కన్నుపడితే... కన్నమే!
విజయనగరం క్రైం: జిల్లాలో దొంగలు చెలరేగిపోతున్నారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా ప్రజల సొత్తును కాజేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అరగంటలో ఇంటిని గుల్ల చేసేస్తున్నారు. పోలీసులు ఎన్ని గస్తీలు.. బీట్‌లు.. మొబైల్ టీంలను ఏర్పాటు చేసినా వారిని నిలువరించలేకపోతున్నారు. దొంగలు ప్రధానంగా తాళం వేసిన ఇళ్లతోపాటు.. ఒంటరిగా నివాసముంటున్న ఇళ్లను ఎంచుకుని కన్నం వేస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక చోట దొంగతనం జరుగుతోంది. ఇటీవల కాలం లో అవి మరింతగా పెరిగాయి. ఇంటినుంచి బయటకు ఇలా వెళ్లి అలా వచ్చే లోపే చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రజలు బితుబితుకుమంటూ, కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఇంటిని వదిలి బయట ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
ఇతర రాష్ట్రాల ముఠాలు...
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన దొంగలు ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఠాలో మహిళలు కూడా ఉన్నారు. స్థానికంగా ఉండే దొంగలు కూడా ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఇళ్లు, దుకాణాలు ఇలా కన్నుపడినవాటికి కన్నం వేస్తున్నారు.
మహిళలతో రెక్కీ..
ముందుగా ముఠాలో ఉన్న మహిళలు వీధుల్లో వివిధ రకాల వస్తువులను అమ్ముతున్నట్టుగా తిరుగుతూ రెక్కి నిర్వహిస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ముఠాలో మిగతా సభ్యులకు సమాచారం అందిస్తారు. మిగతావారు ఆ ఇళ్లను ఒకటికి రెండుసార్లు గమనించిన తర్వాతే చోరీలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
పోలీసుల ఎత్తులకు దొంగలు పైఎత్తులు..
పోలీసుల ఎత్తులకు దొంగలు పైఎత్తులు వేస్తున్నారు. చోరీ చేసిన తర్వాత సంఘటన స్థలంలో నేరానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. దొంగలు.... నేరం జరిగిన ఆనవాళ్లు లేకుండా చేయడంతో క్లూస్‌టీం, క్రైం పార్టీలకు ఏమి చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. గతంలో చోరీ జరిగితే చాలు దొంగలను పోలీసులు వెనువెంటనే పట్టుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
రికవరీ సగమే...
దొంగలు చోరీచేసిన సొత్తులో రికవరీ కూడా తక్కువగానే జరుగుతోంది. 2010లో రూ.96,94,590 సొత్తు చోరీ జరగగా, పోలీసులు రికవరీ చేసింది రూ 59,04,827 మాత్రమే. 2011లో రూ.1,45,36,863 గాను రికవరీ చేసింది రూ.87,33,303. 2012లో రూ.1.47కోట్లకు గాను 78 శాతం రికవరీ చేశారు. 2013లో రూ.1.48 కోట్ల గాను 69శాతం రికవరీ జరిగింది. 2014 మే నెలాఖరు నాటికి రూ.61లక్షల సొత్తు చోరీకాగా, 32 శాతం రికవరీ చేశారు. రికవరీలో కొంతమంది పోలీసులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు రేగుతున్నాయి.
ఇటీవల జరిగిన చోరీల ఘటనల్లో కొన్ని...
ఈ నెల 12న బొబ్బిలి ఎంఈఓ ప్రసాద్ ఇంట్లో పట్టపగలు దొంగలు పడి 35తులాల బంగారు ఆభరణాలు, రూ.1,75,000 నగదు, 200 తులాల వెండి అపహరించారు
9న నెల్లిమర్ల మండలంలోని కొండగుంపాంలో నాలుగు ఆలయాల్లో విలువైన వస్తువుల చోరీ
6న పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో పి.శ్రీనివాసరావు ఇంట్లో చోరీ. ఆరువేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాల అపహరణ
జామి మండల కేంద్రంలోని నెయ్యిల వీధికి చెందిన రాయవరపు రాంబాబు ఇంట్లో రూ.40 వేల నగదు చోరీ
స్పెషల్ టీంలు, రహస్య గస్తీ ఏర్పాటు
జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక టీంలు, రహస్య గస్తీని ఏర్పాటు చేశాం. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారి కదలికలను గమనించాలని ఆదేశించాం. రాత్రివేళల్లో గస్తీ ముమ్మరం చేశాం. తాళం వేసిన ఇళ్లను గుర్తించి వాటిపై నిఘా ఏర్పాటు చేశాం. పట్టణ, గ్రామ శివారు ప్రాంతాల్లో దొంగతనాల నివారణకు మొబైల్ టీంలను నియమించాం. పోయిన సొత్తును రికవరీకి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. నేర నిరోధక చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
- తఫ్సీర్ ఇక్బాల్, జిల్లా ఎస్పీ