సీపీఎస్ రద్దు కోరుతూ ఐక్యంగా పోరాడుతామని నినదిస్తోన్న ఉద్యోగ సంఘాల నాయకులు
పాడేరు రూరల్: మన్యంలో ఉద్యోగ లోకం గర్జించింది. సీపీఎస్ విధానం రద్దు కోరుతూ ఏజెన్సీ 11 మండలాల ఉద్యోగులు కదం తొక్కారు. ఇందుకు పాడేరు వేదికైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పాడేరులో మన్యం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తలారిసింగ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్, పాతబస్టాండ్ మీదుగా మోదకొండమ్మ ఆలయం వరకూ సాగింది. ఈ సందర్భంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఇంతకు ముందు తలారిసింగ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. మోదకొండమ్మ ఆలయం ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పట్టాన్ మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న లోపభూయిష్టమైన సీపీఎస్ విధానంతో ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగులు సీపీఎస్ పథకం వల్ల రిటైర్‌మెంట్ తర్వాత కనీస పెన్షన్ కోల్పోతున్నారన్నారు.
గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించిన టీడీపీ.. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక మోసగించిందన్నారు. సీపీఎస్ రద్దు కోసం అసెంబ్లీ, పార్లమెంట్‌లలో తీర్మానం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందన్నారు.
తలారిసింగ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు
ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ
రాష్ట్ర కోశాధికారి రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ టీడీపీ తమది సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ సీపీఎస్ ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీ అయిన వారికి జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారని, కానీ తాము 30 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేస్తే మాత్రం పెన్షన్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర కోశాధికారి కోడా సింహాద్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 280 మంది ఉద్యోగులు మరణిస్తే వారికి సీపీఎస్ కారణంగా పెన్షన్ రాలేదన్నారు.
దీంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగిస్తారన్నారు. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుడుముల కాంతారావు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాలు తమ పెన్షన్, పీఎఫ్ నిధులను షేర్‌మార్కెట్‌లో పెడుతున్నాయన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకపోతే పెన్‌డౌన్ చేసి ఆమరణ నిరాహారదీక్షలకైనా సిద్ధమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సతీష్, పీఆర్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోపీనా«థ్, గిరిజన ఉద్యోగుల సంఘం అర్బన్ అధ్యక్షుడు ఓలేసు రామలింగం, పీజీహెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు రీమలి జాన్, ఏపీఎన్‌జీఓ పాడేరు తాలూకా అధ్యక్షుడు బుక్కా చిట్టిబాబు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.గంగన్న పడాల్, ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షుడు కె.శ్యాంసుందర్, ఏపీసీపీఎస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మళ్ళ ఉమ, ఏపీసీపీఎస్ పాడేరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాంబాబు, ఈశ్వర్, కన్వీనర్ తెల్లబాబు, కోశాధికారి వెంకటరమణ, కో కన్వీనర్ పరమేశ్వర్‌తోపాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment