వరద నీటి వృథాకు ‘చెక్’ | CAG River Flood Control measures in Thanduru | Sakshi
Sakshi News home page

వరద నీటి వృథాకు ‘చెక్’

Published Sat, Oct 5 2013 1:45 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

CAG River Flood Control measures in Thanduru

తాండూరు, న్యూస్‌లైన్: వర్షాకాలంలో కాగ్నా నది నుంచి వృథాగా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతున్న నీటికి అడ్డుకట్టే వేసే ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది. వృథాగా పోతున్న వరద నీటిని వినియోగంలోకి తీసుకొచ్చి పంటలకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు తాండూరు కాగ్నా నదిలో చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఈ చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.8.52కోట్ల నిధులను ఇటీవలనే ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతి ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
 
 చెక్‌డ్యాం నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. పట్టణవాసులకు తాగునీరు అందించే పాతతాండూరులోని పంప్‌హౌస్‌కు సుమారు 200-300 మీటర్ల దూరంలో కాగ్నా నది వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని సంకల్పించారు. ప్రతిపాదిత స్థలంలో 35 మిలియన్ క్యూబిక్ ఫీట్ల (ఎంసీఎఫ్‌టీ) నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెక్‌డ్యాం నిర్మించేందుకు ఇరిగేషన్ అధికారులు డిజైన్ సిద్ధం చేశారు. చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే కాగ్నా నది పరీవాహక ప్రాంతంలోని సుమారు 900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అలాగే తాండూరు పట్టణవాసులతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని 30 గ్రామాల ప్రజలకు తాగునీరు సరఫరా చేయవచ్చంటున్నారు.
 
 వరద నివారణ కట్టల నిర్మాణానికీ సంకల్పం
 కాగ్నా నదిలో చెక్‌డ్యాంతో పాటు వరద జలా లు నదికి రెండు వైపులా వెళ్లకుండా పాత తాం డూరు, యాలాల మండలం అగ్గనూర్ ప్రాం తాల్లో రెండు వరద నివారణ కట్టలు నిర్మిం చేందుకు ఇరిగేషన్ అధికారులు సంకల్పించా రు. వీటి నిర్మాణానికి అవసరమైన 9 ఎకరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు ప్రాంతాల్లో భూముల ధరలపై స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆరా తీశారు. పాతతాండూరులో ఎకరం రూ.లక్ష, అగ్గనూర్‌లో ఎకరం రూ.1.50లక్షల ధర పలుకుతున్నట్టు ఇరిగేషన్ అధికారుల దృష్టికి వచ్చింది.
 
 రెండు నెలల్లో పనులప్రారంభం: డీఈ
 చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధించిన అంచనా ప్రతిపాదనలను చిన్ననీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు పంపించినట్లు, ప్రస్తుతం టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతోందని తాండూరు ఇరిగేషన్ డీఈ నర్సింహ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. టెండర్లు ఖరారు కాగానే వచ్చే జనవరి మాసం నాటికి పనులు ప్రారంభమవుతాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement