Rain session
-
వర్చువల్ పార్లమెంటే మేలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనల నేపథ్యంలో ‘వర్చువల్’విధానం మంచి ప్రత్యామ్నాయమని వారు భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ సమావేశాల నిర్వహణ కష్టతరం అయినందున, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పార్లమెంట్ సమావేశాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే, చర్చల్లో గోప్యత పాటించాల్సిన అవసరం దృష్ట్యా ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల నిబంధనల కమిటీకి పంపాలి’అని వారు అభిప్రాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భౌతిక దూరం పాటిస్తూ లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలను రోజు విడిచి రోజు చేపట్టే అంశం కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చింది. అయితే, లాక్డౌన్ ఆంక్షల కారణంగా తాము రాలేమంటూ కొందరు ఎంపీలు సమాచారం ఇవ్వడం, కరోనా ముప్పు ఇప్పటికిప్పుడు తొలగిపోయే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వర్చువల్ పార్లమెంట్ విధానం మేలనే భావన వ్యక్తమయింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూలై–ఆగస్ట్‌లో జరుగుతాయి. -
పంటలకు ప్రాణం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకూ నీటి కోసం తంటాలు పడిన రైతులు జోరుగా కరుస్తున్న వర్షాలతో సాగుకు ఇబ్బంది లేదని సంబరపడుతున్నారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలు జీవం పోసుకోగా కొత్త పంటలను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ వర్షాలు అన్ని పంటలకూ మేలు చేసేవని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 42.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్‌లో జిల్లా సగటు వర్షపాతం 206.5 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు100.5 మిల్లీమీటర్లు నమోదైంది. పూర్తి స్థాయిలో పంటలు సాగు కావాలంటే మరికొంత వర్షం పడాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఖరీఫ్ పంటలకు జీవం ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు ప్రస్తుత వర్షాలు జీవం పోశాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో మిరప, పత్తి పైర్లు సాగు చేశారు. ప్రస్తుతం పొగాకును రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. రెండు నెలల క్రితం వర్షాలు లేకపోవడంతో పాటు కరెంట్ కోతలు తోడవడంతో రైతులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రబీ సీజన్లో వరిని రైతులు అధికంగా సాగు చేయనున్నారు. సాగర్ ఆయకట్టుతో పాటు, గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ఆధారపడి రబీ వరిని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరినార్లు పోసి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పొలాలు దమ్ము చేసుకునేందుకు వీలుగా మారవడంతో దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కళకళలాడుతుండటంతో ఈ ఏడాదికి నీటి కష్టాలు తీరినట్లేనని భావిస్తున్నారు. శనగ పంటను కూడా సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అయితే గతేడాది పండించిన శనగలే కొనేవారు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జామాయిల్ విస్తృతంగా సాగు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. చెరువుల్లోకి చేరని నీరు రెండు రోజుల నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నా జిల్లాలోని మీడియం, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోకి చుక్కనీరు చేరకపోవడం గమనార్హం. ప్రధానంగా రాళ్లపాడు, మోపాడు, కంభం వంటి మీడియం ఇరిగేషన్ చెరువులతో పాటు వందల సంఖ్యలో మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. వీటి పరిధిలో 5 లక్షల ఎకరాల్లో వరితో పాటు, వివిధ పంటలను రబీ సీజన్లో సాగు చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఈ చెరువుల్లోకి చుక్కనీరు చేరలేదు. దీంతో ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో నీరు చేరకపోయినా మరో రెండు రోజుల పాటు వర్షాలు పడితే క్రమంగా చెరువుల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అధ్వానంగా మారిన ఇందూరు రోడ్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఈ వర్షాకాలంలో కురిసిన వర్షాలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో 1,989.76 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు ఉన్నాయి. ఇందులో రాష్ట్రీయ రహదారులు 1,712.16 కిలోమీటర్లుకాగా జాతీయ రహదారులు 277.60 కిలోమీటర్లు. గ్రామీణ ప్రాంతంలో 904.865 కిలోమీటర్ల రోడ్లున్నాయి. వర్షాల కారణంగా 471.30 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బ తినగా చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డా యి. వీటికి తాత్కాలిక మరమ్మతులకు రూ.7.95 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ. 99.02 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. అయితే సర్కారు ఇప్పటివరకు పైసా కూడా మంజూరు చేయలేదు. దీంతో సాధారణ నిధులు వెచ్చించి మరమ్మతులు చేయాలని అధికారయంత్రాంగం యత్నిస్తోంది. రోడ్ల పరిస్థితి ఇలా జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లు 471.30 కిలోమీటర్ల వరకు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో నిజామాబాద్ డివిజన్లో 227.33 కిలోమీటర్లు, బోధన్ డివిజన్లో 243.97 కిలోమీటర్ల రోడ్లున్నాయి. వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు సంభవించి 20 మందికిపైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్-వర్ని రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ మార్గంలోని గుంతలతో గాంధీనగర్, కొత్తపేట, మోస్రా, గోవూరు, చందూరు, శ్రీనగర్, వర్ని ప్రాంతాలలో పలు ప్రమాదాలు జరిగాయి. బాన్సువాడ నియోజకవర్గ ప రిధిలోని బాన్సువాడ -బిచ్కుంద, బాన్సువాడ -కామారెడ్డి, బాన్సువాడ -బీర్కూరు, బీర్కూరు -కోటగిరి మార్గాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి నియోజక వర్గంలోని ఎన్‌హెచ్-44 రహదారి నుంచి పెద్దమల్లారెడ్డి వరకు, దోమకొండ నుంచి తుజాలాపూర్ వరకు, తూంపల్లి ఎక్స్‌రోడ్డు నుంచి మాచారెడ్డి ఎక్స్‌రోడ్డు వరకు రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి -మన్నసాగర్, తాడ్వాయి-లింగంపల్లి వయా సదాశివనగర్ రోడ్లు పనికి రాకుండాపోయాయి. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రాలు మినహాయించి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. బోధన్-సాలూరా ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నిజామాబాద్ నగరంలో రోడ్ల అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమై ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. మారుమూల ప్రాంతాలలో.. నాందేడ్ -సంగారెడ్డి, నిజాంసాగర్ -పిట్లం, బిచ్కుంద -బాన్సువాడ రహదారుల్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. నిజాంసాగర్, పిట్లం, మద్నూరు, జుక్కల్, బిచ్కుంద మండలాల్లోని చాలా గ్రామాలకు బీటీ రోడ్లు లేవు. ఉన్న రోడ్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినా వీటిని పట్టించుకునేవారు కరువయ్యారు. నిజాంసాగర్- పిట్లం రోడ్డు దుస్థితి చెప్పనలవి కాదు. మండల కేంద్రం నుంచి నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వరకు ఉన్న సుమారు 6 కిలోమీటర్ల రోడ్డుపై పలు ప్రాంతాల్లో 60 కి పైగా గుంతలున్నాయి. రోడ్లు పూర్తిగా చెడిపోవడంతో ప్రమాదాల సంభవిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు సకాలంలో చేరుకోవడం గగనంగా మారింది. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
వరద నీటి వృథాకు ‘చెక్’
తాండూరు, న్యూస్‌లైన్: వర్షాకాలంలో కాగ్నా నది నుంచి వృథాగా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతున్న నీటికి అడ్డుకట్టే వేసే ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది. వృథాగా పోతున్న వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చి పంటలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు తాండూరు కాగ్నా నదిలో చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఈ చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.52కోట్ల నిధులను ఇటీవలనే ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతి ప్రక్రియ కూడా పూర్తయ్యింది. చెక్‌డ్యాం నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. పట్టణవాసులకు తాగునీరు అందించే పాతతాండూరులోని పంప్‌హౌస్‌కు సుమారు 200-300 మీటర్ల దూరంలో కాగ్నా నది వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని సంకల్పించారు. ప్రతిపాదిత స్థలంలో 35 మిలియన్ క్యూబిక్ ఫీట్ల (ఎంసీఎఫ్‌టీ) నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెక్‌డ్యాం నిర్మించేందుకు ఇరిగేషన్ అధికారులు డిజైన్ సిద్ధం చేశారు. చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే కాగ్నా నది పరీవాహక ప్రాంతంలోని సుమారు 900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అలాగే తాండూరు పట్టణవాసులతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని 30 గ్రామాల ప్రజలకు తాగునీరు సరఫరా చేయవచ్చంటున్నారు. వరద నివారణ కట్టల నిర్మాణానికీ సంకల్పం కాగ్నా నదిలో చెక్‌డ్యాంతో పాటు వరద జలా లు నదికి రెండు వైపులా వెళ్లకుండా పాత తాం డూరు, యాలాల మండలం అగ్గనూర్ ప్రాం తాల్లో రెండు వరద నివారణ కట్టలు నిర్మిం చేందుకు ఇరిగేషన్ అధికారులు సంకల్పించా రు. వీటి నిర్మాణానికి అవసరమైన 9 ఎకరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు ప్రాంతాల్లో భూముల ధరలపై స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆరా తీశారు. పాతతాండూరులో ఎకరం రూ.లక్ష, అగ్గనూర్‌లో ఎకరం రూ.1.50లక్షల ధర పలుకుతున్నట్టు ఇరిగేషన్ అధికారుల దృష్టికి వచ్చింది. రెండు నెలల్లో పనులప్రారంభం: డీఈ చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించిన అంచనా ప్రతిపాదనలను చిన్ననీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు పంపించినట్లు, ప్రస్తుతం టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతోందని తాండూరు ఇరిగేషన్ డీఈ నర్సింహ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. టెండర్లు ఖరారు కాగానే వచ్చే జనవరి మాసం నాటికి పనులు ప్రారంభమవుతాయని వివరించారు. -
భారీ వర్షం.. అపార నష్టం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలతో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. వర్షాకాలం ప్రారంభమయ్యాక ఇంతటి భారీవర్షం ఇప్పటివరకు కురవలేదని రైతులు తెలి పారు. వరి సాగుచేసిన చేలల్లో వర్షం కారణంగా ఇసుకమేటలు వేశాయి. పెసర, మినుము, కంది, పత్తి చేలల్లో వరదనీటి కారణంగా మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. వందల ఎకరాల్లో నీరు నిలిచింది. వెంకటాపూర్ గ్రామ శివారులో 70 ఎకరాల్లో వరిచేలల్లో ఇసుకమేటలు వేసినట్లు రైతులు తెలిపారు. కాంజీపూర్ శివారులో 20 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగాయి. అంత్వార్, పైడిపల్లి, రుద్రార్, సత్తెగామ, అనంతసాగర్, హంగిర్గా(కె), అబ్బెంద, నిజాంపేట్ తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో నష్టం సంభవించింది. మండలంలో సుమారు 50 వరకు నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మండలం మొత్తంలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. నారాయణఖేడ్ రూరల్: మండలంలోని గ్రామాల్లో కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, కుంటలు, చెరువుల ఆయకట్టులో ఉన్న పంటలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. చాప్టా(కె), హంగిర్గ(బి), వెంకటాపూర్, పంచగామ, జగన్నాథ్‌పూర్, జుజాల్పూర్, పిప్రి గ్రామాల్లోని చెరకు, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలు నీటిలో మునిగాయి. వెంకటాపూర్ శివారులో పోచమ్మ, సుశీల, వినయ్‌లకు చెందిన 12 ఎకరాల చెరకుతోట నేలమట్టమైంది. మామిడి తోట, కాకర, వంకాయ, తదితర కూరగాయల తోటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 3 లక్షల వరకు నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. పిప్రిలో ప్రశాంత్‌కు చెందిన చెరకు తోట, వరి, పత్తి పంటలు వర్షానికి కొట్టుకుపోయాయి. పిప్రిలో 100 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. -
విషాదం నింపిన వర్షాకాలం
ముంబై: ఈసారి వర్షాకాలం రాష్ట్రవాసులకు విషాద జ్ఞాపకాలు మిగిల్చిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. వరుణుడు స్వైర విహారం చేయడంతో 324 మంది చనిపోయారని తెలిపారు. తూర్పు విదర్భ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. భారీ వర్షాలు, వరదలు, పిడుగులు తదితరుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 324 మంది చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. నాగపూర్, అమరావతి డివిజన్లలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందన్నారు. ‘రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల 5,334 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మరో 72,718 మంది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయ’ని ఆయన తెలిపారు. 196 మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఒక్కొక్క కుటుంబానికి రూ. 2,50,000 చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించామని తెలిపారు. అలాగే ధ్వంసమైన 4,336 ఇళ్లకు కూడా నష్ట పరిహారాన్ని అందించామని ఆయన వివరించారు. అలాగే 1,852 పశువులుకూడా మృతిచెందాయని అన్నారు. పశువులు కోల్పోయిన రైతులకు రూ.5,000 నుంచి 25,000 మధ్య నష్టపరిహారాన్ని చెల్లించామని చెప్పారు. ఇప్పటివరకు 699 మంది పశువుల యజమానులకు సహాయం అందిందన్నారు. వర్షాల ధాటికి 753 హెక్టార్లలో వేసిన పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయని ఆయన తెలిపారు. సాగు చేస్తున్న 3,91,069 హెక్టార్లలో కనీసం 50 శాతానికి పైగా పంటలకు నష్టం కలిగిందన్నారు. కొంకణ్. పుణే, నాసిక్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికీ సర్వే చేస్తున్నామని, పూర్తి గణాంకాల అందాక రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.25,000. కొండచరియలు విరిగిపడితే రూ.20,000 నష్టపరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ రాష్ర్ట సర్కార్ అదుకుంటుందని అన్నారు. ఏ రైతుకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.