► సీఆర్‌డీఏ కార్యాలయాల్లో దళారుల తిష్ట
► రైతుల నుంచి అంగీకార పత్రాలు ఇప్పిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం
► రికార్డుల్లో అవకతవకలు
► సరిచేసేందుకు ధర నిర్ణయించి వసూలు
మంగళగిరి(గుంటూరు) : ఇదే చాన్స్...దోచేయ్ అనే విధంగా రాజధాని భూ సమీకరణ గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దళారులు కార్యాలయాల్లో తిష్టవేసి ఇప్పటికీ భూ అంగీకారపత్రాలు (9.3 ఫారాలు) ఇప్పిస్తున్నారనీ, వారికి అధికారులు సర్వేయర్లు సహకరిస్తూ సంపాదనలో పడ్డారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇవ్వని వారిని సర్వేయర్లు గుర్తించి దళారులకు సమాచారమిస్తున్నారు.
దళారులు సదరు రైతులను భయపెట్టి భూసమీకరణకు ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వివాదాల్లో ఉన్నవి, రికార్డులు సరిగ్గా లేని భూములను దళారులు గుర్తించి మరీ తక్కువ ధరలకు కొనుగోలు చేయించి సర్వేయర్లకు లంచాలు ఇచ్చి అప్పటికప్పుడు అంగీకార పత్రాలు ఇప్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డులు సరిచేయాలంటే అడంగల్, సర్వే ఇలా ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మండలంలోని నిడమర్రు, కురగల్లు, బేతపూడి, నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాలతో పాటు కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న గ్రామాల రైతులు తొలి నుంచి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. చివరి గడువు ఫిబ్రవరి 28 నాటికి అధికార పార్టీ నేతలు, మంత్రులు సమీకరణకు ఇవ్వని వారి భూములను సేకరిస్తామని భయపెట్టడంతో రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు.
మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అండగా నిలవడంతో నిడమర్రు, కురగల్లుతో పాటు చాలా గ్రామాల్లో రైతులు అంగీకార పత్రాలు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో రెవెన్యూ అధికారులు దళారులను రంగ ప్రవేశం చేయించి రైతుల నుంచి అంగీకారపత్రాలు తీసుకుంటున్నారు. గత నెలలో నిడమర్రు, కురగల్లు గ్రామాలలోనే సుమారు 50 ఎకరాలకు పైగా అంగీకారపత్రాలు తీసుకోవడం విశేషం. అయితే అంగీకార పత్రాలు పాత తేదీలతోనే తీసుకున్నట్టు సమాచారం.
ఇదే చాన్స్.. దోచేయ్..!
Published Sat, Apr 25 2015 2:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement