మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు
శ్రీవారి దర్శనానికి వస్తూ కానరాని లోకాలకు
రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
మృతదేహాలను ఉంచేందుకు ఫ్రీజర్లు లేక అవస్థలు
వారంతా ఒకే గ్రామానికి చెందిన నిరుపేద కూలీలు. ఒకరు కూతురుకు మంచి ఉద్యోగం రావాలని.. మరొకరు చేతికొచ్చిన కొడుకుకి మంచి సంబంధం రావాలని.. ఇలా ఎవరికి వారు వేర్వేరు కోర్కెలు మూటగట్టి ఆ ఏడుకొండల వాడిని వేడుకునేందుకు గ్రామం నుంచి బయలుదేరారు. దారిలో గోవిందనామస్మరణ చేస్తూ భక్తితన్మయత్వంలో మునిగిపోయారు. మరో గంటలో తిరుమల చేరుకోవాల్సిన వారిని విధి వెంటాడింది. లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. మరో ఎనిమిది మందిని క్షతగాత్రులను చేసింది. గాయాలు బాధిస్తున్నా కళ్లెదుటే కన్న బిడ్డలు విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆ తల్లులు దేవుడా..! మాకు దిక్కెవరు నాయనా.. అంటూ గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. గుండెల్ని పిండేసిన ఈ విషాద సంఘటన మంగళవారం చంద్రగిరి సమీపంలో చోటు చేసుకుంది.
తిరుపతి కార్పొరేషన్/ తిరుపతి రూరల్/మంగళం : బెంగళూరుకు చెందిన యళహంక సమీపంలోని దేవనహళ్లి తాలూకా, బిలమానుర హళ్లి గ్రామానికి చెందిన 13 మంది మంగళవారం వేకువ జాము 1.30 గంటలకు టెంపో ట్రావెలర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. దారిమధ్యలో గోవిందనామస్మరణ లు చేసుకుంటూ వస్తున్న వారిపై విధి పగబట్టింది. ఉద యం 6 గంటల ప్రాంతంలో చంద్రగిరి సమీపం రాయలవారి కోట వద్ద ట్రావెలర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న గౌరమ్మ (15), రమ్య (30), పార్వతి(35), సుజాత (35), సురేష్ (30), కిరణ్(డ్రైవర్)(28) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ కునుకుపాటు
టెంపో ట్రావెలర్ వాహన డ్రైవర్ కిరణ్ నిద్రలేమితో బాధపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలమనేరుకు సమీపంలోనే ఓ వాహనాన్ని ఢీ కొట్టబోయాడు. నిద్రవస్తోందని.. టీ తాగితే నిద్రమత్తు వదులుతుందని చెప్పడంతో అందరూ పలమనేరు సమీపంలోని ఓ షాపు వద్ద ఆగి టీ తాగారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చంద్రగిరి సమీపంలోకి రాగానే టెంపో డ్రైవర్ మరోసారి కనుకుపాటుకు గురయ్యాడు. అంతే..! జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి కోళ్లమేతతో వస్తున్న లారీని ఢీకొటింది. టెంపో లో నిద్ర మత్తులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గర్భశోకం..
దైవ దర్శనానికి కన్నబిడ్డలతో వచ్చిన ఇద్దరు తల్లులకు గర్భశోకమే మిగిలింది. డిగ్రీ పూర్తి చేసుకున్న కూతురు గౌరమ్మకు మంచి ఉద్యోగం రావాలని, పెళ్లి సంబంధం కుదరాలని శ్రీవారిని మొక్కుకునేందుకు కన్నబిడ్డతో కలి సి నాగమ్మ బయలు దేరింది.అలాగే తన కొడుక్కి మంచి పెళ్లి సంబంధం రావాలని మరో తల్లి మాలమ్మ బిడ్డతో పాటు (టెంపో డ్రైవర్ కిరణ్) అదే వాహనంలో బయలు దేరింది. ఆ తల్లుల మొర ఏడుకొండల వాడిచెంత వినిపించకముందే మృత్యువు బిడ్డలను బలితీసుకుంది. ఆ తల్లులకు తీరని కడుపు శోకాన్ని మిగిల్చింది. నిర్జీవంగా రోడ్డుపై పడి ఉన్న బిడ్డల్ని తడువుతూ ఆ తల్లులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు
ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న మాలమ్మ, పూజప్ప, ఇతని భార్య శోభ, మధు, కె.మునెమ్మ, నాగమ్మ, బి.మునెమ్మతో పాటు లారీ డ్రైవర్ రామకృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌కు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పెదవులు చీలిపోగా, పళ్లు రాలిపోయాయి. 108 సిబ్బంది అన్నపూర్ణ, వేణుగోపాల్, అరుణ్‌కుమార్ సకాలంలో స్పందించి క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీఎస్‌ఆర్‌ఎంవో చంద్రయ్య, సీఏఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరుగురి మృతదేహాలను భద్రపరిచేందుకు కోల్ట్ స్టోరేజ్ సమస్య ఏర్పడింది. ఇది వరకు కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న ఫ్రీజర్లు పనిచేయక పోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ
అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రగిరి నుంచి పనపాకం వరకు ఉన్న జాతీయ ర హదారిని క్షణ్ణంగా పరిశీలించారు. సహాయకచర్యల్లో పాలుపంచుకున్నారు.
మృతదేహాలను చూసి సొమ్మసిల్లిన ఎస్పీ గన్‌మన్
అర్బన్ ఎస్పీ సంఘటనా స్థలానికి మంగళవారం తెల్లవారుజామున చేరుకున్నారు. మృతదే హాలను పరిశీలిస్తున్న సమయంలో ఎస్పీ గన్‌మెన్ పార్థసారథి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన ఎస్పీ, పోలీసు లు గన్‌మన్‌ను 108లో తిరుపతి రుయాకు తరలించారు.
మృత దేహాలకు పూర్తయిన పోస్టుమార్టమ్
చంద్రగిరి వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురి మృతదేహాలకు మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తిచేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృత దేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు లేకపోవడంతో వాటిని మార్చురీలోనే ఆరుబయట పెట్టారు. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అందించారు.
అతివేగమే ప్రమాదానికి కారణం : ఆర్టీవో
రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆర్టీవో వివేకానంద రెడ్డి పరామర్శించారు. సీఏఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కయ్యల చంద్రయ్య, సీఏఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరిలతో వైద్యసేవలపై ఆరాతీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటనలో టెంపో డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణం అన్నారు. ఇకపై ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వాహనాల వేగాన్ని నియంత్రించేలా స్పీడ్‌గన్ పరికరంతో నిఘా ఉంచుతామన్నారు. ఆర్టీవో పాటు ఎంవీఐలు నాగరాజు నాయక్, సురేష్ నాయుడు ఉన్నారు.