సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఈ వర్షాకాలంలో కురిసిన వర్షాలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో 1,989.76 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. ఇందులో రాష్ట్రీయ రహదారులు 1,712.16 కిలోమీటర్లుకాగా జాతీయ రహదారులు 277.60 కిలోమీటర్లు. గ్రామీణ ప్రాంతంలో 904.865 కిలోమీటర్ల రోడ్లున్నాయి. వర్షాల కారణంగా 471.30 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బ తినగా చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డా యి. వీటికి తాత్కాలిక మరమ్మతులకు రూ.7.95 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ. 99.02 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. అయితే సర్కారు ఇప్పటివరకు పైసా కూడా మంజూరు చేయలేదు. దీంతో సాధారణ నిధులు వెచ్చించి మరమ్మతులు చేయాలని అధికారయంత్రాంగం యత్నిస్తోంది.
రోడ్ల పరిస్థితి ఇలా
జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్లు 471.30 కిలోమీటర్ల వరకు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో నిజామాబాద్ డివిజన్‌లో 227.33 కిలోమీటర్లు, బోధన్ డివిజన్‌లో 243.97 కిలోమీటర్ల రోడ్లున్నాయి. వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు సంభవించి 20 మందికిపైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్-వర్ని రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ మార్గంలోని గుంతలతో గాంధీనగర్, కొత్తపేట, మోస్రా, గోవూరు, చందూరు, శ్రీనగర్, వర్ని ప్రాంతాలలో పలు ప్రమాదాలు జరిగాయి. బాన్సువాడ నియోజకవర్గ ప రిధిలోని బాన్సువాడ -బిచ్కుంద, బాన్సువాడ -కామారెడ్డి, బాన్సువాడ -బీర్కూరు, బీర్కూరు -కోటగిరి మార్గాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి నియోజక వర్గంలోని ఎన్‌హెచ్-44 రహదారి నుంచి పెద్దమల్లారెడ్డి వరకు, దోమకొండ నుంచి తుజాలాపూర్ వరకు, తూంపల్లి ఎక్స్‌రోడ్డు నుంచి మాచారెడ్డి ఎక్స్‌రోడ్డు వరకు రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి -మన్నసాగర్, తాడ్వాయి-లింగంపల్లి వయా సదాశివనగర్ రోడ్లు పనికి రాకుండాపోయాయి. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రాలు మినహాయించి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. బోధన్-సాలూరా ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నిజామాబాద్ నగరంలో రోడ్ల అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమై ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి.
మారుమూల ప్రాంతాలలో..
నాందేడ్ -సంగారెడ్డి, నిజాంసాగర్ -పిట్లం, బిచ్కుంద -బాన్సువాడ రహదారుల్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. నిజాంసాగర్, పిట్లం, మద్నూరు, జుక్కల్, బిచ్కుంద మండలాల్లోని చాలా గ్రామాలకు బీటీ రోడ్లు లేవు. ఉన్న రోడ్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినా వీటిని పట్టించుకునేవారు కరువయ్యారు. నిజాంసాగర్- పిట్లం రోడ్డు దుస్థితి చెప్పనలవి కాదు. మండల కేంద్రం నుంచి నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వరకు ఉన్న సుమారు 6 కిలోమీటర్ల రోడ్డుపై పలు ప్రాంతాల్లో 60 కి పైగా గుంతలున్నాయి. రోడ్లు పూర్తిగా చెడిపోవడంతో ప్రమాదాల సంభవిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు సకాలంలో చేరుకోవడం గగనంగా మారింది. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అధ్వానంగా మారిన ఇందూరు రోడ్లు
Published Mon, Oct 7 2013 4:24 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement