ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకూ నీటి కోసం తంటాలు పడిన రైతులు జోరుగా కరుస్తున్న వర్షాలతో సాగుకు ఇబ్బంది లేదని సంబరపడుతున్నారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలు జీవం పోసుకోగా కొత్త పంటలను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ వర్షాలు అన్ని పంటలకూ మేలు చేసేవని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 42.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్లో జిల్లా సగటు వర్షపాతం 206.5 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు100.5 మిల్లీమీటర్లు నమోదైంది. పూర్తి స్థాయిలో పంటలు సాగు కావాలంటే మరికొంత వర్షం పడాల్సి ఉందని అధికారులు అంటున్నారు.
ఖరీఫ్ పంటలకు జీవం
ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు ప్రస్తుత వర్షాలు జీవం పోశాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో మిరప, పత్తి పైర్లు సాగు చేశారు. ప్రస్తుతం పొగాకును రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. రెండు నెలల క్రితం వర్షాలు లేకపోవడంతో పాటు కరెంట్ కోతలు తోడవడంతో రైతులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రబీ సీజన్‌లో వరిని రైతులు అధికంగా సాగు చేయనున్నారు. సాగర్ ఆయకట్టుతో పాటు, గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ఆధారపడి రబీ వరిని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరినార్లు పోసి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పొలాలు దమ్ము చేసుకునేందుకు వీలుగా మారవడంతో దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కళకళలాడుతుండటంతో ఈ ఏడాదికి నీటి కష్టాలు తీరినట్లేనని భావిస్తున్నారు. శనగ పంటను కూడా సాగు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అయితే గతేడాది పండించిన శనగలే కొనేవారు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జామాయిల్ విస్తృతంగా సాగు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం.
చెరువుల్లోకి చేరని నీరు
రెండు రోజుల నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నా జిల్లాలోని మీడియం, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోకి చుక్కనీరు చేరకపోవడం గమనార్హం. ప్రధానంగా రాళ్లపాడు, మోపాడు, కంభం వంటి మీడియం ఇరిగేషన్ చెరువులతో పాటు వందల సంఖ్యలో మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. వీటి పరిధిలో 5 లక్షల ఎకరాల్లో వరితో పాటు, వివిధ పంటలను రబీ సీజన్‌లో సాగు చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఈ చెరువుల్లోకి చుక్కనీరు చేరలేదు. దీంతో ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో నీరు చేరకపోయినా మరో రెండు రోజుల పాటు వర్షాలు పడితే క్రమంగా చెరువుల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పంటలకు ప్రాణం
Published Wed, Oct 23 2013 6:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement