చెదిరిన బతుకులు | Roads, road traffic accidents this year in the form of black eyes | Sakshi
Sakshi News home page

చెదిరిన బతుకులు

Published Sat, Dec 28 2013 3:36 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Roads, road traffic accidents this year in the form of black eyes

నల్లని రహదారులు రోడ్డు ప్రమాదాల రూపంలో ఈ ఏడాది ఎరుపెక్కాయి. వాహనాలు నడపడంలో చేసిన చిన్న, చిన్న నిర్లక్ష్యాలు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఎంతో మంది వికలాంగులు, క్షతగాత్రులుగా మారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.అలక్ష్యంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం రోడ్డు ప్రమాదాలకు దారితీశాయి. అయిదేళ్లుగా మావోయిస్టుల భయం వీడినా... దోపిడీ దొంగల బీభత్సం పెరిగిపోయింది. బాలికలు, మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పగ, ప్రతీకారాలతో హత్యలు చోటు చేసుకున్నాయి. రాజకీయ కక్షలు రగిలాయి.  ఏసీబీ అవినీతి అధికారుల భరతం పట్టింది.
 - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ క్రైం  
 
 జిల్లాలో  ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడులు, కేసులు పెరిగిపోయాయి. 2013లో జిల్లావ్యాప్తంగా 2963 కేసులు నమోదయ్యాయి.  ఈ ఏడాది ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలపై 1550 కేసులు నమోదు కాగా, 783మంది మృత్యువాత పడ్డారు. మరో 361మంది వికలాంగులుగా మారారు. కొత్తకోట మండలం పాలెం వద్ద అక్టోబర్ 30న జరిగిన వోల్వో బస్సు ప్రమాదం రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘటన. 45 మంది సజీవదహనమయ్యారు.
 
 హత్యలు...
 జిల్లాలో హత్యానేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాజకీయ హత్యలు కొన్నయితే, క్షణికావేశంలో , వివాహేతర సంబంధాల వల్ల కొన్ని చోటు చేసుకున్నాయి. రాజకీయ కక్షల నేపథ్యంలో మద్దూర్ మండలం మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మను పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య చేశారు. ధన్వాడ మండలం పెద్దచింతకుంట సర్పంచ్ ఎన్నిక వివాదంలో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సొంత సోదరుడిని కాల్చి చంపారు. ఈ ఏడాది డిసెంబర్ 20 వరకు 159 మంది హత్యకు గురయ్యారు.
 
 మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, వేధింపులకు సంబంధించి ఇప్పటి వరకు 977 కేసులు నమోదయ్యాయి. 40 వరకట్న హత్యలు జరగగా, 70 వరకట్న కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి ఈ ఏడాది  25 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.  2012లో 165 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ వరకే 207 కేసులు నమోదయ్యాయి. అప్పులు, అవమానాలు భరించలేక, పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. పలుచోట్ల బాల్యవివాహాలను, జోగినీగా మార్చే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement