
అధ్వానంగా ఉన్న మునుగాల రోడ్డు, 2012లో ఈరోడ్డుపై నడిచి వెళుతున్న చంద్రబాబు (ఫైల్)
కోడుమూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్రలో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించి నేటికి ఐదేళ్లు పూర్తవుతోంది. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. 2012 అక్టోబరు 2వతేదీన అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి కర్నూలు జిల్లాలోనూ పర్యటించారు. ఆ ఏడాది అక్టోబరు 20న కోడుమూరు నియోజకవర్గంలోని సి.బెళగల్ మండలం కంబదహాల్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సి.బెళగల్ మీదుగా గూడూరు, మునుగాల, మల్లాపురం, కొత్తకోట, సుంకేసుల మీదుగా తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. సి.బెళగల్ చెరువుకు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తానని, గూడూరు బుడగలవాని చెరువును సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుగా నిర్మిస్తానని, గూడూరులో 30పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
మునుగాల, మల్లాపురం, కొత్తకోటకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. పాదయాత్ర సమయంలో చంద్రబాబు ఈ రోడ్డుపై నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. మోకాటిలోతు ఎగుడుదిగుడు గుంతల్లో నడవలేక అవస్థ పడ్డారు. ముఖ్యమంత్రి అయిన నెలరోజుల్లోపే ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలుస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. 10కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే మణిగాంధీ దాదాపు రూ.12కోట్లతో ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారు. అయినప్పటికీ సీఎం పట్టించుకోలేదు. కొత్తకోట గ్రామంలో 10వతరగతి విద్యార్థులు దాదాపు 150మంది చదువుతున్నారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచే 10వతరగతి పరీక్షా పత్రాలను తీసుకుపోయి కొత్తకోటలో నిర్ణీత సమయానికి అందజేయాలంటే సమయం సరిపోవడం లేదని ఏకంగా పరీక్షా కేంద్రాన్నే రద్దు చేశారు. ఇంతటి ఇబ్బందులు ఎదురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment