
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనల నేపథ్యంలో ‘వర్చువల్’విధానం మంచి ప్రత్యామ్నాయమని వారు భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ సమావేశాల నిర్వహణ కష్టతరం అయినందున, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పార్లమెంట్ సమావేశాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది.
అయితే, చర్చల్లో గోప్యత పాటించాల్సిన అవసరం దృష్ట్యా ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల నిబంధనల కమిటీకి పంపాలి’అని వారు అభిప్రాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భౌతిక దూరం పాటిస్తూ లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలను రోజు విడిచి రోజు చేపట్టే అంశం కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చింది. అయితే, లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా తాము రాలేమంటూ కొందరు ఎంపీలు సమాచారం ఇవ్వడం, కరోనా ముప్పు ఇప్పటికిప్పుడు తొలగిపోయే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వర్చువల్ పార్లమెంట్ విధానం మేలనే భావన వ్యక్తమయింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూలై–ఆగస్ట్‌లో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment