సాక్షి,సిటీబ్యూరో: :రహదారుల మరమ్మతులు, నిర్వహణపనుల్లో ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై జీహెచ్‌ఎంసీలోని ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పనుల మంజూరు తప్ప,అమలుపై శ్రద్ధ చూపడం లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర రహదారుల్ని ఇంత అధ్వానంగా గతంలో మున్నెన్నడూ చూడలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై నుంచి వరుస వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు కమిషనర్ బదులిచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. జీహెచ్‌ఎంసీలోని వివిధ పనులకు సంబంధించి గురువారం మేయర్ మాజిద్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కమిషనర్ కృష్ణబాబు,ఫ్లోర్‌లీడర్లు, స్టాండింగ్‌కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలువురు సభ్యులు అధికారుల పనితీరుపై పెదవివిరిచారు. ఒక ఫైలు ఈఈ నుంచి ఎస్‌ఈకి వెళ్లేందుకు 25రోజులు పడుతోందని, ఇదేనా పనితీరని ప్రశ్నించారు.
జాప్యానికి కారకులయ్యే ఈఈలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాలకమండలి నిర్ణయాలు, కమిషనర్ ఆదేశాలన్నా ఇంజినీరింగ్ విభాగానికి లెక్కలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పనుల్లో అశ్రద్ధ వహిస్తున్నప్పటికీ గత రెండున్నరేళ్లుగా ఏ ఒక్క ఇంజినీర్‌కు కూడా మెమో, చార్జిమెమోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా, దీర్ఘకాలం మన్నేలా శాశ్వతరోడ్లు వేయాల్సిందిగా కోరారు. ఇంజినీర్లలో క్రమశిక్షణ పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణబాబు హామీఇచ్చారు. డెబ్రిస్ తొలగింపునకు తాత్కాలిక వాహనాలు కాకుండా శాశ్వతచర్యలు తీసుకోవాలని, చెత్త తరలింపు పనులకు అదనపు బిన్లు,మూడుచక్రాల సైకిళ్లు తదితరమైనవి కావాలని కోరగా..తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అడిషనల్ కమిషనర్ వందన్‌కుమార్‌కు సూచించారు.
ఛీ ఛీ ఇలాంటి రోడ్లా..?
Published Fri, Aug 23 2013 5:13 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement