కమలాపురంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలుపడ్డారు. ఆలయంలోని గర్భగుడి తలుపులు పగులగొట్టిన దుండగులు అమ్మవారి వెండి విగ్రహం, ముఖావళి, వినాయకుని విగ్రహం, మూడు గ్రాముల బంగారుతో తయారు చేసిన అమ్మవారి బొట్టును ఎత్తుకెళ్లారు.
కమలాపురం, న్యూస్‌లైన్: కమలాపురంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలుపడ్డారు. ఆలయంలోని గర్భగుడి తలుపులు పగులగొట్టిన దుండగులు అమ్మవారి వెండి విగ్రహం, ముఖావళి, వినాయకుని విగ్రహం, మూడు గ్రాముల బంగారుతో తయారు చేసిన అమ్మవారి బొట్టును ఎత్తుకెళ్లారు. గర్భగుడి వెనుకనున్న బీరువాను ధ్వంసం చేసి అందులోని వెండి చెంబు, కలశం, శఠగోపం, హారతిపళ్లాలు, గిన్నె తదితర వాటిని దొంగలు అపహరించారు. మంగళవారం ఉదయమే కసువు ఊడ్చేందుకు వచ్చిన పని మనిషి అక్కడి దృశ్యాలను గమనించి వెంటనే విషయాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కామిశెట్టి వెంకట రమణయ్యకు తెలిపింది.
ఆయన కమిటీ సభ్యులతో కలసి ఆలయాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 6.8 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వాటి విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ లక్ష్మినారాయణ తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీంను రప్పించారు. వారు కాలి వేలిముద్రలను సేకరించారు. సాయంత్రం ఎర్రగుంట్ల సీఐ రామకృష్ణుడు ఆలయాన్ని సందర్శించారు. చోరీపై ఆరా తీశారు.