
6 భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం 94ను ఉల్లంఘించారు.
– కాగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణాల్లో భారీగా దోపిడీ జరిగినట్లు సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తేల్చిచెప్పింది. కాంట్రాక్టర్లకు అంతులేని ప్రయోజనం కలిగించారని, తద్వారా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ‘కాగ్’ ఆడిట్‌లో స్పష్టం చేసింది. సర్వే, ఇన్వెస్టిగేషన్ లేకుండానే సాంకేతిక అనుమ తులు ఇచ్చారని తప్పుపట్టింది. తాత్కాలిక సచివాలయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తోందన్న ఆరోపణలు మొదటినుంచే వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం కలిగించడంతోపాటు టెండర్ నిబంధనలన్నింటికీ తిలోదకాలు ఇచ్చారని, ఇంజనీరింగ్– ప్రొక్యూర్‌మెంట్– కనస్ట్రక్షన్(ఈపీసీ) విధానానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ‘కాగ్’ స్పష్టం చేయడం గమనార్హం.
ఈపీసీ నిబంధనలకు తిలోదకాలు
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వ్యవహారాలపై ‘కాగ్’ తొలిసారిగా 2017–18లో ఆడిట్ నిర్వహించింది. సర్కారు సాగించిన ఆక్రమాలను కడిగిపారేసింది. ‘కాగ్’ బహిర్గతం చేసిన అక్రమాలకు, సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వం నోరెల్లబెట్టింది. ప్రధానంగా తాత్కాలిక సచివాలయం పేరుతో 6 భవనాల నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లలో చోటుచేసుకున్న అక్రమాలను, కాంట్రాక్టు సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కల్పించిన తీరును ఆడిట్ నివేదికలో ‘కాగ్’ సోదాహరణంగా వివరించింది. 6 భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం 94ను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. భారీగా అధిక ధరలకు(ఎక్సెస్) టెండర్లను ఖరారు చేయడంపై ‘కాగ్’ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ–ప్రొక్యూర్‌మెంట్‌లో తొలుత అప్‌లోడ్ చేసిన అంతర్గత అంచనా వ్యయాన్ని(ఐబీఎం) ఆ తరువాత పెంచేయడాన్ని తప్పుపట్టింది. ఈపీసీ విధానంలో టెండర్లను 5 శాతం కంటే ఎక్సెస్‌కు ఖరారు చేయరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. 5 శాతం ఎక్సెస్‌కు టెండర్లు వస్తే వాటిని రద్దుచేసి రెండోసారి టెండర్లను ఆహ్వానించాలనే ఈపీసీలోని ప్రాథమిక నిబంధనలకే తిలోదకాలు ఇచ్చారని కాగ్ వెల్లడించింది. తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణాల అంచనా వ్యయాలను కాంట్రాక్టర్లకు 14 శాతం మేర లాభం వచ్చేలా రూపొందించారని కాగ్ తెలిపింది. కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలకు విరుద్ధంగా 5 శాతానికి మించి ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలతో సంప్రదింపులను జరిపారని పేర్కొంది.
రద్దు చేయాల్సింది పోయి చర్చలా?
తాత్కాలిక సచివాలయంలోని 6 బ్లాకులను రెండేసి బ్లాకులుగా కలిపి 3 ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించారు. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థలు అంతర్గత అంచనా వ్యయంపై ఏకంగా 62 శాతం నుంచి 85 శాతం వరకు ఎక్సెస్‌కు టెండర్లను దాఖలు చేశాయి. టెండర్లను రద్దు చేయాల్సింది పోయి ఆ రెండు సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపుల జరపడాన్ని కాగ్ తప్పుపట్టింది. సంప్రదింపుల తరువాత కూడా ఈ రెండు సంస్థలకు 16.24 శాతం నుంచి 24.75 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు బిల్లుల చెల్లింపులోనూ నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరించలేదని కాగ్ వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ శాతం మేర బిల్లులు చెల్లించారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ కమిషనర్ కాంట్రాక్టర్లకు రూ.40.80 కోట్ల అదనపు ప్రయోజనం కలిగేలా టెండర్లను ఖరారు చేసినట్లు కాగ్ తేటతెల్లం చేసింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment