♦ జమ్మలమడుగులో చోరీ
♦ 11 తులాల బంగారం, రూ.15 వేలు దోచుకెళ్లారు
జమ్మలమడుగు : జమ్మలమడుగులో మళ్లీ పట్టపగలే దొంగలు తెగబడ్డారు. స్టేట్‌బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న బి.గురప్ప ఇంటి తాళాలను దొంగలు పగుల గొట్టి 11 తులాల బంగారం, రూ.15 వేల డబ్బులతో పరారయ్యారు. బాధితురాలు గురురాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భర్త బి.గురప్ప లారీకి వెళ్లిపోవడంతో బాధితురాలు ఇంట్లో ఇద్దరు పిల్లలను ఉంచి కూలి పనికి వెళ్లింది. మధ్యాహ్నం పిల్లలు పుస్తకాలు తీసుకోవటానికి బయటికి వస్తూ ఇంటికి తాళం వేశారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దొంగలు తాళం పగుల గొట్టి లోపల ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు క్లూస్ టీంని పిలిపించి పరిశీలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కులాయప్ప కేసు నమోదు చేశారు.
టెక్కాయచేను వీధిలో..
టెక్కాయచేను వీధిలోని ముస్లిం శ్మశాన వాటిక సమీపంలో ఉన్న ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం దొంగలు పడ్డారు. ఇంటికి తాళాలు వేసి ఉండటంతో పగులగొట్టే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న వారు ఎవరు అని కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. ఈ దొంగలే బ్యాంక్ కాలనీలో దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం.
వరుసగా మూడు చోరీలు..
పట్టణంలో వరుసగా దొంగలు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. జూన్ చివరలో రెండు రోజుల వ్యవధిలోనే నాగులకట్ట, పాతబస్టాండ్‌లో దొంగతనాలు జరిగాయి. ఇప్పటికీ ఆ దొంగలను పోలీసులు పట్టుకోలేక పోయారు. ఈ క్రమంలో మరో చోరీ జరగడంతో.. పోలీసులు వాటిని ఛేదించటానికి తల పట్టుకుంటున్నారు.
పట్టపగలు.. ఇంటి తాళం పగలగొట్టి..
Published Mon, Jul 13 2015 2:26 AM | Last Updated on Sun, Sep 2 2018 3:47 PM
Advertisement