నారాయణఖేడ్, న్యూస్‌లైన్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలతో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. వర్షాకాలం ప్రారంభమయ్యాక ఇంతటి భారీవర్షం ఇప్పటివరకు కురవలేదని రైతులు తెలి పారు. వరి సాగుచేసిన చేలల్లో వర్షం కారణంగా ఇసుకమేటలు వేశాయి. పెసర, మినుము, కంది, పత్తి చేలల్లో వరదనీటి కారణంగా మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. వందల ఎకరాల్లో నీరు నిలిచింది. వెంకటాపూర్ గ్రామ శివారులో 70 ఎకరాల్లో వరిచేలల్లో ఇసుకమేటలు వేసినట్లు రైతులు తెలిపారు. కాంజీపూర్ శివారులో 20 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగాయి. అంత్వార్, పైడిపల్లి, రుద్రార్, సత్తెగామ, అనంతసాగర్, హంగిర్గా(కె), అబ్బెంద, నిజాంపేట్ తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో నష్టం సంభవించింది. మండలంలో సుమారు 50 వరకు నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మండలం మొత్తంలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
నారాయణఖేడ్ రూరల్: మండలంలోని గ్రామాల్లో కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, కుంటలు, చెరువుల ఆయకట్టులో ఉన్న పంటలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. చాప్టా(కె), హంగిర్గ(బి), వెంకటాపూర్, పంచగామ, జగన్నాథ్‌పూర్, జుజాల్‌పూర్, పిప్రి గ్రామాల్లోని చెరకు, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలు నీటిలో మునిగాయి. వెంకటాపూర్ శివారులో పోచమ్మ, సుశీల, వినయ్‌లకు చెందిన 12 ఎకరాల చెరకుతోట నేలమట్టమైంది. మామిడి తోట, కాకర, వంకాయ, తదితర కూరగాయల తోటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 3 లక్షల వరకు నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. పిప్రిలో ప్రశాంత్‌కు చెందిన చెరకు తోట, వరి, పత్తి పంటలు వర్షానికి కొట్టుకుపోయాయి. పిప్రిలో 100 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
భారీ వర్షం.. అపార నష్టం
Published Wed, Aug 14 2013 3:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement