నగరంలో చెల్లని రూపాయి ఖేడ్లో చెల్లుతుందా? మంత్రి హరీశ్‌రావు
నారాయణఖేడ్: హైదరాబాద్‌లో చెల్లని రూపాయి.. నారాయణఖేడ్‌లో మాత్రం చెల్లుతుందా? అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఖేడ్‌లో శనివారం వికలాంగులు, గిరిజనులు, యువజన సంఘాల సభ్యులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఇచ్చిన తీర్పుతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఈ రెండు పార్టీలు చిత్తు చిత్తుగా అయ్యాయన్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు వరంగల్, గ్రేటర్ ఎన్నికల్లో దెబ్బకొట్టారని, రేపు నారాయణఖేడ్‌లోనూ దెబ్బమీద దెబ్బకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని తమకు వద్దని ప్రజలు కరివేపాకు మాదిరిగా తీసిపారేశారన్నారు. ఖేడ్‌లో మాత్రం కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. వరంగల్‌లో చంద్రబాబూ నీ ముఖం బాగా లేదని జనం వెళ్లగొట్టారని, నోరు పెద్దగ చేసి మాట్లాడితే ప్రజలు ఆ చెంపా, ఈ చెంపా వాయించి పంపారని హరీశ్‌రావు అన్నారు.