narayan khed
-
బంగారు తెలంగాణ చేసుకున్నం.. ఇక బంగారు భారతం చేద్దాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకున్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘మనం అమెరికాకు వెళ్లడం కాదు, ఇతర దేశాల ప్రజలే మన దేశం వీసాలు తీసుకొని వచ్చే గొప్ప సంపద, వనరులు, యువశక్తి మనకున్నాయి. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర షోషించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా. నేను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నా.. పోదా మా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ఢిల్లీ వరకు కొట్లాడుదామా..? దేశాన్ని బాగు చేసుకుందామా..?’అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నిం చారు. దీంతో ‘కొట్లాడదాం..కొట్లాడదాం’అంటూ సభికులు ప్రతిస్పందించారు. ‘ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.. మతం పేరు తో ఘర్షణలు పడితే పెట్టుబడులు రావు. దీనిపై గ్రామాల్లో చర్చించాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలి..’అని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ‘తెలంగాణలో రైతులు చనిపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎలాంటి లంచం ఇవ్వకుండానే రైతులకు రైతుబంధు అందుతోంది. ఠంచనుగా వారి ఖాతాల్లో పడుతోంది. రూ.రెండు వేలు పింఛన్లు ఇవ్వడంతో తెలంగాణాలోని వృద్ధులకు గౌరవం పెరిగింది. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యకు రూ.20 లక్షలు స్కాలర్షిప్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమతో 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జహీరాబాద్ నిమ్జ్‌లో ఉద్యోగాలు రానున్నాయి..’అని కేసీఆర్ తెలిపారు. మన పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల ఒత్తిడి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మెచ్చుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఈ పథకాలను తమకు కూడా అమలు చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఠాక్రే తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు చీకట్లో ఉంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. రెండోసారి ప్రజలు దీవించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి (నారాయణఖేడ్), చంటి క్రాంతికిరణ్ (అందోల్), మాణిక్‌రావు (జహీరాబాద్), మదన్‌రెడ్డి (నర్సాపూర్), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు) తదితరులు పాల్గొన్నారు. చిమ్నీబాయి అనే ఓ గిరిజన మహిళను సీఎం కేసీఆర్ వేదికపైకి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. చిమ్నీబాయిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండా. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా తాను ఆ తండాకు వెళ్లిన సందర్భంలో.. గ్రామంలోని సమస్యలను ఆమె వివరించిన విషయాన్ని మంత్రి హరీశ్ తన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి తాగునీరు వస్తోందని, రోడ్డు సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో చిమ్నీబాయిని వేదికపైకి ఆహ్వానించిన కేసీఆర్, ఆ గ్రామం బాగోగులపై కాసేపు ముచ్చటించారు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ... ముగ్గురి మృతి
కల్హేర్ (నారాయణఖేడ్): ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్(బి) వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాసాన్‌పల్లి బుగ్యా నాయక్ తండాకు చెందిన కేతవత్ సంగ్యనాయక్ (50), అతని భార్య సంతెలిబాయి (45), కుమారుడు అనిల్ (15) బాచేపల్లి నుంచి బైక్‌పై వస్తున్నారు. సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై ఖానాపూర్ (బి) వద్ద వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న హైదరాబాద్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్ నడుపుతున్న సంగ్యనాయక్, అతని కొడుకు అనిల్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయలైన సంతెలిబాయిని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
దేవుని భక్తి.. 'క్షుద్ర శక్తుల' శాసనం..!
తెర వెనుక: పొట్ట చేత పట్టుకొని వలస పోయిన కూలీలు ఇంకా గూటికి చేరలేదు.. మరో వైపు పక్కరాష్ట్రంలో పండరీ దేవుని జాతరంటూ భక్త జనం వరుస కట్టారు... ఇంకోవైపు ‘క్షుద్ర శక్తుల’భయం చూపి నిరక్షరాస్య ఓటరును ఇంట్లోనే బంధించే ప్రయత్నమేదో జరుగుతోంది. ఓట్ల పండగ రానే వచ్చింది, కానీ ఎన్నో అడ్డంకులు. ప్రతిదీ సగటు ఓటరును ఓటుకు దూరం చేసేదే. ఇన్ని ఒడిదుడుకుల నడుమ నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ శాతం భారీగా తగ్గే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి పోలింగ్ స్లిప్పులు తీసుకున్న వారిలో కూడా దాదాపు 20 నుంచి 25 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. నియోజకవర్గం నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు పండరీపురం విఠలేశ్వర స్వామి జాతరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ మాసం ఏకాదశి (ఈనెల 3న) రోజున మొదలైన పండరీ భక్తుల ప్రయాణం, త్రయోదశి (ఈ నెల 6న) వరకు కొనసాగింది. ప్రతి పల్లెనుంచి పదుల సంఖ్యలో భక్తులు పండరి వెళ్లారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పండరీ దేవుని ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్లంతా పోలింగ్‌కు దూరం అయినట్టే. ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నిరక్షరాస్యత ఓటర్లు క్షుద్ర శక్తుల భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా కల్హేర్, కంగ్టి, మనూరు ప్రాంతంలో ఈ ‘శక్తుల’ప్రభావం తీవ్రంగా ఉంది. సగటు ఓటరును ఇంట్లోనే బంధీగా చేయడానికి ఓ వర్గం పని గట్టుకొని క్షుద్ర విద్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు జనం హడలిపోతున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రించిన ఆవాలు చల్లితే మరికొన్ని గ్రామాల్లో ఎన్నికల కేంద్రం తలుపుల వద్ద పసుపు కుంకుమ పెట్టి వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భయం.. భయం.. మంత్రగాళ్లు మనుసులో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలని శాసిస్తాడో... అదే పార్టీకి గుర్తుకు ఓటు వేయాలని, లేదంటే క్షుద్ర శక్తులు బలి తీసుకుంటాయని ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. కల్హెర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో ని ప్రజలను ‘సాక్షి’ ప్రతినిధి పలకరించినప్పుడు జనం క్షుద్ర శక్తుల పట్ల తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేశారు. ఓ పేరు మోసిన మంత్రగానితో ఆవాలు మంత్రించి, క్షుద్ర శక్తులను పోలింగ్ తలుపుల వద్ద కాపలా పెట్టారని జనం చెప్తున్నారు. ఓ పార్టీకి ఓటు వేయాలని మంత్రగాడు శాసించాడో జనం చెప్తున్నారు కానీ.. మీకు ఏ వ్యక్తి చెప్పాడని అడిగితే మాత్రం బదులు రావడం లేదు. ఎవరో చెప్పుకొంటుంటే విన్నామని మాత్రమే అంటున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇలా వ్యాపిస్తోంది. ఈ భయంతో ఓటర్లు ఓటు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే ఉండిపోవాలనే యోచనలో చాలామంది ఉన్నారు. -
ఖేడ్.. ష్..!
♦ ముగిసిన ప్రచారం నేతల తిరుగుపయనం ♦ పోలింగ్‌కు సర్వంసిద్ధం162 గ్రామాల్లో 286 కేంద్రాలు ♦ 119 సమస్యాత్మక కేంద్రాలు భారీ బందోబస్తు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మరోవైపు పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రచారం కోసం వచ్చిన వివిధ పార్టీల నాయకులు నియోజకవర్గాన్ని వదిలివెళ్లిపోయారు. టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై నడిపిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాయంత్రం నాలుగు గంటలకే పటాన్‌చెరుకు వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు దామోదర రాజనర్సింహతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిననేతలు కూడా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు నియోజకవర్గాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. నియోజకవర్గంలోని 162 రెవెన్యూ గ్రామాల్లో 1.89 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ల కోసం 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 1,174 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. నియోజకవర్గాన్ని 33 సెక్టార్లుగా విభజన చేసి ప్రతి సెక్టార్‌కు ఒక రూట్ అధికారి, ఒక సెక్టార్ అధికారికి, మోడల్ కోడ్‌ఆఫ్ కండక్ట్ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించారు. సెల్ ఫోన్సిగ్నిల్స్ అందిన 282 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కోసం 300మంది విద్యార్థులను సిద్ధం చేశారు. 125 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని వీడియో తీస్తామని ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 286 పోలింగ్ కేంద్రాలకు 286 ఈవీఎంలను సిద్ధం చేశారు. ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి మరో 100 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రస్తుతానికి నారాయణఖేడ్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులకు అప్పగిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ముగ్గురు సిబ్బందిని నియమిస్తున్నారు. ఈవీఎంల సాంకేతిక సమస్య తక్షణ నివారణకు ఐదుగురు ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు.. 20 మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నియోజకవర్గంలో 20 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నారు. ఓటువేసేందుకు వెళ్ళిన ప్రతి ఓటరుకు గులాబిపువ్వు ఇచ్చి అధికారులు స్వాగతం పలుకుతారు. షెల్టర్‌తోపాటు, తాగేందుకు మంచినీళ్లు, మజ్జిగ అందుబాటులో ఉంచుతున్నారు. 95 శాతం పోలింగ్ నమోదైన పంచాయతీకి రూ.2లక్షల నజరానా ఇవ్వనున్నట్లు రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా నియోజకవర్గంలో 54 అత్యంత సమస్యాత్మక, మరో 65 సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. అతి సమస్యా త్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలు, సివిల్, సాయుధ పోలీసులను నియమిస్తున్నారు. మొబైల్ పోలింగ్ బలగాలు ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తుంటాయి. ఇప్పటివరకు 1398 మందిని బైండోవర్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు వారు ఆర్ఓకే సమాధానం ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. -
'కథలు కాదు.. మీకు బుల్లెట్‌లాంటి మంత్రి ఉండు'
నారాయణ ఖేడ్: దేశంలో ఎక్కడా లేని వృద్ధులకు వెయ్యి రూపాయల ఫించన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.1500 ఇస్తున్నామని గుర్తు చేశారు. నెలకు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని, ఆటోవాలాలకు ట్యాక్స్‌లు లేకుండా చేశామని గుర్తు చేశారు. నారాయణ ఖేడ్ లో ఉప ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఇక్కడికి వచ్చిన కేసీఆర్ మాట్లాడారు. డ్రైవర్లకు బీమా ఇస్తున్నామని, నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్లులు తగ్గిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడా లేని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. 'హాస్టల్ లో చదువుకునే పిల్లలకు సన్న బియం పెడుతున్నారు. కథలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు. విద్యాధికులు, ఉద్యోగులు, మేధావులు ఆలోచించాలి. నారాయణ ఖేడ్ లో స్వాతంత్ర్యంలేదు. గుండాగిరి దాదాగిరి, డబ్బులివ్వడం, తాగుడు పోయడం, ఒట్లు వేయించడం అంతా పాత చింతకాయ పచ్చడే. బుల్లెట్ లాగా దూసుకెళ్లే మంత్రి (హరీష్ రావు) మీ మధ్య ఉన్నారు. హరీష్ రావు మిమ్మల్ని భూపాల్ రెడ్డిని గెలిపించాలని అడుగుతున్నాడు. నారాయణ్ ఖేడ్ ను సిద్ధిపేటలాగా మారుస్తా అంటున్నాడు. మీరు అలాగే చేసి భూపాల్ రెడ్డికి ఓటేస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మీ కాళ్లు కడుగుత' అని కేసీఆర్ ఆన్నారు. నారాయణ ఖేడ్ చరిత్రలో ఇంత పెద్ద సభ జరగలేదని, గతంలో రెండు సార్లు ఇక్కడి వచ్చానని కేసీఆర్ అన్నారు. 'నారాయణ ఖేడ్ లో ఇన్ని రోజులు మార్కెట్ కమిటీ ఉండదా, మార్కెట్ యార్డ్ ఉండదా, హాస్పత్రులు ఉండవా, ఇంత దారుణంగా ఉంటుందా, ఇంకా దారిద్ర్యం కావాల్నా.. కాంగ్రెస్, టీడీపీ పాలన పాత చింతకాయ పచ్చడేగా. కాంగ్రెస్, టీడీపీ ఏం చేసిర్రో మీకు తెలియనిది కాదు. తెలివిగా ఓటెయ్యాలంటే భూపాల్ రెడ్డిని గెలిపించాలి. నారాయణ ఖేడ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. రెండు రోజులపాటు నేనే స్వయంగా తిరిగి అన్ని అభివృద్ధి పనులు చేస్తా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
నగరంలో చెల్లని రూపాయి ఖేడ్‌లో చెల్లుతుందా? మంత్రి హరీశ్‌రావు
నారాయణఖేడ్: హైదరాబాద్‌లో చెల్లని రూపాయి.. నారాయణఖేడ్‌లో మాత్రం చెల్లుతుందా? అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఖేడ్‌లో శనివారం వికలాంగులు, గిరిజనులు, యువజన సంఘాల సభ్యులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఇచ్చిన తీర్పుతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఈ రెండు పార్టీలు చిత్తు చిత్తుగా అయ్యాయన్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు వరంగల్, గ్రేటర్ ఎన్నికల్లో దెబ్బకొట్టారని, రేపు నారాయణఖేడ్‌లోనూ దెబ్బమీద దెబ్బకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని తమకు వద్దని ప్రజలు కరివేపాకు మాదిరిగా తీసిపారేశారన్నారు. ఖేడ్‌లో మాత్రం కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. వరంగల్‌లో చంద్రబాబూ నీ ముఖం బాగా లేదని జనం వెళ్లగొట్టారని, నోరు పెద్దగ చేసి మాట్లాడితే ప్రజలు ఆ చెంపా, ఈ చెంపా వాయించి పంపారని హరీశ్‌రావు అన్నారు. -
నారాయణఖేడ్‌లో చైన్ స్నాచింగ్
గుడికి వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌లో సోమావారం చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబా కాలనీకి చెందిన మహాదేవి(38) ప్రతిరోజు గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో ఈ రోజు గుడికి వెళ్లి వస్తున్న సమయంలో బ్లాక్ పల్సర్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు ల బోదిబోమంటు పోలీసులను ఆశ్రయించింది. -
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
అప్పుల బాధ తట్టుకోలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం నమ్లిమెట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పందికొండ బాగయ్య (60) శనివారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కోసం రూ.2 లక్షలు అప్పు చేసిన బాగయ్య... రెండు ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశాడు. పంట ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారి కానరాక.. మనస్తాపం చెంది బలన్మరణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు..
అడవిపందిని తప్పించబోయిన కారు బోల్తా పడ్డ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటన నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు గ్రామ శివారులో 50వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. నిజాంపేట్ వైపు నుండి నారాయణఖేడ్‌కు వస్తున్న కారు ర్యాలమడుగు గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపైకి అడ్డగం అడవిపందులు వచ్చాయని బాధితులు తెలిపారు. వీటిని తప్పించబోగా అదుపుతప్పి రోడ్డు ప్రక్కన కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి సత్యంసేట్(45), కుమారుడు రోహిత్(13), తల్లి బాలమణి(70)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించి ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. -
తెలంగాణలో దిగ్విజయ్ పర్యటన
వరంగల్, నారాయణ్ ఖేడ్ ఉపెఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారుచేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ లోజరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ఆయన.. సాయంత్రం వరంగల్‌లో జిల్లా నేతలతో భేటీ కానున్నారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం గాంధీ భవన్ లో మెదక్ జిల్లా నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేస్తారు.కాగా..సోమవారం చార్మినార్ వద్ద జరిగే రాజీవ్ సద్భావన రజతోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ ఏడాది రాజీవ్ సద్భావనా అవార్డు గులాంనబీ ఆజాద్ కు ఇవ్వనుట్లు నిర్వాహకులు తెలిపారు. -
భారీ వర్షం.. అపార నష్టం
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలతో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. వర్షాకాలం ప్రారంభమయ్యాక ఇంతటి భారీవర్షం ఇప్పటివరకు కురవలేదని రైతులు తెలి పారు. వరి సాగుచేసిన చేలల్లో వర్షం కారణంగా ఇసుకమేటలు వేశాయి. పెసర, మినుము, కంది, పత్తి చేలల్లో వరదనీటి కారణంగా మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. వందల ఎకరాల్లో నీరు నిలిచింది. వెంకటాపూర్ గ్రామ శివారులో 70 ఎకరాల్లో వరిచేలల్లో ఇసుకమేటలు వేసినట్లు రైతులు తెలిపారు. కాంజీపూర్ శివారులో 20 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగాయి. అంత్వార్, పైడిపల్లి, రుద్రార్, సత్తెగామ, అనంతసాగర్, హంగిర్గా(కె), అబ్బెంద, నిజాంపేట్ తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో నష్టం సంభవించింది. మండలంలో సుమారు 50 వరకు నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మండలం మొత్తంలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. నారాయణఖేడ్ రూరల్: మండలంలోని గ్రామాల్లో కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, కుంటలు, చెరువుల ఆయకట్టులో ఉన్న పంటలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. చాప్టా(కె), హంగిర్గ(బి), వెంకటాపూర్, పంచగామ, జగన్నాథ్‌పూర్, జుజాల్పూర్, పిప్రి గ్రామాల్లోని చెరకు, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి, వరి పంటలు నీటిలో మునిగాయి. వెంకటాపూర్ శివారులో పోచమ్మ, సుశీల, వినయ్‌లకు చెందిన 12 ఎకరాల చెరకుతోట నేలమట్టమైంది. మామిడి తోట, కాకర, వంకాయ, తదితర కూరగాయల తోటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 3 లక్షల వరకు నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. పిప్రిలో ప్రశాంత్‌కు చెందిన చెరకు తోట, వరి, పత్తి పంటలు వర్షానికి కొట్టుకుపోయాయి. పిప్రిలో 100 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.